వీళ్ల ప్రేమ... సూపర్‌ హిట్‌!

చుక్కలాంటి అమ్మాయి... చక్కనైన అబ్బాయి... తెరపై ప్రేమని పండిస్తే ఆ సినిమా 365 రోజుల హిట్‌! అక్కడితో ఆపేయకుండా ఆ ప్రేమను నిజజీవితంలోకీ ఆహ్వానిస్తే... పెళ్లితో వందేళ్ల జీవితానికి తెరతీస్తే... వీళ్లంతా అలా ఇష్క్‌, కాదల్‌, ప్రేమలని పంచుకున్నవాళ్లే! వాలెంటైన్స్‌ డే  సందర్భంగా వాళ్ల ప్రేమ కథలు మనమూ విందామా!

Updated : 14 Feb 2024 12:49 IST

చుక్కలాంటి అమ్మాయి... చక్కనైన అబ్బాయి... తెరపై ప్రేమని పండిస్తే ఆ సినిమా 365 రోజుల హిట్‌! అక్కడితో ఆపేయకుండా ఆ ప్రేమను నిజజీవితంలోకీ ఆహ్వానిస్తే... పెళ్లితో వందేళ్ల జీవితానికి తెరతీస్తే... వీళ్లంతా అలా ఇష్క్‌, కాదల్‌, ప్రేమలని పంచుకున్నవాళ్లే! వాలెంటైన్స్‌ డే  సందర్భంగా వాళ్ల ప్రేమ కథలు మనమూ విందామా!

ప్రాణ స్నేహితులం!

‘భార్యాభర్తలు స్నేహితుల్లా ఉంటే వాళ్ల ప్రయాణం సాఫీగా సాగుతుందని నమ్ముతా. నేను కోరుకున్నట్టే సిద్ధార్థ్‌ భర్త కావడానికి ముందు బెస్ట్‌ ఫ్రెండ్‌ అయ్యాడు’ అని సంబరంగా చెబుతుంది కియారా ఆడ్వాణి. ‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాలతో తెలుగు నాట గుర్తింపు తెచ్చుకున్న ఈమె గత ఏడాది సహనటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాను ప్రేమ వివాహం చేసుకుంది. ‘అమ్మానాన్నలది లవ్‌ మ్యారేజ్‌. చదువుకునే రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడ్డారట. వాళ్ల అనుబంధాన్ని చూస్తూ పెరిగా. నాకూ అలాంటి ప్రేమ దొరకాలని ఎన్నిసార్లు అనుకుని ఉంటానో! అందుకే సిద్ధార్థ్‌తో ‘ఇంట్లో వాళ్లని ఒప్పించాకే పెళ్లి’ అని చెప్పా. ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఒక్కటయ్యాం. స్టార్‌ని కావడానికి ముందు అమ్మాయిని. పెళ్లయ్యాక జీవితం ఎలా ఉంటుందా అని చాలా కంగారుపడ్డా. నాకు వంట కూడా రాదు. కానీ సిద్ధార్థ్‌ నాకు అన్నింటా తోడుగా ఉన్నాడు. అంతెందుకు... పెళ్లయిన కొద్దిరోజులకే నా సినిమా విడుదలైంది. అది చూశాక ఆన్‌లైన్‌లో ‘ఇంకా సినిమాలెందుకు? నీకు పెళ్లయ్యిందని మర్చిపోయావా’ అంటూ బోలెడు నెగెటివ్‌ కామెంట్లు. వాటిని చూసి కుంగిపోయా. అది గమనించిన సిద్ధార్థ్‌ ‘నువ్వేం చేసినా వేలెత్తి చూపేవారు ఉంటారు. అలాగని అన్నీ పట్టించుకుంటావా? అన్నవాళ్లందరికీ తెర వెనక నువ్వేంటో కనీసం తెలుసా? అది నీ కెరియర్‌. ఇంట్లో నువ్వేంటో నాకు తెలుసంటూ’ ఓదార్చాడు. అప్పట్నుంచీ వాటన్నింటినీ పట్టించుకోవడం మానేశా’నంటుంది కియారా. ఇక సిద్ధార్థ్‌ ‘కియారా కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. కెమెరా ముందే తనో స్టార్‌. ఇంటికొస్తే అందరు అమ్మాయిల్లానే ఓ కుటుంబ సభ్యురాలై పోతుంది. తనని చూసి నేను పొందే స్ఫూర్తెంతో’ అంటాడు సిద్ధార్థ. ‘నేను’ అంటూ సాగిన మేము ‘మనం, మన జీవితం’ అంటూ ఆలోచిస్తున్నాం. ఈ తీరే ఒకరికొకరిని మరింత దగ్గర చేస్తోందంటోందీ నయా కపుల్‌.


