Published : 10/07/2022 03:49 IST

పనులకు ఆడేంటి? మగేంటి?

పిల్లలను ఆడ, మగ తేడా లేకుండా పెంచాలంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఇద్దరికీ సమానంగానే చదువు చెప్పించడం, ఉద్యోగర్హతలను అందించడంలో తల్లిదండ్రులు ముందడుగు వేస్తున్నారు. అయినా... ‘జెండర్‌ న్యూట్రల్‌ లైఫ్‌ స్కిల్స్‌’ను ఇంటి పనుల వంటివాటితో చిన్నప్పుడే పిల్లలకు నేర్పించాలని చెబుతున్నారు.

అన్నం తిన్న కంచం నుంచి తాగిన కాఫీ కప్పు వరకు ఇంట్లో అక్క లేదా చెల్లి కడగాల్సిందే. ఆడపిల్లలా నీకెందుకురా ఆ పనులు అంటూ అబ్బాయిలను మందలించే అలవాట్లు ప్రస్తుతం కాస్తంత తగ్గాయి. అయినా ఎవరి పని వాళ్లు చేసుకోవడాన్ని బాల్యం నుంచే అలవరచడం మంచిది. ఇంట్లో ప్రతి పనినీ చేసే విధానాన్ని పిల్లలకు అలవరచాలి. అవసరం అయితే పనుల్ని విభజించి కొన్ని పనులు ఒక వారం ఒకరికి, తర్వాత మరొకరికి కేటాయించాలి. ఫలానా పని అమ్మాయిలదే అని కాకుండా ఏ పనైనా ఎవరైనా చేయొచ్చు అనే ఆలోచనాధోరణి చిన్నప్పటి నుంచే ఆడ, మగ ఇద్దరికీ అలవాటవ్వాలి. ఆడపిల్లలు, మగపిల్లలనే తేడా లేకుండా సమానంగా పనులు నేర్పించగలిగితే వారిలో పెడధోరణి కనిపించదు.

వంటింట్లో.. మగపిల్లలను కూరగాయలు తరగమని, ఆడపిల్లలను వారికి సాయం చేయమని చెప్పాలి. లేదా ఇద్దరినీ కలిసి వంట చేయడం నేర్చుకోమనాలి. దీంతో సమానత్వమే కాదు, పోషక విలువల గురించీ తెలుసుకుంటారు. ఆహారంపై అవగాహన తెచ్చుకుంటారు. రోజూ కనీసం అరగంటైనా వంటింట్లో పిల్లలకు అవకాశమివ్వాలి. దాని కోసం చదువు, క్రీడల సమయాన్ని సమన్వయం చేసుకోవడం నేర్పిస్తే చాలు. వంటలో కావాల్సిన నైపుణ్యాలూ వస్తాయి.

ఆర్థికపరమైన.. ఇంటికయ్యే ఖర్చుల నుంచి వారి చదువుల వరకు పిల్లలకు అన్నీ చెప్పాలి. ఒక నెలకు .. వారినే ప్రణాళిక వేయమనాలి. సలహాలు మాత్రమే ఇస్తూ గమనించాలి. వారిలో ఎవరు చురుకుగా నిర్ణయాలు తీసుకుంటున్నారో, తేలికగా సమస్యలను పరిష్కరిస్తున్నారో.. గుర్తించి, మిగతా వారికి ఆ నైపుణ్యాలను అవతలివారి నుంచి నేర్పించాలి. ప్రతి అంశం ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఇవన్నీ వారిలో ఆర్థికప్రణాళికపై అవగాహనను పెంచుతాయి. సమానంగా బాధ్యతలు నిర్వర్తించే తీరు అలవడుతుంది.

మర్యాదలో.. తల్లిదండ్రులు ఒకరికొకరు గౌరవ, మర్యాదలిచ్చుకోవాలి. తల్లిని తండ్రి అగౌరవ పరచడం, మాటలతో వేధించడం వంటివన్నీ పిల్లల మనసులో ముద్రపడతాయి. ఆడపిల్లంటే గౌరవం ఉండక్కర్లేదు అనే భావం మగపిల్లల మనసులో పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత వాళ్లు కూడా తల్లినే కాదు, బయటి అమ్మాయిలను కూడా అగౌరవపరచడానికి వెనుకాడరు. అలాకాకుండా పెద్దవాళ్ల మంచి ప్రవర్తన పిల్లలకు పాఠాలుగా మారితే, వారు శారీరక, మానసిక వికాసం పొందుతారు. మంచి వ్యక్తులుగా ఎదుగుతారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని