తోడికోడళ్ల మాటలు భరించలేకపోతున్నా..!

నాకు పెళ్లై మూడేళ్లయింది. మాది ప్రేమ వివాహం. మా అత్తమామలు అయిష్టంగానే మా పెళ్లికి ఒప్పుకున్నారు. మా వారు ఉన్నత కుటుంబానికి చెందినా ఏ విషయంలోనూ ఆ తేడా చూపించరు. కానీ, నా తోడికోడళ్లు మాత్రం అవమానిస్తున్నారు. మేము విడిగానే ఉంటున్నా.. ఏదో ఒక సందర్భంలో వారితో కలవాల్సి.....

Published : 20 Dec 2022 20:04 IST

నాకు పెళ్లై మూడేళ్లయింది. మాది ప్రేమ వివాహం. మా అత్తమామలు అయిష్టంగానే మా పెళ్లికి ఒప్పుకున్నారు. మా వారు ఉన్నత కుటుంబానికి చెందినా ఏ విషయంలోనూ ఆ తేడా చూపించరు. కానీ, నా తోడికోడళ్లు మాత్రం అవమానిస్తున్నారు. మేము విడిగానే ఉంటున్నా.. ఏదో ఒక సందర్భంలో వారితో కలవాల్సి వస్తోంది. ఆ సమయంలో అందరిముందు మా కులం, పుట్టింటివారి ఆర్ధిక స్థితిగతులు మొదలైనవాటి గురించి మాట్లాడి నన్ను బాధపెడుతున్నారు. ఈ విషయం గురించి నా భర్తతో చెబితే ‘వారి మాటలు పట్టించుకోకు’ అని సమాధానమిస్తున్నారు. కానీ, నేను అలా ఉండలేకపోతున్నాను. మానసికంగా కుంగిపోతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు - ఓ సోదరి

జ. పెళ్లైన తర్వాత అత్తారింటికి వెళ్లినప్పుడు కొంతమంది విషయంలో ఇలాంటి సమస్యలు ఎదురవడం సహజమే.  ఉమ్మడి కుటుంబంలో ఉన్నా, వేరు కాపురమైనా ఈ సమస్య కనిపిస్తుంటుంది. అందులోనూ మీ అత్తమామలు మీ పెళ్లికి అయిష్టంగానే ఒప్పుకున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి సమస్యలు సహజమే. అయితే మీ తోడికోడళ్లు ఎంత చులకనగా మాట్లాడుతున్నా వారి మాటలను తలచుకుని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గమనించండి. అలాగే వారికి దూరంగా ఉండడం సమస్యకు పరిష్కారం కాదన్న విషయాన్నీ  అర్థం చేసుకోండి.

ఒకవేళ మీ తోడికోడళ్లకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తే వారికి మీరు మరింత చులకనైపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఈ క్రమంలో ‘మన మాటలకు భయపడి తట్టుకోలేక పారిపోతోంది' అన్న భావన వారిలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. మీ గురించి, మీ పుట్టింటి వారి గురించి ఎవరేమన్నా సరే.. మీరేమిటో మీకు బాగా తెలుసు.. ఎవరో ఏదో అన్నారని ఆత్మవిశ్వాసం కోల్పోకండి.. ఆత్మ న్యూనతకు లోనుకాకండి.. మీ పరిధిలో మీరు ఉంటూనే అందరితో కలుపుగోలుగా ఉండడానికి ప్రయత్నించండి. మీ తోడికోడళ్ల మాటలు పట్టించుకోకుండా మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్లడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ‘ఈ అమ్మాయి మన మాటలు పట్టించుకోవడం లేదు. అలా వదిలేస్తేనే మంచిది’ అని వాళ్లు వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్య నుంచి పారిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. ఫలితం కచ్చితంగా అనుకూలంగా వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్