Updated : 08/03/2022 19:18 IST

ఇంటా, బయటా గెలుపు ఎలా?

సాధికారత అంటే.. ఏ ఒక్క రంగానికో పరిమితం కాదు.. ఇటు ఇంట్లోని బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూనే.. అటు వృత్తినీ బ్యాలన్స్‌ చేసుకోవడం, తల్లిగా పిల్లల్ని ఉత్తమంగా తీర్చిదిద్దడం, ఇంటి ఆర్థిక వ్యవహారాల్లో చురుగ్గా ఉంటూ కుటుంబాన్ని అభివృద్ధి చేయడం, ఇలా ఎన్ని పనులతో తీరిక లేకుండా ఉన్నా.. తనకంటూ కాస్త సమయం కేటాయించుకొని ఆరోగ్యంగా-ఫిట్‌గా మారడం.. ఇలా అతివ అన్ని కోణాల్లో అభివృద్ధి సాధిస్తేనే సంపూర్ణ సాధికారత సాధించినట్లు లెక్క. మరి ఇది ఆచరణలో సాధ్యం కావాలంటే ఏం చేయాలి? కొంతమంది నిపుణులు అందిస్తున్న విలువైన సలహాలు, సూచనలు తెలుసుకుందాం రండి..

60:40 ప్రిన్సిపుల్

ఒక మహిళ తన కెరీర్‌లో బిజీగా ఉండడం వల్ల ఇంట్లో తగిన సమయం కేటాయించలేక బంధాలను కోల్పోతుంది అని చాలామంది భావన. కానీ అది ఒక అపోహ మాత్రమే. అది అందరి జీవితాల్లో నిజం కాదు. కాబట్టి మహిళలు అటు తమ కెరీర్‌లో ముందుకు సాగుతూనే.. ఇటు కుటుంబానికి సమయం ఇవ్వడమనేది 60:40 ప్రిన్సిపుల్‌గా పరిగణిస్తాం. అంటే 60 శాతం కెరీర్‌కు ప్రాధాన్యమిస్తూ.. 40 శాతం కుటుంబానికి సమయమివ్వాలి. అయితే కొందరు మహిళలు అలా బ్యాలన్స్‌ చేసుకోలేకపోవడానికీ కొన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా మహిళలు పనులకు ప్రాధాన్యతనివ్వడంలో విజ్ఞత కోల్పోతున్నారు. అంటే కెరీర్‌లో రాణించాలన్న ఆతృతతో వారికి దేనికెంత ప్రాధాన్యం ఇవ్వాల్లో తెలియట్లేదు. కొంతమంది మహిళలు పిల్లల బాధ్యతలను తమ అభివృద్ధికి అడ్డంకిగా భావిస్తున్నారు. కానీ మనం ఉద్యోగం చేసేది, డబ్బులు సంపాదించేది మన పిల్లల కోసమే అనే విషయాన్ని గుర్తించాలి. ఈ క్రమంలో వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ అనేది చాలా అవసరం.

అయితే ఒక్కోసారి ఆఫీసులో పని ఒత్తిడి వల్ల మనకు తెలియకుండానే కోపమొచ్చేస్తుంటుంది. ఇలాంటి సమయంలో అతిగా రియాక్ట్‌ కాకుండా కాస్త గ్యాప్‌ తీసుకోవాలి. తద్వారా కోపం తగ్గి ఆలోచనా శక్తి పెరుగుతుంది. అప్పుడు ఏం మాట్లాడాలో మనకు అర్థమవుతుంది. ఇలా ప్రతి సందర్భంలోనూ స్పందించే విజ్ఞత అనేది మహిళలు అలవర్చుకోవాలి. తద్వారా ఇంట్లో గొడవలు రావు.. అలాగే అది కెరీర్‌ అయినా, ఏదైనా సరే.. మన కుటుంబం తర్వాతే అన్న విషయం గుర్తుంచుకోవాలి. అలాగే ఉద్యోగం చేసే మహిళలకు తమ కుటుంబ సభ్యులు, భర్త, పిల్లల సపోర్ట్‌ కూడా చాలా అవసరం. భార్యాభర్తలిద్దరూ అన్ని బాధ్యతల్నీ కలిసి పంచుకోవాలి. అన్ని పనుల్నీ కలిసే షేర్‌ చేసుకోవాలి. అప్పుడు పని ఒత్తిడీ తగ్గుతుంది.. ఇద్దరి మధ్య అనుబంధమూ రెట్టింపవుతుంది.

ఇంకొంతమంది మహిళలు తాము ఉద్యోగం చేయడం వల్ల ఇంట్లో వారికి తగిన సమయం కేటాయించట్లేదని గిల్టీగా ఫీలవుతుంటారు. కానీ మనం అంతగా కష్టపడేది మన వాళ్ల కోసమేనని గ్రహించాలి. మీకు మరో విషయం తెలుసా.. గృహిణుల కంటే వర్కింగ్‌ మదర్సే తమ పిల్లల్ని బాగా పెంచగలుగుతారని చాలా పరిశోధనల్లో తేలిన నిజం. ఇది చాలామందికి తెలియని సీక్రెట్‌ కూడా! ఎందుకంటే ఉద్యోగాలు చేసే తల్లుల పిల్లలు తమ తల్లుల్నే రోల్‌మోడల్‌గా చేసుకుంటారు. ఆత్మవిశ్వాసం, నిర్ణయాలు తీసుకోవడం, సమస్యల్ని పరిష్కరించడం, ఉదయాన్నే లేచి నీట్‌గా రడీ అయ్యే విధానం.. ఇలా ప్రతి విషయాన్నీ పిల్లలు తమ తల్లుల్ని చూసే నేర్చుకుంటుంటారు.


సంస్థలు ఫిమేల్-ఫ్రెండ్లీగా ఉండాలి!

ఎవరి జీవితంలోనైనా రెండు రకాల సంబంధాలుంటాయి. ఒకటి - ఇంటర్‌పర్సనల్‌ రిలేషన్‌షిప్‌.. అంటే మనకు, ఇతరులతో ఉన్న సంబంధం. రెండోది - ఇంట్రాపర్సనల్‌ రిలేషన్‌షిప్‌.. అంటే మనతో మనకున్న అనుబంధం. ఇది అన్నింటికంటే ముఖ్యమైంది. మహిళలు ఈ పని చేయాలి.. అలా చేయకూడదు.. ఈ ఉద్యోగం చేయాలి.. అంటూ చాలామంది చాలా రకాలుగా చెబుతుంటారు. కానీ మహిళలంతా వీటన్నింటినీ పక్కన పెట్టి మనకేం కావాలి అనేది ముందుగా ఆలోచించుకోవాలి. ఏదైనా ఉద్యోగం చేయాలన్నా, కెరీర్‌లో రాణించాలన్నా, వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేసుకోవాలన్నా.. మనతో మనకున్న సంబంధాన్ని దృఢపరచుకోవడం ముఖ్యం. అప్పుడే ఇతరుల అభిప్రాయాల్ని వింటూ మనకేమవసరమో గ్రహించగలుగుతాం.

అలాగే వర్కింగ్‌ మదర్స్‌ ఎంత ప్రణాళికాబద్ధంగా ఉంటే వాళ్లు తమ ఇంటిని, ఉద్యోగాన్నీ అంతగా బ్యాలన్స్‌ చేసుకోగలుగుతారు. సక్సెస్‌ కాగలుగుతారు. భార్యగా, అమ్మగా, ఉద్యోగినిగా.. ఇలా రోజూ మనం ఎన్నో పాత్రల్ని పోషిస్తాం. కాబట్టి వాటికి తగ్గట్లుగా మనల్ని మనం మలచుకుంటూ ఓ ప్లాన్‌ వేసుకుంటే తప్ప వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ సాధ్యం కాదు. ఈ క్రమంలో క్యాలెండర్స్‌ పెట్టుకోవడం, టు-డూ లిస్ట్‌లు పెట్టుకోవడం, జర్నల్‌లో రాసుకోవడం.. ఇలా కుటుంబ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించాలంటే ఓ పక్కా ప్రణాళిక ఉండాల్సిందే!

