పక్క తడిపే అలవాటును మాన్పించడం ఎలా?

మా అమ్మాయి వయసు 7 సంవత్సరాలు. ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కానీ తనకు రాత్రి పూట పక్క తడిపే అలవాటు ఉంది. వయసు పెరుగుతోన్నా తనకు ఈ అలవాటు పోవడం లేదు.

Published : 12 Dec 2023 12:24 IST

మా అమ్మాయి వయసు 7 సంవత్సరాలు. ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కానీ తనకు రాత్రి పూట పక్క తడిపే అలవాటు ఉంది. వయసు పెరుగుతోన్నా తనకు ఈ అలవాటు పోవడం లేదు. నిద్రపోయే ముందు నీళ్లు తాగకుండా ఉండడం, బెడ్ మీదకు వెళ్లే ముందు మూత్ర విసర్జన చేయించడం చేసినా పక్క తడపడం మానడం లేదు. దయచేసి మా అమ్మాయి ఈ సమస్య నుంచి బయటపడేందుకు సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీరు చెప్పే ఈ సమస్యను మెడికల్‌ టెర్మినాలజీలో Enuresis అంటారు. దీనినే పక్క తడపడం అంటుంటాం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పుట్టినప్పటి నుంచి కంట్రోల్‌ లేకపోవడం వల్ల చాలామంది పిల్లలు పక్క తడుపుతుంటారు. ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఇక రెండో దశలో కొంతకాలం పాటు పక్క తడిపే అలవాటు పోయి తిరిగి ఒకటి, రెండు సంవత్సరాల తర్వాత వస్తుంటుంది. నరాలు, వెన్నెముక, మూత్రాశయంలో సమస్య ఉండడం వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది. అలాంటప్పుడు సమస్యను బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. మీ పాపకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవంటున్నారు. కాబట్టి, అది మొదటి దశ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకరకమైన బద్ధకం వల్ల వస్తుంటుంది. ఈ అలవాటును మాన్పించడానికి మీరు కొన్ని చిట్కాలు పాటిస్తున్నారని చెప్పారు. వీటినే బ్లాడర్‌ అలార్మింగ్‌ ఎక్సర్‌సైజెస్‌ అంటుంటారు. అయితే వీటిని క్రమం తప్పకుండా 60 రోజుల పాటు చేయించాలి. ఇందుకోసం మూడు రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.

మొదటిది నిద్రపోయే గంట ముందు ద్రవ పదార్థాలకు దూరంగా ఉంచడం. రెండోది పడుకునే ముందు వాష్‌రూంకి తీసుకెళ్లడం. మూడో చిట్కాను అలారం మెకానిజం అంటారు. నిద్రపోయిన మూడు గంటల తర్వాత వాష్‌రూంకి తీసుకెళ్లడం, మళ్లీ తిరిగి మరో మూడు గంటల తర్వాత అలారం పెట్టుకుని వాష్‌రూంకి తీసుకెళ్లడం. ఉదాహరణకు మీ పాప రాత్రి 10 గంటలకు పడుకుంటుంది అనుకుంటే.. ఒంటి గంటకు ఒకసారి తిరిగి 4 గంటలకు మరోసారి వాష్‌రూంకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇలా 60 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే మూత్రాశయం కూడా ఆ సమయాలకు అలవాటు పడుతుంది. దాంతో పక్క తడిపే అవకాశం చాలావరకు తగ్గుతుంది. ఆడపిల్లలకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌ ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి, డాక్టర్‌ను సంప్రదించి అలాంటి సమస్య ఉందేమో చెక్‌ చేసుకుని తగిన చికిత్స తీసుకోండి. దీని ద్వారా కూడా సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్