ఒకరికొకరం... తోడుగా!

ఒకరేమో మౌన ముని. మరొకరేమో అల్లరికి మారుపేరు. ఇద్దరికీ జోడి ఎలా కుదిరిందబ్బా అని కొన్నేళ్లు అభిమానుల్లో ఒకటే చర్చ. ఆ జోడీ మరెవరో కాదు ఫహాద్‌ ఫాజిల్‌, నజ్రియా నాజిమ్‌. అదేనండీ ‘పుష్ప’కి గట్టి పోటీనిచ్చిన భన్వర్‌ సింగ్‌ షెకావత్‌, ‘అంటే సుందరానికి’లో లీలా. 2014.. ఇద్దరూ ‘బెంగళూరు డేస్‌’ కోసం పనిచేస్తున్నారు. అప్పటికి ఫహాద్‌ మరో రెండు సినిమాలు చేస్తున్నా, నజ్రియాతో నటిస్తోన్న దానికోసం మరింత ఉత్సాహంగా వచ్చేవారట. ఆయన ఆ ఇష్టాన్ని గ్రహించేలోపే ఇంట్లోవాళ్లు ఆమెతో పెళ్లి ప్రపోజల్‌ తెచ్చారు. సంబరపడిపోయిన ఫహాద్‌ బయట కలుద్దామంటూ ఓ ఉత్తరాన్ని రాసి, దానికో ఉంగరాన్ని జోడించి పంపారట. ఆయన ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ అటువైపు నుంచే ‘ఎస్‌, నో’ అన్న సమాధానమేమీ రాలేదు. అప్పుడు ఆలోచనలో పడ్డారట ‘‘నజ్రియా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నేనింకా నిరూపించుకోవాలి. ఇక ఇది ముందుకెళ్లదు అనుకున్నా. తనేమో మర్నాడు సెట్‌కొచ్చి అందరిముందూ ‘ఒక్క జీవితం. నచ్చిన వాళ్లతో మెచ్చిన విధంగా జీవించాలి. జీవితాంతం నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా. కలిసి నడుద్దామా’’ అంది. పీకల్లోతు ప్రేమలో పడిపోకుండా ఎలా ఉంటా? సినిమా విడుదల అవ్వడానికి ముందే పెళ్లి పీటలెక్కేశాం. నేను సాధించిన ఏ విజయమైనా తన వల్లే’ అంటారాయన. ఇక నజ్రియా ‘‘పెళ్లి తర్వాత కొంతకాలం విరామం తీసుకున్నా. అదిచూసి ‘ఇద్దరికీ 12 ఏళ్లు తేడా. ఫహాద్‌ నీకు సరిపోడు, సినిమాలకు దూరంగా ఉంచా’డంటూ ట్రోల్‌ చేసేవారు. ఎన్నిసార్లు చెప్పినా ఇదే తీరు. కొన్నాళ్లకి ఇద్దరం పట్టించుకోవడం మానేశాం. తర్వాత తిరిగి కెరియర్‌పై దృష్టిపెట్టా. ప్రేమ కథలైనా, మరేదైనా తనెప్పుడూ అడ్డు చెప్పలేదు. నా ప్రతి నిర్ణయంలో తోడున్నాడు’’ అంటుంది. పదేళ్ల కాపురం... కష్టమైనా, సుఖమైనా ఒకరికొకరం తోడుగా నిలిచాం అదే మమ్మల్ని నడిపిస్తోందంటారు ఇద్దరూ.


అదే... మా రహస్యం!