ఇక మహిళలు తమ కెరీర్‌లో సాధికారత సాధించాలంటే తాము పనిచేసే సంస్థల్లో వారికి కొన్ని సౌకర్యాలు కల్పించాలి. ఉదాహరణకు.. ఆఫీసుల్లోనే క్రెష్‌ పెట్టడం, పనివేళలు మహిళలకు అనువైన సమయాల్లోనే నిర్దేశించడం, ఇంటి నుంచే పనిచేసే ఆప్షన్లివ్వడం, వారికి కేటాయించే సెలవుల సంఖ్య పెంచడం, వాళ్లకు అనువుగా ఉండేట్లుగా రీ-జాయినింగ్‌ ఆప్షన్లివ్వడం.. వంటివి చేయాలి. అయితే కొన్ని సంస్థలు ఇలాంటి ఆప్షన్లను ఇస్తామని చెబుతున్నారే తప్ప వాటిని ఆచరణలో పెట్టట్లేదు. కాబట్టి కెరీర్‌లో మహిళలు అభివృద్ధి పథంలో పయనించాలంటే ఆయా సంస్థలు ఫిమేల్-ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది.


మన ఆరోగ్యమే కుటుంబ క్షేమం!

ఈ రోజుల్లో చాలామంది మహిళలు ఇటు ఇంటి పనుల రీత్యా, అటు వృత్తిపరంగా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలో తమ కోసం అంటూ కాస్త సమయం కూడా కేటాయించుకోలేకపోతున్నారు. కానీ నేటి మహిళలు అన్ని పనులను సమర్థంగా నిర్వర్తించాలంటే ముందు వారు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడం చాలా ముఖ్యం. అయితే ఇందుకోసం గంటల కొద్దీ సమయం కేటాయించాల్సిన పనిలేదు. రోజూ కేవలం అరగంట చొప్పున వ్యాయామానికి కేటాయిస్తే సరిపోతుంది. లేదంటే అరగంట యోగాపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా యోగాలో ప్రాణాయామాలు చేయడానికి చాలా తక్కువ సమయం పట్టడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి.

ఐదు ప్రాణాయామాలకు ఒక్కో దానికి ఐదు నిమిషాల చొప్పున కేటాయించుకొని, ఆఖరి ఐదు నిమిషాల పాటు సూర్య నమస్కారాలకు కేటాయిస్తే శరీరానికి చక్కటి వ్యాయామం అందుతుంది. శరీరంలోని అన్ని అవయవాలూ శుద్ధి అవుతాయి. అలాగే మానసికంగానూ దృఢంగా మారతాం. కాబట్టి ప్రతి మహిళా యోగాను ఓ అలవాటుగా మార్చుకోవాలి. ఒకవేళ రోజూ చేయడం వీలు కాని పరిస్థితుల్లో వారానికి కనీసం ఐదు రోజులైనా యోగా చేసేలా ప్రణాళిక వేసుకోవాలి.

ఇక ఆహారపుటలవాట్ల విషయానికొస్తే.. ఈ రోజుల్లో చాలామంది భోంచేయడాన్ని కూడా ఏదో పనిలా భావిస్తున్నారు. తీరిక లేని షెడ్యూల్‌ కారణంగా ఐదు నిమిషాల్లోనే గబగబా తినేస్తున్నారు. దీనివల్ల గ్యాస్ట్రిక్‌, అజీర్తి.. వంటి ఎన్నో ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి తినడానికి కూడా కాస్త సమయం కేటాయించాలి. కనీసం పావుగంట పాటైనా మనం తీసుకునే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా అరుగుదల బాగుంటుంది.. ఉదర సంబంధిత సమస్యలు కూడా తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే ఉదయం లేవగానే గోరువెచ్చటి నీరు తాగడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. సాత్వికాహారం.. అందులోనూ ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు, స్ప్రౌట్స్‌, సలాడ్స్‌.. వంటివి తీసుకోవడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.


