వాటి గురించి మాట్లాడుతున్నారా?

దేశంలో ఇటీవల జరిపిన ఒక సర్వేలో 32 శాతం టీనేజీ అమ్మాయిలు తమ శరీరంపై అసంతృప్తితో ఉన్నామని చెప్పారట. పిల్లలు టీనేజీకి వచ్చినా.. మనం చిన్నవాళ్ల కిందే లెక్కేస్తాం.

Published : 12 Mar 2023 00:11 IST

దేశంలో ఇటీవల జరిపిన ఒక సర్వేలో 32 శాతం టీనేజీ అమ్మాయిలు తమ శరీరంపై అసంతృప్తితో ఉన్నామని చెప్పారట. పిల్లలు టీనేజీకి వచ్చినా.. మనం చిన్నవాళ్ల కిందే లెక్కేస్తాం. కానీ హార్మోన్లు, శరీరంలో వచ్చే మార్పులు వాళ్లని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సోషల్‌ మీడియా ప్రభావం సరేసరి. వాళ్లలో ఆత్మవిశ్వాసం తగ్గొద్దంటే.. మాట్లాడండి.

* మునుపటిలా కాదు.. ఈతరం నెగెటివిటీని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లలూ సోషల్‌ మీడియా ఉపయోగిస్తున్న రోజులివి. నిజానికి మనమే దగ్గరుండి పరిచయం చేస్తున్నాం కూడా. అనుసరించేవారు పెరుగుతుంటే ఆనందమే! కానీ అన్ని రోజులూ అలా ఉండవు కదా! నెగెటివ్‌ మెసేజ్‌, బాడీ షేమింగ్‌.. వంటివన్నీ వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఇంకొన్నిసార్లు కోరుకున్న పాపులారిటీ దక్కకపోతే తమలో ఏదో లోపం ఉందని ఊహించుకుంటారు. అందుకే సోషల్‌ మీడియా పరిచయం చేయడంలో తప్పు లేదు.. కానీ అది వాళ్లని ఏ కోణంలోకి తీసుకెళుతోందో కూడా గమనించుకోవాలి.

* మరీ పుల్లలా తయారవుతున్నావ్‌, ఇన్ని కేజీలు తగ్గు.. లాంటి మాటలు సాధారణంగానే తోస్తాయి. కానీ వాళ్లని ఆత్మన్యూనతలోకి నెట్టేస్తాయి. ఎదుటివారి గురించీ ఇలాంటివి మాట్లాడొద్దు. లేదంటే రూపం ఆధారంగా కామెంట్‌ చేయడం తప్పు కాదన్న ధోరణిలోకి వెళ్లిపోతారు. రెండూ మంచిది కాదు. ముందు ఇలాంటి మాటలు మీ నోటి నుంచి రాకుండా చూసుకోండి. తర్వాత ఇవి ఎదుటివారి మీద ఎలా ప్రభావం చూపుతాయో చెప్పి, వాళ్లూ అలాంటివి వాడకుండా, పట్టించుకోకుండా చూడండి.

* బరువు విషయంలో బాధ పడుతున్నారనుకోండి. పెరిగేలా లేదా తగ్గేలా చూద్దామని ప్రోత్సహించొద్దు. ఈ నెలలో ఎన్నిసార్లు జబ్బు పడ్డావ్‌ అని అడిగేయండి. వాళ్ల సమాధానం బట్టి, లావు, సన్నం కాదు.. ఆరోగ్యం ప్రధానమన్న స్పృహ వాళ్లకి కలిగించాలి. ఇది ఎంత త్వరగా పిల్లల్లో కలిగించగలిగితే అంత ఆత్మవిశ్వాసం పెంచిన వాళ్లమవుతాం.

* పళ్లు ఎత్తు, చప్పిడి ముక్కు, పెదాలు లావు.. శరీరంలో ఉన్న లోపాలేంటో చెప్పేవాళ్లు చాలామందే. అలాంటప్పుడే కుంగుబాటు మొదలవుతుంది. ఇతరులతో కలవకపోవడం, తక్కువన్న భావన పెరగడం మొదలవుతుంది. పై పై మెరుగులు కాదు.. అంతఃసౌందర్యం ప్రాముఖ్యాన్ని తెలియజేయండి. ఏదైనా నెగెటివ్‌గా చెప్పినప్పుడు తనలోని సానుకూలాంశాలపైనే దృష్టిపెట్టడం నేర్పించండి. ముఖ్యంగా స్వీయ ప్రేమ నేర్పించండి. అప్పుడే ఆత్మన్యూనతపై గెలవగలరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్