ఇవీ ఆరా తీయండి!

జీవితంలో పెళ్లి ఓ పెద్ద మలుపు... మార్పు. పెట్టిపోతలు పెద్దవాళ్లు మాట్లాడుకుంటారు సరే... ఇష్టాయిష్టాలూ పంచుకుంటారు. మరి వచ్చిన అబ్బాయితో భవిష్యత్‌ గురించి చర్చించారా? సొంత వ్యాపారం, ఉన్నత చదువులు, వృత్తిలో ఎదగడం, ప్రపంచం చుట్టేయడం.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో కల ఉంటుంది. మీదేంటి? పంచుకోండి. అవతలి వ్యక్తిదీ తెలుసుకోండి. ఉదాహరణకు మీకు...

Published : 25 Jun 2022 00:31 IST

జీవితంలో పెళ్లి ఓ పెద్ద మలుపు... మార్పు. పెట్టిపోతలు పెద్దవాళ్లు మాట్లాడుకుంటారు సరే... ఇష్టాయిష్టాలూ పంచుకుంటారు. మరి వచ్చిన అబ్బాయితో భవిష్యత్‌ గురించి చర్చించారా?

సొంత వ్యాపారం, ఉన్నత చదువులు, వృత్తిలో ఎదగడం, ప్రపంచం చుట్టేయడం.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో కల ఉంటుంది. మీదేంటి? పంచుకోండి. అవతలి వ్యక్తిదీ తెలుసుకోండి. ఉదాహరణకు మీకు ప్రపంచాన్ని చుట్టేయడమంటే ఇష్టం. అవతలి వ్యక్తికి ఓ పల్లెటూరిలో ప్రశాంత జీవనం గడపడం ఇష్టం. కలిసి సాగేదెలా?

ఖర్చుల గురించీ కనుక్కోండి. కొందరు పొదుపు మంత్రం జపిస్తే.. కొందరు ఉన్న ఒక్క జీవితం.. హాయిగా గడపాలిగా అంటారు. కొందరు పక్కా ప్రణాళికతో సాగిపోతారు. మరి మీది, ఆ వ్యక్తిదీ ఏ తీరు? అలాగే ఎవరికివాళ్లు సంపాదించి ఖర్చు పెట్టుకుంటే సరే.. అలాకాకుండా అన్నింటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నా ఇబ్బందే! ఇక్కడా ఇద్దరికీ పొసుగుతుందా లేదా అన్నది చూసుకోవాలి. ఇప్పటిదాకా ఎలాగున్నా భవిష్యత్‌ పట్ల కచ్చితత్వంతో ఉండటమూ ముఖ్యమే.

పిల్లల సంగతేంటి? పెళ్లికి ముందే ఎలా అనుకోకండి. మీకు ఉన్నత చదువు లక్ష్యముంది. ఈలోగా పిల్లలంటే కెరియర్‌ పక్కకి వెళ్లిపోవచ్చు. కాబట్టి, దీని గురించి చర్చించుకోవాలి. అప్పుడే తర్వాత ఏం చేయాలన్న దానిపై స్పష్టత వస్తుంది.

పెళ్లి అనగానే మిగిలిన బంధాలను పక్కనపెట్టాలన్న భావన చాలామందిలో ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్నీ పంచుకోవాలనుకుంటారు. ఇప్పుడు అమ్మానాన్నల బాధ్యత తమదే అనుకుంటున్న అమ్మాయిలున్నారు. వాళ్లకి ఆర్థికంగా మీ సాయం అవసరమవుతుంది. అయితే అత్తింటి వాళ్లు దాన్ని తప్పుగా పరిగణిస్తుండొచ్చు. మీ బాధ్యతల్ని కచ్చితంగా చెప్పండి. ఎలాంటి ఇబ్బంది లేదూ అనిపించుకుంటే మీకూ ప్రశాంతమేగా!

కుటుంబ ఆచారాలు, కట్టుబాట్లు.. ఎక్కువగా గొడవలు అయ్యే వాటిల్లో ఇదీ ఒకటి. కొందరికి పెళ్లయ్యాక అమ్మాయి ధరించే దుస్తులు, స్నేహితులు, మాట్లాడేతీరు సహా ప్రతి విషయంలో పట్టింపులుంటాయి. మీరు మోడర్న్‌ జీవి అయితే మీ పని ఇక అంతే! ఇవన్నీ తెలుసుకున్నాకా సరే అనిపించినా లేదూ.. వీటికి సర్దుకోగలను అనిపించినా ధైర్యంగా ముందడుగు వేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్