Ragneeti: బ్రేక్‌ఫాస్ట్‌ టేబుల్‌ వద్ద మాటలు, మనసులు కలిశాయ్‌!

ప్రేమకు పునాది స్నేహం అంటుంటారు. అలా స్నేహితులుగా పరిచయమై.. ప్రేమతో దగ్గరై.. తాజాగా పెళ్లితో ఒక్కటయ్యారు సెలబ్రిటీ కపుల్‌ పరిణీతి చోప్రా-రాఘవ్‌ చద్దా. కాలేజీ రోజుల్లో ప్రారంభమైన తమ ప్రేమను ఇటీవలే నిశ్చార్థంతో ఓ మెట్టెక్కించిన ఈ జంట వివాహం ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

Published : 26 Sep 2023 12:08 IST

(Photos: Instagram)

ప్రేమకు పునాది స్నేహం అంటుంటారు. అలా స్నేహితులుగా పరిచయమై.. ప్రేమతో దగ్గరై.. తాజాగా పెళ్లితో ఒక్కటయ్యారు సెలబ్రిటీ కపుల్‌ పరిణీతి చోప్రా-రాఘవ్‌ చద్దా. కాలేజీ రోజుల్లో ప్రారంభమైన తమ ప్రేమను ఇటీవలే నిశ్చార్థంతో ఓ మెట్టెక్కించిన ఈ జంట వివాహం ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఒక్కటైన ఈ జంట.. తమ పెళ్లి ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయారు. మరి, కెరీర్‌ నేపథ్యాలు వేరైనా.. తమ ప్రేమను శాశ్వతం చేసుకున్న ‘రాగ్‌ణీతి’ ప్రేమకథ, పెళ్లి ముచ్చట్ల గురించి తెలుసుకుందాం రండి..

ఒకే రంగంలో ఉన్న వాళ్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం మనం చూస్తుంటాం. కానీ తమ దారులు వేరైనా.. గమ్యస్థానం ఒక్కటే అంటూ దగ్గరైపోయారు రాఘవ్‌-పరి. పరిణీతి బాలీవుడ్‌ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. రాఘవ్‌ రాజకీయ నాయకుడిగా, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయినా గత కొన్నేళ్ల క్రితం వీరిద్దరి మధ్య పుట్టిన ప్రేమ.. ఈ ఏడాది మేలో నిశ్చితార్థంతో ఓ మెట్టెక్కింది. ఇక తాజాగా పెళ్లితో తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకుందీ ‘రాగ్‌ణీతి’ జంట.

లండన్‌లో.. హ్యాపీడేస్!

పరిణీతి-రాఘవ్‌ చద్దాలను మనం జంటగా చూసింది కొన్నాళ్ల క్రితమే! ఈ ఏడాది మార్చిలో ఇద్దరూ కలిసి బాంద్రాలోని ఓ రెస్టరంట్‌ నుంచి బయటికొస్తున్నప్పుడు తొలిసారి కెమెరా కంట పడిందీ జంట. ఇక అప్పట్నుంచి వీళ్ల మధ్య ఏదో నడుస్తోందన్న సందేహాలు ఫ్యాన్స్‌లో మొదలయ్యాయి. ఆపై ఎయిర్‌పోర్ట్‌లో, మొహాలీలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో మరోసారి జంటగా కనిపించి.. అందరి అనుమానాలకు మరింత బలం చేకూర్చారు పరి-రాఘవ్. అయినా తమ అనుబంధం గురించి పెదవి విప్పలేదు. ఇక వీరిద్దరి ప్రేమ శాశ్వతమవ్వాలంటూ ఎంపీ సంజీవ్‌ అరోరా ట్వీట్‌ చేయడంతో.. ఈ జంట ప్రేమబంధం గురించి ఎట్టకేలకు బయటపడింది.

అయితే నిజానికి వీరిద్దరూ కాలేజీ రోజుల్లోనే కలుసుకున్నారట! పరిణీతి లండన్‌లోని ‘మాంచెస్టర్ బిజినెస్‌ స్కూల్లో’ ట్రిపుల్‌ డిగ్రీ (బిజినెస్‌, ఫైనాన్స్‌, ఎకనామిక్స్) చదివేటప్పుడు, రాఘవ్‌ ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌’లో EMBA సర్టిఫికేషన్‌ కోర్సు చేస్తున్నాడు. ఆ సమయంలోనే తొలిసారి వీరిద్దరూ కలుసుకున్నారు. స్నేహితులయ్యారు.. అయితే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టింది మాత్రం గతేడాది ‘చమ్కీలా’ సినిమా షూటింగ్‌లోనేనట! ఈ చిత్ర షూటింగ్‌ కోసం పంజాబ్‌ వెళ్లిన పరిని.. రాఘవ్‌ అక్కడే కలుసుకోవడం, ఆపై ప్రేమించుకోవడం.. చకచకా జరిగిపోయాయట! ఇక ఇన్నాళ్లూ ఈ విషయాన్ని దాస్తూ వచ్చిన ఈ జంట.. నిశ్చితార్థంతో తమ ప్రేమను బయటపెట్టి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది.

ఒకరికొకరం.. నువ్వు-నేను!

అయితే ఈ లవ్లీ కపుల్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగినప్పట్నుంచి.. వీళ్ల పెళ్లెప్పుడా అని ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురుచూశారు. అందరి ఎదురుచూపులకు తెరదించుతూ తాజాగా గ్రాండ్‌ వెడ్డింగ్‌తో ఒక్కటైందీ జంట. ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలస్‌ వీరి పెళ్లికి వేదికైంది. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకుందీ జంట. పంజాబీ సంప్రదాయం ప్రకారం జరిగిన వీరి పెళ్లి వేడుకల్లో భాగంగా నవ దంపతులిద్దరూ మ్యాచింగ్‌ దుస్తుల్లో మెరిసిపోయారు. ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అన్నట్లుగా ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’లా ఆకట్టుకుందీ జంట. వివాహం అనంతరం తమ పెళ్లి ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు రాగ్‌ణీతి.

‘బ్రేక్‌ఫాస్ట్‌ టేబుల్‌ వద్ద తొలిసారి కలుసుకొని మాట్లాడుకున్న మాటలు మాకు ఎప్పటికీ గుర్తే! ఈరోజు కోసమే ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నాం. భార్యాభర్తలుగా మారి మా ఎదురుచూపులకు తెరదించడం సంతోషంగా ఉంది.. ఒకరు లేకుండా మరొకరం జీవించలేం.. పెళ్లితో మా కలల జీవితం ప్రారంభమైంది..’ అంటూ తమ మనసులోని సంతోషాన్ని పంచుకుందీ ముద్దుల జంట. ప్రస్తుతం వీళ్ల పెళ్లి, ఫొటోలు ‘రాగ్‌ణీతి’ అనే పేరుతో వైరల్‌గా మారాయి.

భర్త పేరుతో సర్‌ప్రైజ్‌..!

తమ పెళ్లి కోసం ఎరుపు, పసుపు.. వంటి సంప్రదాయ రంగులు కాకుండా మోడ్రన్‌ కలర్స్‌ ఎంచుకుంటున్నారు ఈ కాలపు వధువులు. పరిణీతి కూడా ఇదే ట్రెండ్‌ ఫాలో అయింది. ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేసిన ఐవరీ రంగు భారీ డిజైనర్‌ లెహెంగాలో ముస్తాబైందీ బ్యూటీ. భారీ ఆభరణాలతో తన బ్రైడల్‌ లుక్‌ని పూర్తిచేసిన పరి.. తక్కువ మేకప్‌తో, వదులైన హెయిర్‌స్టైల్‌తో మెరిసిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ వెడ్డింగ్‌ లెహెంగాలో ఆమె ధరించిన వెయిల్‌ హైలైట్‌గా నిలిచిందని చెప్పచ్చు. డ్రస్‌కు మ్యాచింగ్‌గా హెవీ ఎంబ్రాయిడరీ బోర్డర్‌తో డిజైన్‌ చేసిన వెయిల్‌పై తన భర్త ‘రాఘవ్‌’ పేరును దేవనాగరి లిపిలో ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంది పరి. తద్వారా తన ఇష్టసఖుడిపై ఉన్న ఇష్టాన్ని మరోసారి చాటుకుంది. ఇక వరుడు కూడా తన ఇష్టసఖి డ్రస్‌కు మ్యాచింగ్‌గా క్రీమ్‌-ఐవరీ రంగు షేర్వాణీలో ముస్తాబయ్యాడు. ఇలా మ్యాచింగ్‌ దుస్తుల్లో మెరిసిపోయిన ఈ అందాల జంటను చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఇక పెళ్లి తర్వాత గ్రాండ్‌గా రిసెప్షన్‌ కూడా ఏర్పాటుచేశారీ సెలబ్రిటీ కపుల్‌. ఈ వేడుక కోసం గులాబీ రంగు సీక్విన్‌డ్‌ శారీ, జతగా కుందన్‌ నెక్లెస్‌ను ఎంచుకున్న ఈ కొత్త పెళ్లి కూతురు.. పాపిట్లో సింధూరంతో ఆకట్టుకుంది. రాఘవ్‌ నలుపు రంగు సూట్‌లో మోడ్రన్‌గా కనిపించాడు.

హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ క్యూట్‌ కపుల్‌!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్