మౌనం వద్దు!

మొన్న విజయనగరంలో ఉన్నత విద్యావంతురాలైన సుప్రియ.. భర్త, అత్తల దాష్టీకాలకు భయపడి పద్నాలుగేళ్లు బందీగా ఉండటం చూశాం. ప్రేమించిన వాడి చేతిలో చిత్రహింసలు చవిచూసి చివరకు హత్యకు గురైన శ్రద్ధావాకర్‌ గురించీ చదివాం.

Updated : 26 Mar 2023 07:51 IST

మొన్న విజయనగరంలో ఉన్నత విద్యావంతురాలైన సుప్రియ.. భర్త, అత్తల దాష్టీకాలకు భయపడి పద్నాలుగేళ్లు బందీగా ఉండటం చూశాం. ప్రేమించిన వాడి చేతిలో చిత్రహింసలు చవిచూసి చివరకు హత్యకు గురైన శ్రద్ధావాకర్‌ గురించీ చదివాం. వీళ్లే కాదు.. ఏళ్లుగా కాపురం చేస్తూ మౌనంగా దెబ్బలు తింటున్న వారెందరో! పిల్లలు, సమాజంలో పరువు కోసమని పంటి బిగువున బాధను నొక్కి పెడుతున్నారు. ఇలా ఇంకెన్నాళ్లు? అడ్డుకోండి.. మీకోసం అండగా నిలబడుతోన్న రక్షణ వ్యవస్థలున్నాయ్‌!

మద్యం, కుటుంబ సంస్కృతి, ఆర్థిక ఒత్తిళ్లు, పనిభారం వంటివన్నీ గృహహింసకు కారణాలే. చాలావరకూ ఇళ్లలో మగవారిదే ఆదిపత్యం. మానసికంగా దృఢంగానే ఉన్నా శారీరకంగా మహిళ బలహీనురాలే. అందుకే ఆమే బాధితురాలు అవుతోంది. గతేడాది మహిళలపై జరిగిన దాష్టీకాలపై 31 వేల ఫిర్యాదులొస్తే.. వాటిల్లో 23 శాతం గృహహింసవే! కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ‘విమెన్‌ అండ్‌ మెన్‌ ఇండియా-2022‘ సర్వే ప్రకారం తెలంగాణ 50.4శాతంతో రెండో స్థానంలో ఉంది. మగవారితో పోటీపడుతూ దూసుకెళుతున్నారు నేటి అమ్మాయిలు. అయినా భార్యగా, తల్లిగా, చెల్లిగా.. ఇంట్లోని మగవాళ్ల ఆంక్షల కంచెల్లో విలవిల్లాడే వారే ఎక్కువ. బంధాలకు విలువిచ్చో, సమాజానికి భయపడో, ఒంటరిగా బతకలేమనో మౌనంగా వీటిని భరిస్తున్నారు.

మీ కోసమే..

నాలుగు గోడల మధ్య స్త్రీలపై జరిగే శారీరక మానసిక, ఆర్థిక, లైంగిక హింసలను నియంత్రించడానికే గృహహింస చట్టాన్ని రూపొందించారు. తల్లి, భార్య, అక్కచెల్లెళ్లు అందరూ ఈ పరిధిలోకి వస్తారు. ఫిర్యాదు చేస్తే సంక్షేమ అధికారి  పరిష్కరించడమో, కోర్టుకు నివేదించడమో చేస్తారు. దేశవ్యాప్తంగా 1091/1291; తెలుగు రాష్ట్రాల్లో 181, 100 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేసినా తక్షణ సాయం దొరుకుతుంది. షీటీమ్స్‌,  భరోసా, సఖి కేంద్రాలు కూడా స్త్రీల రక్షణ కోసం పనిచేస్తున్నవే. భూమిక స్వచ్ఛంద సంస్థ హెల్ప్‌ లైన్‌ 18004252908 సాయమైనా కోరొచ్చు.


సాయం కోరండి

పెళ్లి మహిళలను శారీరకంగా, మానసికంగా హింసించడానికి ఇచ్చిన లైసెన్సు కాదు. వేధింపులు ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయండి. కచ్చితంగా సాయం దొరుకుతుంది. తాజాగా తెలంగాణలో గృహహింస కేసులు పెరగడానికి... బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేయడం కూడా కారణమే. ఇది మరింతగా పెరగాలి. పోలీస్‌ స్టేషన్‌లకు వెళ్లడానికి సంశయిస్తుంటే ‘భూమిక’ హెల్ప్‌లైన్‌ని సంప్రదించొచ్చు. సఖి కేంద్రాలను సంప్రదించినా సాయమందుతుంది. ఐదు రోజుల నీడ, దెబ్బలకు వైద్యంతోపాటు న్యాయ సాయమూ దొరుకుతుంది.

- కొండవీటి సత్యవతి, ‘భూమిక’ నిర్వాహకురాలు

 


బయటపడ్డా కాబట్టే..

20 ఏళ్లకే బిజీ ఆర్టిస్ట్‌నయ్యా. ప్రేమకోసం కెరియర్‌నీ పక్కనపెట్టా. కానీ అదంతా మాయని తెలియడానికి ఎన్నోరోజులు పట్టలేదు. అతనో నిర్మాత. ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదు. నా ఫోన్‌నీ లాక్కున్నాడు. 14 నెలలు బయటి ప్రపంచం తెలియకుండా బతికా. ఒళ్లంతా దెబ్బలు.. చిత్రహింసలతో గడిపా. ఇక తట్టుకోలేక ఓరోజు పారిపోయి అమ్మానాన్నలను చేరా. తిరిగి సినిమాలపై దృష్టిపెట్టా. మారతాడని ఇంకా ఎదురుచూస్తూ కూర్చోలేదు కాబట్టే ఇప్పుడు ఆనందంగా ఉన్నా.

- ఆశా సైనీ, నటి


ఒకసారి క్షమిస్తే..

నా జీవితంలో అంత నరకం చూస్తాననుకోలేదు. ఎంతో ప్రేమిస్తే పీడకలలా తయారయ్యాడు. అనూప్‌ వ్యాపారవేత్త. అనుకోకుండా కలిశాం. ప్రేమికులయ్యాక మొదట్లో బాగానే ఉండేది. పెళ్లికి సిద్ధమయ్యాక వేరే అమ్మాయిలతో అతనికున్న సంబంధాలు బయటపడ్డాయి. ప్రశ్నిస్తే చేయి చేసుకున్నాడు. తప్పయిందంటే క్షమించా. తీరా కొవిడ్‌లో అతనికి వ్యాపారంలో నష్టాలొచ్చాయి. ఇకప్పుడు పరిస్థితి దిగజారింది. నలుగురిలో ఉన్నా కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశా. తప్పు తెలుసుకున్నా అంటున్నాడు, బెదిరిస్తున్నాడు. క్షమించే ఓపికే నాకు లేదు.

- అనిక విక్రమన్‌, మలయాళీ నటి


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్