అవగాహనతోనే ఆర్థిక స్వాతంత్ర్యం!

కుటుంబ ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టగల సమర్థులు మహిళలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారికి సహజసిద్ధంగానే ఆ శక్తి ఉంటుంది. పొదుపులో మహిళలే ఉత్తమం కానీ.. ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే పొదుపు చేస్తే చాలదు.. పెట్టుబడులు కూడా పెట్టాలి. వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్న మహిళల సంఖ్య గతంలో కన్నా పెరుగుతోంది. అయితే వీరి సంఖ్య మరింత పెరగాలి.

ఎందుకంటే పొదుపు చేస్తే రాబడి తక్కువగా ఉంటుంది.. అదే పెట్టుబడి పెడితే రాబడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెట్టుబడుల గురించి మహిళలు అవగాహన పెంచుకుంటే పరిపూర్ణ ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించినట్లే! ప్రస్తుతం ఆదాయ మార్గాలు కూడా మెండుగానే ఉన్నాయి కాబట్టి సంపాదన, పొదుపుతో పాటు పెట్టుబడులు పెట్టే స్థాయికి కూడా స్త్రీ ఎదిగినప్పుడే సంపూర్ణ ఆర్థిక సాధికారత సొంతమవుతుంది. ఈ క్రమంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ తానొక్కరే కాకుండా తమ కుటుంబ సభ్యులతో అంటే భర్త, పిల్లలతోనూ చర్చించి తీసుకోవడం మంచిది. ఇలా పిల్లల్నీ ఈ విషయంలో భాగం చేయడం వల్ల వారికీ చిన్నతనం నుంచే ఆర్థిక విషయాలు అర్థమవుతాయి. పొదుపు గురించి కూడా తెలుస్తుంది.


మన చేతులే చురకత్తులు!

మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్న ఈ రోజుల్లోనూ మహిళా భద్రత ప్రశ్నార్థకంగానే ఉంది. ఇలాంటి సమయంలో మహిళలు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలంటే ఆత్మరక్షణ విద్యలు చాలా అవసరం. మనల్ని మనం రక్షించుకునే నైపుణ్యాలు పెంపొందించుకున్నప్పుడు మనం ధైర్యంగా ముందడుగు వేయగలుగుతాం. అలాగే మనం చేసే పనిపై ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. రాత్రీపగలూ అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా అడుగు బయట పెట్టగలిగే ధైర్యం మనలో అలవడుతుంది. అది చిన్న పనైనా, పెద్ద పనైనా మనలో ఆత్మస్థైర్యం ఉన్నప్పుడే చేయగలం.

ఏదైనా ఆపద ఎదురైనప్పుడు మన బ్యాగ్‌లో పెప్పర్‌ స్ప్రే వంటి ఎమర్జెన్సీ వస్తువులున్నప్పటికీ వాటిని బయటికి తీసే సమయం కూడా ఆ అత్యవసర పరిస్థితిలో మనకు ఉండకపోవచ్చు. అవన్నీ ఉన్నా కూడా మనలో ధైర్యం లేనప్పుడు ఏమీ ఉపయోగించలేం. కాబట్టి ఎప్పుడైతే మనలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం ఉంటాయో.. అప్పుడు ఏ ఆపద వచ్చినా మన చేతులే చురకత్తులవుతాయి. వాటితోనే ఎదుటివారి వీక్‌ పాయింట్స్‌పై అటాక్‌ చేయగలుగుతాం. ఈ ఆత్మరక్షణ విద్యల వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతాం.. కాబట్టి ఆ ఆపద నుంచి ఈజీగా బయటపడచ్చు. మహిళ తనలోని శక్తిసామర్థ్యాలను గుర్తించి, తనను తాను ప్రేమించుకొని, తన విలువలను తాను కాపాడుకున్నప్పుడు ప్రతి రోజూ విమెన్స్‌ డేనే అవుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని