స్వేచ్ఛనివ్వాలి..

పిల్లలకు ఆలోచన, అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛని చిన్నప్పటి నుంచి ఇవ్వాలంటున్నారు నిపుణులు. అది వారి వ్యక్తిత్వవికాసానికి దోహదపడుతుందని సూచిస్తున్నారు.

Published : 06 Nov 2022 00:53 IST

పిల్లలకు ఆలోచన, అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛని చిన్నప్పటి నుంచి ఇవ్వాలంటున్నారు నిపుణులు. అది వారి వ్యక్తిత్వవికాసానికి దోహదపడుతుందని సూచిస్తున్నారు.

దుస్తులు, ఆహారానికి సంబంధించి బాల్యంలో వారి అభిప్రాయాన్ని అడగాల్సిన అవసరం ఉండదు. ఎదుగుతున్నప్పుడు వారికి ఇష్టాయిష్టాలు మొదలవుతాయి. ఫలానా రంగు, డిజైన్‌ దుస్తులు, నచ్చిన ఆహారం అంటూ ఎంపిక కనిపిస్తుంది. అప్పటి నుంచే ‘నీకేం తెలీదు మేం చెప్పిందే వినాలి’ అని భయపెట్టకూడదు. వారి అభిప్రాయానికి విలువనివ్వాలి. మాట్లాడే స్వేచ్ఛనిచ్చి, అదెంతవరకు సమంజసమో గుర్తించాలి. లేదంటే తనకు ప్రాముఖ్యతనివ్వడం లేదనే నిరాసక్తత ప్రారంభమవుతుంది. క్రమేపీ అది ఆత్మన్యూనతగా మారే ప్రమాదం ఉంది.

భావస్వేచ్ఛ.. పాఠశాల స్థాయి నుంచే ఎవరినైనా స్ఫూర్తిగా తీసుకొని దాన్నే కెరియర్‌గా ఎంచుకోవాలనుకుంటారు పిల్లలు. ఫలానా కోర్సులోకి అడుగుపెడతా అని చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలో ‘నిన్ను ఫలానాది చదివించాలనుకున్నాం, ఆ రంగంలోకి అడుగుపెట్టాలనేది మా కల’ అంటూ.. వారిని అణచివేయకూడదు. తన ఆలోచన వెనుక ఆశయం గురించి తెలుసుకోవాలి. ఆ కెరియర్‌నే ఎందుకు ఎంచుకుంటున్నారో అనునయంగా మాట్లాడాలి. దాన్ని గురించి సమాచారాన్ని సేకరించి వారితో చర్చించాలి. అందులోని కష్టనష్టాలు, లాభాలను విశదీకరించాలి. అప్పుడు కూడా పిల్లలు అదే నిర్ణయంపై నిలబడి ఉంటే ప్రయత్నించమంటూ ప్రోత్సహించాలి.

అనుభవం.. తల్లిదండ్రులు చెప్పే రంగంలో కాకుండా, తమకు నచ్చిన దాంట్లో శిక్షణ పొందుతానని చెప్పే పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి. కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తానని చెబుతున్నప్పుడు వారికి చేయూతనిచ్చి, అందులో వారికి అనుభవాన్ని పొందే అవకాశా న్నివ్వాలి. అలాకాకుండా ‘కొత్త రంగమది. దానివల్ల భవిష్యత్తులో లాభంకన్నా, నష్టమే ఎక్కువ’ అంటూ భయపెట్టకూడదు. భయం కలగని స్వేచ్ఛను పిల్లలకు తల్లిదండ్రులు అందించగలిగితే చాలు. అనుకున్నది ధైర్యంగా సాధించడానికి వాళ్లు కృషి చేస్తారు.

వైఫల్యం.. తామనుకున్న రంగంలో అడుగుపెట్టాక విఫలమైనా విమర్శించ కూడదు. ఎందుకలా జరిగిందో కారణాన్ని గుర్తించారో లేదో చెప్పడానికి వారికి స్వేచ్ఛనివ్వాలి. నిందిస్తూ పోతే.. మరొకసారి స్వేచ్ఛగా నిర్ణయాన్ని తీసుకోవడానికి భయపడతారు. వైఫల్యం విజయానికి మొదటిమెట్టు అని చెప్పి ప్రోత్సహిస్తే... తమ నిర్ణయంపై మరో సారి నమ్మకం ఉంచి, స్వేచ్ఛగా ముందడుగు వేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్