ఆ తర్వాతా.. చూసుకోవాలి!

ఇంటినీ, కన్నవాళ్లనీ కాదనుకొని కట్టుకున్నవాడిని నమ్ముకొని గడప దాటుతుంది అమ్మాయి. తీరా అక్కడ ప్రేమకు బదులు నరకం ఎదురైతే? జీవితమే దుర్భరంగా తోస్తుంది.

Published : 06 Jul 2023 00:27 IST

ఇంటినీ, కన్నవాళ్లనీ కాదనుకొని కట్టుకున్నవాడిని నమ్ముకొని గడప దాటుతుంది అమ్మాయి. తీరా అక్కడ ప్రేమకు బదులు నరకం ఎదురైతే? జీవితమే దుర్భరంగా తోస్తుంది. ఆ బంధానికి స్వస్తి పలికిస్తే సరిపోదు.. ఆ తర్వాతా అండగా ఉండాలంటున్నారు నిపుణులు. అదెలాగంటే..

  • మానసికంగా.. ఆ బంధం నుంచి బయటపడినంత మాత్రాన భయం, ఆందోళన తొలగిపోవు. రోజులపాటు ఎదుర్కొన్న దెబ్బలు, అవమానాలు, బెదిరింపులు మనసులో బలమైన ముద్ర వేస్తాయి. ఇవేమీ లేకపోయినా అతి ముఖ్యమైన బంధం విచ్ఛిన్నమవ్వడం ఒక్కోసారి డిప్రెషన్‌కీ దారితీయొచ్చు. కాబట్టి, వాళ్లతో ఓపికగా ఉండాలి. మనసు పంచుకునేందుకు సిద్ధంగా ఉండాలి. తను ఏం చేసినా వెనుక మేమున్నామన్న భరోసా ఇవ్వాలి. అప్పుడే ఆ బాధ నుంచి బయటపడగలదు.
  • తర్వాతేంటి?.. ఇంత నరకాన్ని అనుభవించిందంటే ఆర్థికస్వేచ్ఛా కోల్పోయి ఉండొచ్చు. ఒకరిపై ఆధారపడటం కూడా ‘నేను తక్కువ’న్న భావనకు కారణమే. దాన్నీ తొలగించాలి. చదువు, ఉద్యోగం, ఏదైనా వ్యాపారం.. తనకు నచ్చినదేంటో కనుక్కొని ఆ దిశగా ప్రోత్సహించండి. తిరిగి జీవితాన్ని నిర్మించుకునే ధైర్యం ఇచ్చినవారవుతారు.
  • తొందరొద్దు.. ‘భర్తను కాదనుకొని వచ్చింది. నలుగురూ ఏమనుకుంటారో!’ కూతురి కన్నీటిని తట్టుకోలేక ధైర్యంగా తీసుకొచ్చినా.. అమ్మానాన్నల్లో ఇలాంటి భయాలెన్నో. నిజానికి చాలామంది కన్నీటిని దిగమింగుకొని బయటికి రానిదీ.. సమాజం గురించిన భయంతోనే. దాంతో వెంటనే మరో తోడు వెదికే పనిలో పడతారు. నయానో, భయానో ఒప్పించడానికీ ప్రయత్నిస్తారు. ఇదీ మంచిది కాదు. మానసికంగా బలహీనమై ఉంటుందా అమ్మాయి. వెంటనే పెళ్లంటే ఆ బంధంమీదే విరక్తి రావొచ్చు. వేరేవాళ్లని నమ్మడానికీ సిద్ధంగా ఉండకపోవచ్చు. కాబట్టి, బయటపడే సమయాన్నివ్వండి.
  • కోపం తీసేయండి.. అవమాన భారం.. తనకే ఇలాంటి పరిస్థితేంటన్న కోపం బాధితుల్లో బలంగా నాటుకుపోయి ఉంటాయి. దాన్ని తొలగించండి. కోపం, బాధ నుంచి బయటికి వచ్చి ఆనందాన్ని ఎంచుకునేలా చేయండి. నచ్చిన పని, బొమ్మలు గీయడం, పెయింటింగ్‌, డ్యాన్స్‌.. ఇలా ఏదోక ఆర్ట్‌ నేర్చుకునేలా ప్రయత్నించండి. ఇదో థెరపీలా పనిచేసి, లోపల గూడు కట్టుకున్న బాధ పోవడమే కాదు.. కొత్త ఆనందాలకూ దారితీస్తాయి.
  • పరిచయం చేయండి.. లోలోపల తెలియని భారం. నలుగురిలో కలవాలంటే సంకోచం. అందుకే నాలుగు గోడల మధ్యే ఉండటానికి ఇష్టపడతారు. అలా కాకుండా కొత్త ప్రదేశానికి తీసుకెళ్లండి. మొక్కల మధ్య గడిపేలానో, స్నేహితులను కలిసేలానో చూడండి. మనసు తేలిక పడుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్