Same Sex: ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా.. తను లేకుండా బతకలేను..!

నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. కానీ, నా సమస్య ఏంటంటే నేను కూడా అమ్మాయినే. మేము గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అయితే ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది.

Updated : 05 Jun 2024 20:45 IST

(Representational Image)

నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. కానీ, నా సమస్య ఏంటంటే నేను కూడా అమ్మాయినే. మేము గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అయితే ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. కానీ, తను మాత్రం నన్నే ఇష్టపడుతోందని నాకు తెలుసు. అయితే నేను నా తల్లిదండ్రుల పైనే ఆధారపడి జీవిస్తున్నాను. ప్రస్తుతం ఇల్లు వదిలి తనతో జీవించే పరిస్థితిలో నేను లేను. తను కూడా తల్లిదండ్రుల పైనే ఆధారపడుతోంది. ఇవన్నీ నన్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి. ఒకవేళ తను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నేను జీవించలేను. ఇప్పుడు నేను ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ ప్రశ్నలో ఎక్కువగా ‘నా, నేను’ అంటూనే ప్రస్తావించారు. మొదటగా ఆ అభిప్రాయం నుంచి మీరు బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ఏ బంధంలోనైనా ఇద్దరి అభిప్రాయాలూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, మీరు మీ ఇష్టాలు, అభిప్రాయాల గురించే ఎక్కువగా ప్రస్తావించారు. తన అభిప్రాయాన్ని కూడా మీ అభిప్రాయంగానే చెబుతున్నట్టుగా అర్థమవుతోంది. కాబట్టి, ఈ విషయంలో ముందుగా తన అభిప్రాయం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇందుకోసం తనతో ఒకసారి వివరంగా చర్చించే ప్రయత్నం చేయండి.

ఆ అమ్మాయి వేరే అబ్బాయితో పెళ్లికి సిద్ధపడిందని చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అయితే ఏది ఏమైనా ప్రస్తుతం ఆమె ఒక నిర్ణయం తీసేసుకుంది. ఒకవేళ మీ ఆలోచనను ముందుకు తీసుకెళ్లాలంటే తన ప్రస్తుత అభిప్రాయాన్ని, తీసుకున్న నిర్ణయాన్ని తను మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఒక నిర్ణయానికి రావడం మంచిదేమో ఆలోచించండి. అప్పటికీ ఒత్తిడి నుంచి బయటపడలేకపోతుంటే మానసిక నిపుణులను సంప్రదించండి.

ఇక- స్వలింగ వివాహాలకు సంబంధించి ఇప్పటికీ సమాజంలో అనేక భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వివాహాలకు చాలా కుటుంబాలలో మద్దతు లభించడం లేదు. ఈ క్రమంలో- మీరు తీసుకునే నిర్ణయం మీ కుటుంబ నేపథ్యం, సంప్రదాయాలకు లోబడి ఉంటుందా లేదా అనే విషయం కూడా ఆలోచించండి. ఆ అమ్మాయి పైన మీ ఇష్టం లేదా పెళ్లి విషయంలో మీ అభిమతం మీ కుటుంబం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా విశ్లేషించుకోండి. మీ ఇద్దరూ కలిసి జీవించే విషయంలో మీ ఇరువురి కుటుంబ సభ్యుల మద్దతు ఎంతవరకు లభిస్తుందన్నది కూడా ముఖ్యమైన అంశమే. అలాగే ఈ విషయంలో చట్టబద్ధత, సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లను మీరు ఎంతవరకు ఎదుర్కోగలరో కూడా ఆలోచించుకోండి. అన్నిటికన్నా ముందు- అసలు ఈ విషయంలో మీకు మీరుగా ఊహించుకోవడం కాకుండా మీరు ప్రేమిస్తున్న అమ్మాయి అభిప్రాయాన్ని, ఆలోచనలను కూడా స్పష్టంగా తెలుసుకోండి..

ఈ విషయంలో ఇతరుల అభిప్రాయాలు, సలహాల కన్నా వ్యక్తిగతంగా మీరేం కోరుకుంటున్నారో, ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలను, సవాళ్లను మీరు ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారో మీకు మీరు స్పష్టత తెచ్చుకుని తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఇక- స్వలింగ వివాహం విషయం పక్కన పెడితే ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండాలంటే కేవలం ప్రేమ ఒక్కటి ఉంటే సరిపోదు. మీరు ఇప్పటికీ తల్లిదండ్రుల పైనే ఆధారపడుతున్నారని అంటున్నారు. కాబట్టి, మీ కాళ్ల మీద మీరు నిలబడడానికి ప్రయత్నించండి. మీ చదువు, ఉద్యోగం గురించి మీరు ప్రస్తావించలేదు. ఒకవేళ మీరు చదువుకుంటే తగిన ఉద్యోగం కోసం ప్రయత్నించండి. లేదంటే ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో ఎన్నో సర్టిఫికేషన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని పూర్తి చేసి మంచి ఉద్యోగం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కసారి మీ కాళ్ల మీద మీరు నిలబడితే స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుంది. అలాగే మీ ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్