ఈ పెంపకం మెరుగు..

సానుకూల పెంపకమే పిల్లల ఎదుగుదలకు, వారు భవిష్యత్తులో పురోభివృద్ధి దిశగా అడుగులేయడానికి ఉపయోగపడిందని ఓ అధ్యయనం ద్వారా తెలిసింది.

Published : 23 Oct 2022 00:10 IST

సానుకూల పెంపకమే పిల్లల ఎదుగుదలకు, వారు భవిష్యత్తులో పురోభివృద్ధి దిశగా అడుగులేయడానికి ఉపయోగపడిందని ఓ అధ్యయనం ద్వారా తెలిసింది. వారి పెంపకంలో ప్రధానంగా నాలుగు రకాలు కనిపించాయి. మీదే రకమో చూడండి...

అధికార పూర్వకం...
ఈ తరహా పెంపకంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు కఠినంగా ఉంటూ తాము పెట్టిన నియమాలను శిరసావహించేలా చేస్తున్నారు. ఎదురు ప్రశ్నించడానికి తల్లిదండ్రులు అనుమతించరు. పిల్లల వల్ల పొరపాటు జరిగితే శిక్షించడానికి కూడా వెనుకాడరు. దీంతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం కొరవడటం, ఆందోళన, ఒత్తిడి, భయం వంటివి ఎక్కువగా కనిపించాయి.

అదో లోకం...
పిల్లలతో అతితక్కువ కమ్యూనికేషన్‌, వారి జీవనశైలితో ప్రమేయం లేకుండా తల్లిదండ్రులు బాధ్యతారహితంగా ఉంటారు. ఈ పెంపకంలో పెరిగిన పిల్లలు ఎదుటి వారి భావోద్వేగాలకు ప్రతిస్పందించడంలో వెనకబడ్డారు. ఆందోళన, ఒత్తిడితో కనిపించారు. ఎదుటి వారిని ప్రేమించలేకపోవడంతోపాటు అనవసర ద్వేషాన్ని పెంచుకొని హింసకి కూడా వెనుకాడని ప్రమాదకరమైన స్వభావం ఈ పిల్లల్లో కనిపించింది.

మితి మీరిన స్వేచ్ఛ
పిల్లలు అడిగిన వాటన్నింటికీ అనుమతివ్వడం, క్రమశిక్షణ, నియమాలు లేకుండా పెంచడం కనిపించింది. పిల్లలతో తమకెటువంటి సంఘర్షణ ఎదురు కాకూడదని తల్లిదండ్రులు భావించారు. వారిపై నమ్మకంతోపాటు ఎదురయ్యే అనుభవాలతో వారే పాఠాలు నేర్చుకుంటారనే ఉద్దేశంతో స్వేచ్ఛనిచ్చారు. పిల్లల ప్రవర్తనలో చెడు కనిపించినా హద్దులు గీయలేదు. ప్రతికూల పరిణామాలెదురైనా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇలా పెరిగిన పిల్లల్లో ఆలోచన లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, నియమాలను, హద్దులను అంగీకరించక పోవడం, దూకుడు స్వభావం అలవాటై పోయాయి.

సానుకూల ధోరణి
ముఖ్యమైన అంశాల్లో మాత్రమే చిన్నారులకు నియమాలు, నిబంధనలు విధించారు. భవిష్యత్తులో అవి ఎలా ఉపయోగపడతాయో సున్నితంగా అవగాహన కలిగించి, ఇష్ట పూర్వకంగా పాటించేలా చేశారు. సమయ పాలన విలువ తెలిసేలా చేశారు. వారికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం, వారు చెప్పేది వినడంతో పాటు, వారి భావోద్వేగాలకు స్పందించారు. పొరపాటు జరిగినప్పుడు మరోసారి అలా కాకుండా అవగాహన కలిగించారు. సొంత నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించారు. ఇవన్నీ వారిలో అందరిపట్ల గౌరవ మర్యాదలు, ప్రేమ వంటివి కలిగేలా చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్