పెళ్లయ్యాక కలవలేదు.. గే వెబ్‌సైట్లు చూస్తున్నాడు!

మాకు పెళ్లై ఏడాదవుతోంది. కానీ, ఇంతవరకు మా మధ్య శారీరక సంబంధం లేదు. ప్రతిసారీ ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నాడు. మధ్యలో ఆఫీసు పనిమీద రెండు నెలల పాటు వేరే ప్రాంతానికి వెళ్లాడు. తిరిగి వచ్చిన తర్వాత కూడా నాకు దూరంగానే ఉంటున్నాడు....

Published : 24 May 2024 21:16 IST

(Image For Representation)

మాకు పెళ్లై ఏడాదవుతోంది. కానీ, ఇంతవరకు మా మధ్య శారీరక సంబంధం లేదు. ప్రతిసారీ ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నాడు. మధ్యలో ఆఫీసు పనిమీద రెండు నెలల పాటు వేరే ప్రాంతానికి వెళ్లాడు. తిరిగి వచ్చిన తర్వాత కూడా నాకు దూరంగానే ఉంటున్నాడు. ఇదిలా ఉంటే- తను గే వెబ్‌సైట్లు చూడడం ఈ మధ్యే గమనించాను. ఈ విషయం గురించి నేరుగా తనని అడిగేయచ్చా? అలా చేస్తే మా దాంపత్యం ఇంతటితో ముగిసిపోతుందా? ఈ విషయంలో నేను ఎలా ముందుకు వెళ్లాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. ఈ రోజుల్లో దాంపత్య బంధంలో వ్యక్తిగత స్వేచ్ఛను వెతుక్కునే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో జీవిత భాగస్వామిని ఇబ్బంది పెట్టడం దాంపత్య బంధంలోని ప్రాథమిక సూత్రానికి విరుద్ధమన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
దాంపత్య బంధానికి సంబంధించి అతని నుంచి సానుకూల స్పందన రావడం లేదని అంటున్నారు. ఏడాది కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవతలి నుంచి స్పందన లేకపోవడం మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తున్నట్టుగా అర్థమవుతోంది. సమస్యను మీలో దాచుకుని బాధపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి, అసలు విషయాన్ని అతనితోనే చర్చించడం మంచిది. ఈ క్రమంలో స్నేహపూర్వక వాతావరణంలో అతని సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ శృంగారానికి సంబంధించి తనకు ఏమైనా భయాలు ఉన్నాయా? అన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి.
అలాగే అతను గే వెబ్‌సైట్లు చూస్తున్నాడని చెబుతున్నారు. అతనితో ఈ విషయం గురించి కూడా చర్చించండి. అతనితో మాట్లాడేటప్పుడు గొడవ పడకుండా సంయమనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ క్రమంలో మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల మీరు పడుతున్న బాధను తెలిపే ప్రయత్నం చేయండి.
అయితే అతనితో చర్చించే ముందుగా మీరు కొన్ని విషయాలపై మానసికంగా సిద్ధమవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు ఊహిస్తున్న విధంగా అతను నిజంగానే గే అయితే అతనితో దాంపత్య బంధం ముగిసిపోయే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి, అందుకు ముందుగానే మానసికంగా సిద్ధమవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో- ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే- ‘నేను తిరిగి కొత్త జీవితం ప్రారంభించగలను' అన్న ధైర్యాన్ని సంపాదించుకోవాలి. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మీ వైపు ఉన్న సానుకూలతలపై దృష్టి పెట్టగలగాలి.
పెళ్లి అనేది కేవలం ఇద్దరి మధ్య బంధం కాదు. ఉమ్మడి బాధ్యత. ఇరువురి కుటుంబ సభ్యుల కలయిక. కాబట్టి, అతని నుంచి సానుకూల స్పందన రాకపోతే సమస్యను ఇరు పక్షాల పెద్దలకు తెలియజేయండి. అలాగే అవసరాన్ని బట్టి రిలేషన్‌షిప్‌ నిపుణులను కూడా సంప్రదించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్