మా అమ్మానాన్నా ఏం చేస్తున్నారంటే...

మనం ఎంతసేపూ చెప్పిన మాట వినడం లేదు, సరిగ్గా చదవడంలేదు.. అంటూ పిల్లలు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళన పడుతుంటామే తప్ప వాళ్ల భావాలెలా ఉన్నాయన్నది ఆలోచించడంలేదు. ఈ ధోరణి మారాలని, చిన్నారుల కోణంలో

Updated : 01 Jul 2022 05:42 IST

మనం ఎంతసేపూ చెప్పిన మాట వినడం లేదు, సరిగ్గా చదవడంలేదు.. అంటూ పిల్లలు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళన పడుతుంటామే తప్ప వాళ్ల భావాలెలా ఉన్నాయన్నది ఆలోచించడంలేదు. ఈ ధోరణి మారాలని, చిన్నారుల కోణంలో చూసి వాళ్ల ఇబ్బందులేమిటి, మనం ఎంత వరకూ న్యాయం చేస్తున్నామో ఆలోచించాలంటున్నారు మానసిక నిపుణులు. తల్లిదండ్రుల మీద కొందరు పిల్లల ఫిర్యాదులిలా ఉన్నాయి.. ఇవి మీకూ వర్తిస్తాయేమో ఆత్మపరిశీలన చేసుకోండి అని సూచిస్తున్నారు...

* ‘మా అమ్మానాన్నా నన్ను అర్థం చేసుకోరు’- ఇది చాలా మంది చిన్నారుల మనసులో మాట. భయంతోనో భక్తితోనో కొందరు పెద్దల  ముందు బయటపడకపోయినా మిత్రులతో చెప్పుకుని బాధపడుతున్నారు. ఈ లెక్కన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతోంది కదా! పిల్లల ఆలోచన సరిగా లేనందువల్లే పెద్దలు కోప్పడతారన్న మాట నిజమే అయినా బెదిరించీ భయపెట్టీ మార్పు తేవాలనుకోవద్దు. వాళ్ల స్థాయిలోకి వెళ్లి నెమ్మదిగా నచ్చజెప్పండి.

* ఇక వారి రెండో ఫిర్యాదు... ‘మా అమ్మానాన్నలు నా మీద పెత్తనం చేస్తారు, అన్నిటికీ నియంత్రిస్తారు’. వాళ్లెక్కడ తప్పు దారిలో వెళ్తారోననే భయంతోనే పెద్దలు అదుపు చేస్తారనేది మనందరికీ తెలిసిందే. కానీ పిల్లలు అంత అసంతృప్తితో, ఆందోళనతో ఉన్నారని అధ్యయనాలు చెబుతుంటే మనం మారక తప్పదు కదా! ‘నువ్వు ఎంచుకున్న దారిలో ఇన్ని ఆటంకాలుంటాయి, అనర్థాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడే మరోవైపు మళ్లకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమౌతుంది, ఆనక నీ ఇష్టం’ అని విడమరిచి చెబితే అది నియంత్రణలా కాకుండా సూచనలా ఉంటుంది.

* మూడో ఫిర్యాదు... ‘నా శక్తికి మించి ఆశిస్తారు’. ఇది కచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే. మనలో చాలామంది పిల్లల స్థాయేంటో, అభిరుచి ఏమిటో తెలుసుకోకుండా తోటి వారితో పోలుస్తూ మొదటి ర్యాంకు తెచ్చుకోవాలనో మరోటో టార్గెట్లు పెట్టడం తెలిసిందే. అది వాళ్ల మెదడుకు ఎంత భారమౌతుందో ఆలోచిస్తే అలాంటి పరిస్థితి కల్పించం.

* నాలుగోది కూడా అలాంటిదే... ‘నువ్విలానే ఉండాలంటూ ఒత్తిడి చేస్తారు’. ఇలా చేస్తే బాగుంటుంది, చేయగలవా అని అడిగితే చిన్నారులు ఒత్తిడికి గురవ్వరు. చేయగలిగితే చేస్తారు, లేదంటే తమకు నచ్చిన మరోదాంట్లో నైపుణ్యం చూపిస్తారు.

* ఐదోది... ‘క్రమశిక్షణ పేరుతో బాధ పెడుతున్నారు’. క్రమశిక్షణ లేకపోతే ఎలా అంటారా? అవధి దాటకుండా చూసుకోండి. చెప్పేది కటువుగా లేకుండా అదెంత అవసరమో అర్థమయ్యేలా చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్