మనసు విప్పి మాట్లాడండి

ఈ తరానికి ఓపిక తక్కువ. చాలామంది పెద్దవాళ్లు అనే మాటే ఇది. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే ఆలుమగలిద్దరూ పనిచేయక తప్పని పరిస్థితి.

Published : 06 Dec 2023 01:55 IST

ఈ తరానికి ఓపిక తక్కువ. చాలామంది పెద్దవాళ్లు అనే మాటే ఇది. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే ఆలుమగలిద్దరూ పనిచేయక తప్పని పరిస్థితి. ఆ ఒత్తిళ్లు, అసహనాలు ఇంటిదాకా రావడం ఒకెత్తయితే.. ఇద్దరి మధ్యా అన్యోన్యత తగ్గడం మరో కారణం. కొనసాగిస్తే.. పిల్లలపైనా ప్రభావం పడదూ? అలా జరగొద్దంటే..

  • ఎడతెరిపిలేని పనులతో ఒత్తిడి, ఆందోళన వేధిస్తున్నప్పుడు ఆత్మీయుల పలకరింపు చాలా బాగుంటుంది కదూ! పెదాలపై చిరునవ్వు పూయించడమే కాదు.. మనసు భారాన్నీ తగ్గించేస్తుంది. ఆఫీసులో ఏమాత్రం విరామం దొరికినా భాగస్వామికి ఓ మెసేజ్‌ పెట్టండి. తిన్నావా అన్న ప్రశ్న.. పోనీ ఒక స్మైలీ.. చిన్నదే కానీ.. మనసుల్ని దగ్గర చేస్తుంది. ఎంతసేపూ నేనే పెట్టాలా అన్న పోటీ వద్దు. మీవంతుగా పెడుతూ వెళ్లండి.. అటు నుంచీ పలకరింపు ప్రారంభమవుతుంది.
  • శ్రీవారూ.. మీకు ఒక్క బాధ్యతే! దానికే తలనొప్పి వస్తోంటే.. ఇల్లు, పిల్లలు.. ఆఫీసు పనులనూ చూసుకుంటున్న ఇల్లాలి సంగతేంటి? చిన్న చిన్న పనులు అందుకోండి. తను ధరించిన దుస్తులు, వంట.. ఇలా ఏది బాగున్నా.. చిన్న మెచ్చుకోలు ఇవ్వండి. ఆ గుర్తింపు చాలదూ.. ఆమెకు మీపై ప్రేమ పొంగడానికి?
  • ఇద్దరూ ఉద్యోగస్థులైతే వచ్చామా.. వేళకింత తిన్నామా అన్నదాంతోనే సరిపోతుంది. ఇక కబుర్లు చెప్పుకోవడానికి సమయమేది? ఇది కూడా దూరానికి కారణమే. రోజూ కలిసి భోజనం చేయడం.. వారంలో ఒకరోజు భాగస్వామికే అని పెట్టుకోవడం చేయండి. మరీ అత్యవసరం అయితే తప్ప నియమాలను విస్మరించొద్దు. అప్పుడు అన్యోన్యత పెరుగుతుంది.
  • నేను కష్టపడుతున్నా అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఎదుటివారి జీతం తక్కువనో.. సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడమో చేస్తేనే ఇద్దరి మధ్యా దూరం తెలియకుండానే పెరుగుతుంది. ఆందోళనతో ఉన్నప్పుడు సాయం చేయండి. నేనున్నా అంటూ భరోసా ఇవ్వండి. కోపంలో ఏమైనా అన్నా మీరూ తిరిగి అనాలనుకోవద్దు. ఆ క్షణం మౌనంగా ఉన్నా చాలు. తర్వాత వాళ్లే కారణం చెబుతారు. లేదంటే మీరే తెలుసుకొని తోచిన సలహాను ఇవ్వండి. ఇది వారికి మనోధైర్యాన్నిస్తుంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తనకంటూ ఒకరున్నారన్న ఆలోచన కొత్త శక్తినిస్తుంది. ఏ నిర్ణయమైనా ఉమ్మడిగా తీసుకుంటూ ఒకరికొకరు అండగా నిలుస్తూ సాగండి. చిన్న చిన్న అలకలే కానీ.. విభేదాలకు తావుండదు. ఇక అసహనాలు, కొట్లాటలకు ఆస్కారమేది?
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్