కవల బంధం కలకాలం..

కవలలను పెంచేటప్పుడు తల్లిదండ్రులు సమస్యలెన్నో ఎదుర్కోవలసి ఉంటుంది. భౌతికంగా వారి అవసరాలను తీర్చడంలోనే కాదు, మానసికంగా పరిపక్వతగా పెంచడంలోనూ మెలకువలు పాటించాల్సి ఉంటుంది అంటున్నారు నిపుణులు.

Published : 10 Feb 2023 00:47 IST

కవలలను పెంచేటప్పుడు తల్లిదండ్రులు సమస్యలెన్నో ఎదుర్కోవలసి ఉంటుంది. భౌతికంగా వారి అవసరాలను తీర్చడంలోనే కాదు, మానసికంగా పరిపక్వతగా పెంచడంలోనూ మెలకువలు పాటించాల్సి ఉంటుంది అంటున్నారు నిపుణులు. అప్పుడే వారి మధ్య బంధం కలకాలం నిలుస్తుందని చెబుతున్నారు.

వలల్లో ఏ ఒక్కరినీ మరొకరితో పోల్చకూడదు. కొన్నిసందర్భాల్లో ఇద్దరిలో ఒకరు బలహీనంగా కనిపిస్తే, మరొకరు ఆరోగ్యంగా ఉంటారు. పుట్టుకతోనే ఈ తేడాలు ఇరువురిలో కనిపిస్తాయి. అంతమాత్రాన ఒకరు పూర్తిగా బలహీనమని కాదు. వారి శరీరతత్వం, ఆరోగ్యం వంటివన్నీ ఆధారపడి ఉంటాయి. అటువంటప్పుడు అన్నయ్య చూడు ఎంత బాగున్నాడో.. నువ్వు కూడా ఎక్కువ ఆహారాన్ని తీసుకొని అలాగే ఉండాలనకూడదు. ఒకసారి చదివితేనే అక్క అన్నీ గుర్తుపెట్టుకుంటోంది, నువ్వెందుకు జ్ఞాపకం పెట్టుకోవడం లేదని విమర్శించకూడదు. ఇవన్నీ వారిలో ప్రతికూలతను పెంచుతాయి. తోబుట్టువులపై కోపం పెంచుకునే ప్రమాదం కూడా ఉంది. అమ్మానాన్న మెచ్చుకుంటున్నారని వారిపై అసూయ మొదలవుతుంది. అలాకాకుండా ఇరువురినీ ఒకేలా పరిరక్షిస్తేనే కవలల మధ్య బంధం బలపడుతుంది.

ఒక్కటిగా.. కవల పిల్లలకు బొమ్మలు కొనిచ్చి, కలిసి ఆడుకొనేలా ప్రోత్సహించాలి. తోటపని, హోంవర్క్‌, వంటలో సాయం వంటి వాటన్నింటిలోనూ కలిసి చేసేలా చూడాలి. ఏ ఒక్కరిలోనైనా ఆసక్తి లేకపోతే కల్పించి అలవాటు చేయాలి. అలాగే పిల్లలకు వారికంటూ కొంత స్పేస్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కవలల్లో ఏ ఒక్కరికో సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ వంటి క్రీడల్లో ఎక్కువ ఇష్టం ఉంటే ప్రోత్సహించాలి. తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి అనుమతివ్వాలి. అప్పుడే బయటి ప్రపంచం గురించి తెలుసుకుంటారు. తోటివారితో ఎలా మెలగాలో అర్థమవుతుంది. ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని నేర్పిస్తే, మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. వీరిలో ఒకరు మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు లేదా ఎవరికైనా సాయం చేసినప్పుడు రెండోవారికి తోబుట్టువును ప్రశంసించడం నేర్పించాలి. ప్రేమ, స్నేహంతోపాటు ఇరువురి నడుమ గౌరవం ఉండేలా పెద్దవాళ్లు అలవాటు చేయాలి. ఇలా పెరిగిన వారిలో ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొందుతారు. ఇరువురూ ఉన్నత లక్ష్యాలను సాధించడానికి కలిసి అడుగులేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్