Published : 25/11/2022 00:39 IST

చిట్టి మెదళ్లకు రచనే వ్యాయామం!

ఆలోచనలకు అక్షర రూపమిచ్చే అలవాటును పిల్లల్లో ప్రోత్సహించాలంటున్నారు నిపుణులు. ఇది వారిలోని సృజనాత్మకత, భావవ్యక్తీకరణ నైపుణ్యాలను బయటకు తెస్తుందని చెబుతున్నారు.

స్కూల్‌, మైదానం, ఇల్లు.. ఇలా ప్రతి చోటా చిన్ని మెదళ్లలో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. రోజూవారీ అనుభవాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. బోల్డన్ని ఆలోచనలతో ఆ చిట్టి మెదడు నిండిపోతుంది. అవన్నీ పుస్తకంలో పొందుపరిచే అలవాటుంటే, ఎప్పటికప్పుడు మెదడు కొత్తవాటిని స్వాగతిస్తుంది. అందుకే వాటికి అక్షర రూపమివ్వడం చిన్నప్పటి నుంచే నేర్పాలి. అప్పుడే ప్రతి విషయాన్నీ లోతుగా పరిశీలించడం నేర్చుకుంటారు. చదువు పాఠాలు నేర్పితే, రచన వారికి తమ భావాలను స్వేచ్ఛగా బయటకు చెప్పడం అలవరుస్తుంది. ఈ అలవాటు కొత్త మార్గాలవైపు నడిపిస్తుంది.

ప్రారంభంలో.. రంగురంగుల కాగితాలిచ్చి వాటిపై వారికి నచ్చినదేదైనా రాయమనాలి. ఆకర్షణీయమైన అట్టతో చిన్న పుస్తకమిచ్చి మనసుకు నచ్చిన అంశాలకు అక్షరరూపం ఇవ్వమనాలి. బాధ కలిగించిన సందర్భాలు, సంతోషాన్ని అందించినవీ... ఇలా అన్నింటికీ అక్షర రూపమివ్వడం అలవాటు చేయాలి. అంతే కాదు ... తనకు తోచిన పద్ధతిలో సృజనాత్మకంగా చిన్న కథలను రాయమనాలి. తన గదిలో ఒక చోటును తనకు నచ్చినట్టు ప్రత్యేకంగా తీర్చిద్దాలి. అక్కడ చిన్నారి ప్రశాంతంగా కాసేపు గడిపేలా అలవాటు చేయాలి.

నైపుణ్యాలు.. వారు భావోద్వేగాలను అణచుకోకుండా అక్షర రూపం ఇవ్వాలి. లేదంటే పిల్లల్లో కలిగే ప్రతికూల ఆలోచనలు బయటపడలేక, మానసిక ఎదుగుదలకు ప్రతిబంధకాలవుతాయి. వారిని వారు అర్థం చేసుకోవడానికీ రచన మంచి మార్గం. మనసును కాగితంపై పెట్టినప్పుడు శారీరక, మానసిక ప్రయోజనాలెన్నో ఉంటాయి. ప్రతి ఆలోచననూ రాసిన తర్వాత మనసంతా ఉల్లాసంగా మారుతుంది. ఆత్మగౌరవం మొదలవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. దీంతో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. రాయడం వల్ల ఇతరులతో నడుచుకొనే విధానం, తమ గురించి తాము స్పష్టంగా చెప్పగలగడం, సమస్యకు పరిష్కారాన్ని వెతకడం, ఆలోచనల్లో స్పష్టత వంటి నైపుణ్యాలు అలవడతాయి. వైఫల్యాల నుంచి పాఠాలను నేర్చుకోవడంలో అవగాహన పెరుగుతుంది. వారానికొకసారి మీరూ ప్రశాంతంగా కూర్చుని తను రాసినవన్నీ విని లోటుపాట్లను చర్చించాలి... బాగున్నవి ప్రశంసించాలి. దీని వల్ల మీ అనుబంధమూ మరింత చిక్కబడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని