మేకప్‌ నుంచి దూరంగా..

చిత్ర మేకప్‌ వేసుకోవడం చూస్తే చాలు, ఏడేళ్ల రమ్య కూడా సిద్ధమవుతుంది. తల్లి మేకప్‌ కిట్‌ను తీసుకొని సొంతంగా క్రీంలు సహా లిప్‌స్టిక్‌ వేసుకోవడం మొదలుపెడుతుంది. ఇది చిన్నారులకు పలురకాల

Published : 23 Sep 2022 00:27 IST

చిత్ర మేకప్‌ వేసుకోవడం చూస్తే చాలు, ఏడేళ్ల రమ్య కూడా సిద్ధమవుతుంది. తల్లి మేకప్‌ కిట్‌ను తీసుకొని సొంతంగా క్రీంలు సహా లిప్‌స్టిక్‌ వేసుకోవడం మొదలుపెడుతుంది. ఇది చిన్నారులకు పలురకాల అనారోగ్యాలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు. మేకప్‌ నుంచి పిల్లలను దూరంగా ఉంచడం మంచిదని సూచిస్తున్నారు.

పెద్దవాళ్ల చర్మంతో పోలిస్తే, చిన్నారులది చాలా సున్నితమైంది. మేకప్‌ ఉత్పత్తుల్లో వినియోగించే రసాయనాల వల్ల పెద్దవాళ్లకన్నా, పిల్లలపై చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మేకప్‌ ఉత్పత్తుల్లోని ట్యాక్సిన్స్‌ చిన్నారుల శరీరంలోకి త్వరగా ప్రవేశిస్తాయి. పిల్లల్లో జీవక్రియరేటు శాతం పెద్దల్లో కన్నా అధికంగా ఉంటుందని పలు అధ్యయనాలు కూడా తేల్చి చెప్పాయి. ఇటువంటప్పుడు చిన్నారులు లిప్‌స్టిక్‌ వంటివి వినియోగిస్తే వారి చర్మం పెద్దల్లోకన్నా 10 శాతం ఎక్కువగా పీల్చుకోవడానికి అవకాశం ఉంది. లిప్‌స్టిక్‌ తయారీలో వినియోగించే పలురకాల రసాయనాలను పిల్లల చర్మం పీల్చుకుంటుంది. ఇవి శరీరంలోకి తేలికగా ప్రవేశించి, వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఎక్కువగా ఉంది. అంతేకాదు, మేకప్‌ ఉత్పత్తులు పిల్లల సున్నితమైన చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. వీరి చర్మానికి బయటి ప్రభావాలను ఎదుర్కొనే శక్తి తక్కువగా ఉండటంతో, దురద, దద్దుర్లు, మంట, ఎర్రగా కందిపోవడం, అలర్జీలు త్వరగా సోకుతాయి. ఇవి క్రమేపీ వారిని పలు అనారోగ్యాలకు దరిచేసే ప్రమాదమూ లేకపోలేదు.

ముందు జాగ్రత్త..
ఐలైనర్‌, ఐషాడో వంటివి చిన్నారులకు నేత్రసంబంధిత సమస్యలను తెచ్చిపెడతాయి. తరచూ మేకప్‌ వినియోగించే చిన్నారుల ముఖచర్మం పొడిబారి, శాశ్వతంగా నిలిచిపోయే మచ్చలు రావొచ్చు. ప్రత్యేక సందర్భాలు, స్కూల్‌లో కార్యక్రమాలకు మేకప్‌ వేయాల్సి వస్తే, లైట్‌ మేకప్‌ వేయడం మంచిది. పిల్లల కోసం ప్రత్యేకంగా రసాయనాల్లేని వాటిని ఎంచుకోవాలి. ఫౌండేషన్‌ స్థానంలో పౌడర్‌, ఐలైనర్‌ కాకుండా కాటుక, లిప్‌స్టిక్‌ బదులుగా లిప్‌గ్లాస్‌వంటివి అలవాటు చేస్తే వారి చర్మానికి హాని ప్రభావం తగ్గుతుంది. లైట్‌గా మేకప్‌ వేసిన రోజు ముందుగా కొబ్బరినూనెతో తుడిచి, ఆ తర్వాత మైల్డ్‌ క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రపరచడం మరవకూడదు. చిన్నవయసులో మేకప్‌ అవసరం ఉండదని, సహజసిద్ధంగానే ముఖచర్మం మెరుపులీనుతుందనే అవగాహన వారిలో కలిగించడానికి ప్రయత్నించాలి. మేకప్‌కు వీలైనంత దూరంగా ఉంచితే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్