ఈ వయసులో.. అంత కోపమా!

నిన్న మొన్నటి వరకూ కొంగు పట్టుకు తిరిగే పిల్లలు.. టీనేజీలోకి రాగానే ఒక్కసారిగా మారిపోతారు. అన్నీ మాకు తెలుసంటారు. ఎదురు తిరిగి అరిచేస్తుంటారు.

Published : 29 Oct 2022 01:11 IST

నిన్న మొన్నటి వరకూ కొంగు పట్టుకు తిరిగే పిల్లలు.. టీనేజీలోకి రాగానే ఒక్కసారిగా మారిపోతారు. అన్నీ మాకు తెలుసంటారు. ఎదురు తిరిగి అరిచేస్తుంటారు. వారి ప్రవర్తనతో ఒక్కోసారి మనసు చివుక్కుమంటుంది. లేదూ కోపం తన్నుకొస్తుంది. రెంటికీ తావివొద్దు అంటున్నారు నిపుణులు.

* టీనేజీ.. హార్మోనులు, శరీరంలో మార్పులు మొదలయ్యే వయసిది. తెలియని ఆందోళన, చిరాకు, భయం.. ఇవన్నీ కోపం రూపంలో బయటకు వస్తుంటాయి. నిజానికి వాళ్ల ప్రవర్తన పట్ల వాళ్లకీ అవగాహన ఉండదు. వాటిని ఎలా తెలియజేయాలో తెలియక ఇలా ప్రవర్తిస్తుంటారు. వస్తువులు పగలగొట్టడం, ఎదుటి వారిని గాయపరచడం వంటి విపరీత ధోరణులు లేకపోతే దీన్ని సాధారణంగానే తీసుకోవాలట.

* వాళ్లు మన మీద కోపం ప్రదర్శించడం అవమానంగా అనిపిస్తుంటుంది. తిరిగి అరిచేస్తుంటాం. అది వాళ్లలో బాధ గూడు కట్టుకు పోయేలా చేస్తుంది. ఆ సమయంలో మనమే తగ్గాలి. తర్వాత నెమ్మదిగా నచ్చజెప్పాలి.

* పనిలో ఉండో, ఇదంతా మామూలే అనిపించో పిల్లలు ఏదైనా చెబుతోంటే ‘ఇక చాల్లే’ అనేస్తుంటాం. మనకది మామూలే. కానీ వాళ్లకి కాదుగా! ఏం చెబుతున్నారో వినండి. లేదూ కాస్త పని ఉంది. మళ్లీ మాట్లాడతా అని చెప్పండి. అంతేగానీ వాళ్లు చెప్పేదానికి ప్రాముఖ్యత లేదన్నట్లుగా ప్రవర్తించొద్దు.

* ఈ వయసులో ఇది మామూలే అని మనమే సర్దుకుంటూ వెళ్లడమూ మంచిది కాదు. తన ప్రవర్తన గురించి నెమ్మదిగానే చెబుతూ ఉండండి. కొన్ని పనులనీ అప్పగిస్తూ ఉండండి. సొంతంగా ఏదైనా చేయాలనుకుంటే చేయనివ్వండి. తన పని, అసైన్‌మెంట్లు, సర్దుకోవడం లాంటివన్నీ తనకే వదిలేయండి. వ్యాపకంగానూ ఉంటాయి, బాధ్యతా తెలుస్తుంది.

* రోజూ వ్యాయామం, సంగీతం వినిపించడం చేయండి. సంతోషం, బాధ కలిగించే అంశాలకు అక్షర రూపం ఇవ్వమనండి. వాళ్లు మీ నుంచి ఏం ఆశిస్తున్నారో కూడా చేర్చమనండి. వాటిని తప్పకుండా చదవండి. వీలైనవి పాటించడానికి ప్రయత్నించండి. ఓ పంచింగ్‌ బ్యాగును ఇంట్లో ఉంచి, కోపమొచ్చిన ప్రతిసారీ కొట్టమనండి. ఇవన్నీ.. కోపం తగ్గించడంతోపాటు బాధ్యత, ఎదుటివాళ్లని అర్థం చేసుకోవడం, పరిస్థితుల్ని బట్టి నడుచుకోవడం వంటి నైపుణ్యాలూ అలవడేలా చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్