పిల్లలతో వాదించేటప్పుడు..

ఒక్కోసారి పిల్లలు చేసే పని నచ్చనప్పుడు దాన్ని ప్రశ్నించడం సహజం. ఆ సమయంలో చిన్నారులు సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని సందర్భాల్లో వారితో వాదన జరుగుతుంది.

Published : 09 Oct 2022 00:33 IST

ఒక్కోసారి పిల్లలు చేసే పని నచ్చనప్పుడు దాన్ని ప్రశ్నించడం సహజం. ఆ సమయంలో చిన్నారులు సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని సందర్భాల్లో వారితో వాదన జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలని నిపుణులు చెబుతున్నారో చూడండి...

అంశంపైనైనా వాదించాల్సిన అవసరం ఉందనిపిస్తే సంభాషణను సున్నితంగా సాగేలా పెద్దవాళ్లు జాగ్రత్తపడాలి. పిల్లల అభిప్రాయాన్ని ముందుగా చెప్పనివ్వాలి. వారిని మాట్లాడనివ్వకుండా తల్లిదండ్రులే అరుస్తూ, నువ్వు చేసింది తప్పు అనో... ముందు నువ్వు పద్ధతి నేర్చుకో .. అనో నిందించడం మొదలుపెడితే, అది పిల్లల వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. తమకు మాట్లాడే స్వేచ్ఛ లేదని, అమ్మానాన్నలు నియంతలుగా ఉన్నారనే చెడు భావన వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి ఆలోచన రాకుండా ఉండాలంటే చిన్నారుల వాదనను వినిపించడానికి అవకాశమివ్వాలి. ఆ తర్వాతే పెద్దలు వారి అభిప్రాయాన్ని మెల్లగా చెప్పాలి. జరిగిందేంటో పూర్తిగా తెలుసుకొన్న తర్వాత మాత్రమే మాట్లాడటం మంచిది.

భావోద్వేగాలను..

పిల్లలు చెప్పేదాంట్లో నిజం ఉండి ఉండొచ్చు. అలా సానుకూలంగా ఆలోచించే తీరును పెద్దలు ప్రదర్శిస్తే, చిన్నారులూ దాన్నే అనుసరిస్తారు. ముందు వారి భావోద్వేగాలను గుర్తించాలి. వాదించాలని కాకుండా జరిగింది చెప్పాలని భావిస్తున్నారేమో గ్రహించాలి. మనసులో మాటని చెప్పగలిగే ధైర్యాన్ని అలవరచాలంటే ఇటువంటి సందర్భాల్లోనూ వారికి అవకాశాన్ని కల్పించాలి. కోపం, చికాకు ప్రదర్శించకుండా ప్రశాంతంగా వారు వాదిస్తున్న విధానాన్ని పరిశీలించాలి. అప్పుడే వారి ప్రవర్తన తీరును గుర్తించడానికి వీలుంటుంది. ఆ తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారో పెద్దవాళ్లు వారితో సున్నితంగా చెప్పాలి.

తీవ్రం చేయొద్దు..

వాదన అంటేనే సంభాషణ అప్పటికప్పుడు తీవ్రంగా పరిణమించే అవకాశం ఉంటుంది. అలాగైతే అసలు విషయం పక్కదోవ పట్టి, మాట్లాడే తీరు మారే ప్రమాదం ఉంది. ఇలాగైతే పెద్దలకు, పిల్లలకు మధ్య దూరం పెరుగుతుంది. మరోసారి తమ మనసులోని అభిప్రాయాన్ని బయటకు చెప్పడానికి పిల్లలు ఆసక్తి చూపకపోవచ్చు. అరుస్తూ పిల్లలను భయపెట్టి నోరు మూయించాలని తల్లిదండ్రులు ప్రయత్నించకూడదు. ఎప్పటికప్పుడు సంభాషణ దారి మారుతోందా అని గ్రహించుకుంటూ ముందుకెళ్లాలి. చివరకు ప్రశాంతంగా పిల్లలను దగ్గరకు తీసుకుంటే చాలు. అక్కడితో సమస్య తీరుతుంది. ఇద్దరి మనసుల్లోనూ ప్రశాంతత నిండుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్