ప్రేమించినప్పుడు భయమెందుకు అంటుందామె. మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించడమే ప్రేమ అంటాడతను. అందుకే బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌గా నిలిచారు ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌! ‘సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌వి. అప్పుడే పెళ్లేంటి? చాలామంది నుంచి నాకొచ్చిన ప్రశ్నే ఇది. నా మొదటి క్రష్‌ రణ్‌బీర్‌. తొలిసారి కలిసినప్పుడే మీరంటే నాకిష్టమని చెప్పేశా. కానీ మా ఇద్దరి మధ్యా ప్రేమ సరిగ్గా ఎప్పుడు మొదలైందంటే మాత్రం కచ్చితంగా చెప్పలేను. ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌లో సహజంగా జరిగిపోయింది. అనుకోకుండా ఓ రోజు మోకాలి మీద కూర్చొని ‘పెళ్లి చేసుకుంటావా’ అన్నాడు. ఇరు కుటుంబాలూ అంగీకరించడంతో పెళ్లి జరిగిపోయింది. కెరియర్‌ ఏమవుతుందా అన్న భయం నాకు లేదు. ఎందుకంటే నా నిర్ణయాన్ని తను కాదనడన్న నమ్మకం. అంతేకాదు, అప్పుడు నా మనసులో ఒక్కటే ఆలోచన... ఈ వ్యక్తితో జీవితం పంచుకోవాలి అనే! మనసైన వాడు దొరికితే ఇన్నాళ్లూ ఇతనికోసమే వేచి ఉన్నానా అనిపిస్తుందని అంటారు కదా! దాని అర్థం నాకప్పుడే తెలిసింది. అమ్మానాన్నలమైనా ఇప్పటికీ మా మధ్య అదే దగ్గరితనం’ అంటుంది ఆలియా. ‘ఆలియా ఎక్కడుంటే అక్కడ ఉత్సాహం పొంగుతూ ఉంటుంది. నేనేమో కామ్‌, అన్నీ పద్ధతిగా ఉండాలంటా. పెళ్లయ్యాక తను ఎక్కడివక్కడ వదిలేస్తే నేనేమో సర్దుతుంటా. కానీ ఇంట్లోకి అడుగుపెట్టే సమయానికి ఎలాంటి మూడ్‌తో ఉన్నా, దాన్ని తిరిగి సంతోషంగా మారుస్తుంది ఆలియా. అందుకే కొన్నిసార్లు నేను తనకి తగినవాడినేనా అనిపిస్తుంది కూడా’ అని నవ్వేస్తాడు రణ్‌బీర్‌. చిన్న చిన్న గొడవలు వీరికీ వస్తాయట. ఎదుటివారు చెప్పేది వినడం, తప్పెవరిదైనా సారీ చెప్పడానికి వెనకాడకపోవడమే వాళ్ల అనురాగ బంధంలోని రహస్యం అంటారు వీళ్లు.


ప్రేమ చిగురించిందలా

‘ఇద్దరికీ ఫిట్‌నెస్‌, సినిమాలంటే ప్రాణం... అవే తమని ప్రేమ బాటలో నడిపించాయనీ, ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేశాయనీ’ అంటోంది రకుల్‌. తెలుగు నటిగా రకుల్‌ ప్రీత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో పడ్డ ఆమె... ఈ నెల 21న వైవాహిక బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ‘లాక్‌  డౌన్‌లో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న చాలా జంటల్లానే, మేమూ వివాహ బంధంతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నాం. నిజం చెప్పాలంటే మా ప్రేమా అప్పుడే చిగురించింది. అంతకు ముందు వరకూ ముంబయిలో జాకీ, నేనూ ఇరుగుపొరుగు ఇళ్లల్లోనే ఉన్నా... కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సమయంలో ముఖ పరిచయమే తప్ప, స్నేహం లేదు. లాక్‌డౌన్‌లో  కామన్‌ఫ్రెండ్స్‌ ద్వారా జాకీతో ఫ్రెండ్‌షిప్‌ మొదలయ్యింది. క్రమంగా ఒకరంటే మరొకరికి ఇష్టమని తెలుసుకున్నాం. ఆపై ఎన్నో సాహస, విహారయాత్రలకు వెళ్లాం. అలా మేం గడిపిన ప్రతిక్షణం మా బంధాన్ని మరింత బలంగా మార్చింది. నేను స్వతంత్ర భావాలున్న అమ్మాయిని. కెరియర్‌, జీవితంపై స్పష్టమైన అభిప్రాయాలూ ఉన్నాయి. అతనూ సినీ రంగానికి చెందిన వ్యక్తే కావడంతో నన్ను అర్థం చేసుకున్నాడు. జాకీ వచ్చాక నా జీవితమెంతో అందంగా మారింది. ఇద్దరం సినిమా, ఫిట్‌నెస్‌లను ఇష్టపడతాం. కలిసినప్పుడు అవే చర్చలు. మా అభిరుచులూ ఆసక్తులూ కలిశాయి కాబట్టే... జీవితాంతం ఒక్కటిగా నడవాలనుకున్నాం. ప్రేమకు నిర్వచనాలు చెప్పడం కష్టమే... కానీ, అదో అందమైన అనుభూతి. జాకీతో ప్రేమలో పడ్డాకే నాకా విషయం అర్థమైంది. అయితే ప్రేమలో ఉన్నవాళ్లు అసత్యాలు చెప్పడాన్నీ, ఎమోషనల్‌గా మాట్లాడి మోసం చేయడాన్నీ మాత్రం నేను సహించలేను. పారదర్శకంగా ఉంటేనే ఏ బంధమైనా శాశ్వతంగా ఉంటుంది’ అంటోంది రకుల్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్