Published : 20/01/2023 00:59 IST

నేనున్నా అంటేనే...

ఒకరికొరుగా నూరేళ్లూ కలిసి సాగాల్సిన దాంపత్యంలో చిన్న చిన్న మనస్పర్థలే చినికి చినికి గాలివానలా మారడానికి కారణాలు... భాగస్వామి నమ్మకాన్ని కోల్పోవడం, అభద్రతకి గురవ్వడమే. ఇలాంటప్పుడు నేనున్నాననే భరోసా ఇవ్వడం, జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడమే పరిష్కారం.

* ఆలుమగలుగా ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి. ఇతరులు చేసే పనిని గౌరవించినప్పుడూ, అందులోని కష్టాన్ని అర్థం చేసుకోగలిగితేనే... ఒకరిపై ఒకరికి నమ్మకం మొదలవుతుంది. కష్ట సమయంలో మీరు తోడుంటారనే భరోసా ఏర్పడుతుంది. ఒత్తిడికి గురవుతుంటే అర్థం చేసుకోకుండా మరింత భారం పెంచేలా మాట్లాడటం వల్ల సమస్య పరిష్కారం కాదు. చూసీ చూడనట్లు వదిలేయడమూ మంచిది కాదు. సమస్య నుంచి బయటపడే మార్గాల్ని సూచించాలి. చేతిలో చేయి వేసి నేనున్నాననే నమ్మకాన్ని పెంచగలిగితే మీ సంసారం సంతోషంగా సాగిపోతుంది.

* పెళ్లయిన కొత్తల్లో భాగస్వామిని మెప్పించడానికి ఎన్నో చేస్తుంటాం. ఏళ్లు గడిచేకొద్దీ అవన్నీ కనుమరుగై పోతాయి. రొటీన్‌లో పడి ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు పట్టించుకోం. ఈ తీరు క్రమంగా ఇద్దరిలోనూ నిరాసక్తతకు దారి తీయొచ్చు. వారంలో ఓ రోజైనా భాగస్వామి కోసం సమయం కేటాయించుకోండి. కలిసి తినండి. నచ్చినపనులన్నీ కలిసి చేసేయండి. ఇలా ఒకరితోఒకరు గడిపే సమయం అభద్రతను దూరం చేస్తుంది.

* పొరపాట్లు అందరం చేస్తాం. కానీ చాలాసార్లు దాన్ని స్వీకరించడానికి చొరవ చూపం. మనవైపు నుంచి పొరపాటు జరిగితే ఏ మాత్రం ఆలోచించకుండా ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలి. ఇది మీరు పరిణతితో ఆలోచిస్తున్నారనడానికి సంకేతం. దానివల్ల అనుబంధంలో నమ్మకమూ పెరుగుతుంది.

* వాదనలూ, గొడవపడటం.. లాంటివన్నీ భార్యాభర్తల మధ్య సహజమే. అయితే కొన్ని వాదనలు ఎంతకీ తెగవు. అలాంటప్పుడు అదే పనిగా వాదించుకోవడం, మాటలు మానేయడం కాకుండా ‘మనం ఈ వాదనను వాయిదా వేద్దామా..’ అనేయండి. దానివల్ల సమస్య వాయిదా పడుతుంది. మీ మధ్య దూరం కూడా పెరగదు. అంతే కాదు.. తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోరు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని