చదువంటే.. ఇబ్బంది పడుతుంటే

బడులు తెరిచారు. పిల్లలకు ఇంటికి రాగానే హోంవర్క్‌లు, పాఠాలు చదవడం వంటి బాధ్యతలు మొదలయ్యాయి. కొంత మంది పుస్తకం తీయమంటే ఏదో వంకతో తప్పించుకు తిరుగుతుంటారు. ఇలాంటి పిల్లల మనసులోని ఇబ్బందిని తెలుసుకొని పరిష్కరించకపోతే చదువులో వెనకబడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Published : 29 Jul 2022 01:19 IST

బడులు తెరిచారు. పిల్లలకు ఇంటికి రాగానే హోంవర్క్‌లు, పాఠాలు చదవడం వంటి బాధ్యతలు మొదలయ్యాయి. కొంత మంది పుస్తకం తీయమంటే ఏదో వంకతో తప్పించుకు తిరుగుతుంటారు. ఇలాంటి పిల్లల మనసులోని ఇబ్బందిని తెలుసుకొని పరిష్కరించకపోతే చదువులో వెనకబడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

కొవిడ్‌ ప్రభావంతో పుస్తకాలు, పరీక్షలకు దూరమైన పిల్లలకు తిరిగి పాఠాలు చదవాలంటే కాస్తంత ఇబ్బంది ఉండటం సహజమే. అయితే వారి నిరాశక్తతను అమ్మానాన్న కనిపెట్టగలగాలి. వారిని పుస్తకాల వైపు మళ్లించే ప్రయత్నం చేయాలి. చదువుకోండి అని చెప్పి ఇంకేదో పని చేసుకోకుండా... పిల్లలతోపాటు కూర్చోవాలి. పాఠాలను పైకి చదువుతూ, వారితో చెప్పించాలి. పెద్దవాళ్ల ఉత్సాహాన్ని చూసి చిన్నారులు పాఠ్యాంశాలపై ఆసక్తిని తెచ్చుకుంటారు. సమయానికి హోం వర్క్‌ పూర్తిచేస్తే చిన్నచిన్న కానుకలు అందించడం, లేదా ఓ గంట ఆటలకు అనుమతించడం వంటివన్నీ చిన్నారుల్లో చదువుకోవాలనే ఆలోచనను తెస్తాయి. 

తరగతిలో..

కొందరు పిల్లలకు తరగతిలోనే సమస్య ఉంటుంది. పాఠాలు అర్థం కాకపోవడం లేదా తోటివారి వేగంతో సమానంగా పాఠ్యాంశాలను అనుసరించ లేకపోవడం కారణాలు కావొచ్చు. పిల్లల్లో చదువుపట్ల అనాసక్తి పెరుగుతున్నప్పుడు వారి ఉపాధ్యాయులను కలిసి మాట్లాడాలి. పిల్లల ప్రవర్తన, వారు తరగతిలో ఏకాగ్రతగా ఉంటున్నారా లేదా వంటివన్నీ తెలుసుకోవాలి. అప్పుడే సరైన కారణాన్ని కనిపెట్టి, పరిష్కారాన్ని అందించవచ్చు. చదవడం, రాయడంలో సమస్య ఉందని తెలిస్తే ఇంటివద్ద సాధన చేయించాలి. వారితోపాటు కలిసి పాఠాలు చదవడం, రాయడానికి ఆసక్తిని పెంచేలా చేయడం వంటివి పిల్లలను తిరిగి చదువువైపు అడుగులేసేలా చేస్తాయి.

వేరే మార్గంలో..

హోంవర్క్‌ చేయాలంటే కొందరు చిన్నారులు కాసేపైనా ఒకచోట కూర్చోవడానికి ఇష్టపడరు. అటువంటప్పుడు కోపాన్ని ప్రదర్శించకూడదు. చదువు మాన్పించేస్తా అంటూ బెదిరింపు మాటలతో బాధపెట్టకూడదు. ముందు వారిలో ఏకాగ్రత పెరిగేలా చేయడానికి కృషి చేయాలి. తోటపని చేయించడం, కథలు చదివి వినిపించడం వంటివి అలవరచాలి. రోజూ తమతో కలిసి చిన్న చిన్న వ్యాయామాలు చేయాలంటూ తల్లిదండ్రులు పిల్లలతో వర్కవుట్లు చేయించాలి. ఆడుతూ పాడుతూ చేసే వ్యాయామాలను అలవాటు చేయాలి. వారి ఆసక్తులను గుర్తించి ప్రోత్సహించాలి. సరదాగా మొదలుపెట్టినా.. ఇవన్నీ వారిలో క్రమేపీ ఏకాగ్రతను పెంచుతాయి. అలా చదువుకోవడానికి ఆసక్తినీ తెచ్చుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్