నాకంటే తనకే నమ్మకమెక్కువ

నా పాటల్లోని సాహిత్యాన్ని ప్రస్తావించడం చూసి తొలినాళ్లలో సుచిత్రపై సదభిప్రాయం కలిగింది. కవిత్వాన్ని అర్థం చేసుకుంది, కవినీ అంతే అర్థం చేసుకుంటుదన్న ఉద్దేశంతో.. సినిమా రంగంలోని అమ్మాయైతే దానిలోని కష్టనష్టాలు బాగా తెలుస్తాయని తన దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చా.

Published : 02 Apr 2023 00:26 IST

ఆమెకు సలాం
- చంద్రబోస్‌, పాటల రచయిత

నా పాటల్లోని సాహిత్యాన్ని ప్రస్తావించడం చూసి తొలినాళ్లలో సుచిత్రపై సదభిప్రాయం కలిగింది. కవిత్వాన్ని అర్థం చేసుకుంది, కవినీ అంతే అర్థం చేసుకుంటుదన్న ఉద్దేశంతో.. సినిమా రంగంలోని అమ్మాయైతే దానిలోని కష్టనష్టాలు బాగా తెలుస్తాయని తన దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చా. అది నిజమని ఇన్నేళ్లుగా నిరూపితం అవుతూనే ఉంది. పెళ్లయ్యాక కెరియర్‌ జోరుగా సాగుతోంది. నాకప్పుడు పాన్‌ అలవాటుండేది. తనేమో వద్దని! రాయాలంటే తప్పదనేవాడిని. దానికి తను ‘పాట కాదు.. ప్రాణం ముఖ్యం. ఇది కాకపోతే కూలో నాలో చేసైనా నేను మిమ్మల్ని పోషించుకుంటా’ అంది. అప్పటిదాకా మనసుకు పట్టిన మబ్బులు తొలిగాయి అనిపించింది. జీవితంపై ఓ స్పష్టత వచ్చి పాన్‌ మానేశా. అందుకే అప్పట్నుంచీ నా విజయాలన్నీ తనకే అంకితం. గోల్డెన్‌ గ్లోబ్‌కి ముందో బంగారు గులాబీ ఇచ్చింది. గత డిసెంబరు ఆస్కార్‌ నామినేషన్స్‌లోకి వెళ్లకముందే ‘ఆస్కార్‌ వచ్చింది.. కంగ్రాట్స్‌’ అంటూ నా లెటర్‌ ప్యాడ్‌ మీద నోట్‌ రాసిపెట్టింది. ఈ రెండు సందర్భాలప్పుడూ ‘నువ్వు మరీ.. అవార్డు వస్తుందో రాదో తెలియదు. నువ్వు ఏకంగా వచ్చేసినట్టే శుభాకాంక్షలు చెబుతున్నావ్‌’ అని నవ్వేశా. కానీ తను మాత్రం తప్పకుండా అందుకుంటానని నమ్మకంగా చెప్పింది. తను నమ్మినట్టే రెండూ వచ్చాయి. నాపై నాకంటే తనకంత నమ్మకం. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ పాత్ర కచ్చితంగా ఉంటుంది. నా విషయంలోనూ అది నూటికి నూరుపాళ్లు నిజం. నా విజయాల కోసం కలలు కంటుంది, తాపత్రయ పడుతుంది. అందుకే ఆస్కార్‌నీ నా భార్యకే అంకితమిచ్చా. తన నమ్మకం, విశ్వాసమే నా కలను సాధ్యం చేసిందని నమ్ముతా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్