మీ చిన్నారి అసూయ పడుతోందా?

అసూయ, ఈర్ష్య... వంటివి పిల్లల్లో కనిపిస్తే వాటిని మొదట్లోనే తుంచేయాలి. లేదంటే... భవిష్యత్తులో అవే వారి వ్యక్తిత్వాన్ని ప్రతికూలంగా మార్చేస్తాయంటారు నిపుణులు.

Published : 01 Mar 2024 02:03 IST

అసూయ, ఈర్ష్య... వంటివి పిల్లల్లో కనిపిస్తే వాటిని మొదట్లోనే తుంచేయాలి. లేదంటే... భవిష్యత్తులో అవే వారి వ్యక్తిత్వాన్ని ప్రతికూలంగా మార్చేస్తాయంటారు నిపుణులు. అలాకాకూడదంటే...

మీరే చెప్పాలి: పిల్లలకు అమ్మే మొదటి శిక్షకురాలు. ఇల్లే బడి. అందుకే, వారి భవిష్యత్తుకి బలమైన పునాది ఇక్కడే పడాలి. తోటిపిల్లల్లో, తోడబుట్టినవారో...ఓ వస్తువో, బొమ్మో కొనుక్కుంటే అలాంటిదే కావాలని పేచీ పెట్టడం సహజమే. కానీ, తనకు దక్కనిది వారికీ ఉండకూడదనీ, అవి పాడైపోతే సంతోషించాలనీ భావించే తత్త్వం ఉంటే మాత్రం సరిదిద్దాల్సిందే. స్వయంగా తనే వాటిని నాశనం చేస్తే మాత్రం క్షమాపణ అడిగేలా చేయండి. తిరిగి వాటిని అతకమని చెప్పండి.

అలా వదిలేయొద్దు: ఏ విషయంలోనైనా అవతలివారు తమకంటే ఎక్కువ అని భావిస్తే...వారిని దూరం పెట్టడం, లోపాలు వెతికి హేళన చేయడం వంటివి చేస్తుంటారు కొందరు పిల్లలు. లేదంటే... ప్రతిదానిలోనూ వారితో పోల్చుకుని మరింత కుంగిపోతుంటారు. ఇలాంటప్పుడు చిన్నపిల్లలే కదా! సర్దుకుంటారులే అని చూసీ చూడనట్లు వదిలేయొద్దు. ప్రతి ఒక్కరిలోనూ బలాలూ, బలహీనతలూ ఉంటాయని గుర్తు చేయండి. బలాల్ని పెంచుకోవడమెలానో తెలపండి. ఇతరులతో ఆరోగ్యకరమైన పోటీకి దారుల్ని చూపించండి. ఇవన్నీ వారి వ్యక్తిత్వం మెరుగుపడేందుకు తోడ్పడతాయి.

మనసు పంచుకోండి: పిల్లలతో తగినంత సమయం గడపగలిగితే...వారిలోని భయాలు, ఆందోళనలూ, అసూయ, ద్వేషం వంటి భావోద్వేగాలను పసిగట్టొచ్చు. వాటి ఆధారంగా మీ చిన్నారిని సన్మార్గంలో నడిపించొచ్చు.

గుర్తించాల్సిందే... స్నేహితులతోనో, ఇతర వ్యక్తులతోనో పోల్చుకోవడం...వారిని అనుకరించాలని చూడటం, తరచూ తోటివారి గురించి ప్రతికూలంగా మాట్లాడటం వంటివి చేస్తోంటే మొదట్లోనే అలాంటి ఆలోచనల్ని తుంచేయండి.  మంచీచెడుల్ని ఎలా గుర్తించాలి, ఎదుటివారిని అభినందిస్తే...వచ్చే ప్రయోజనం ఏంటి? వంటివన్నీ ఆ చిన్ని మనసులకు అర్థమయ్యేలా చెప్పగలిగితే చాలు. భవిష్యత్తులో సంతోషంగా ఉండగలరు.

ఎత్తి చూపొద్దు... పిల్లలు ఎవరి గురించైనా అసూయ పడుతున్నట్టు అనిపిస్తే ‘నువ్వు ఆమెలా మార్కులు తెచ్చుకోవచ్చుగా, అప్పుడు నిన్ను కూడా అందరూ మెచ్చుకుంటారు’ ‘నీ స్నేహితురాలు సాధిస్తే నీకు కూడా గొప్పేగా’ ఇలాంటి సానుకూల దృక్పథాన్ని పెంచేలా మాట్లాడాలి. అలాకాకుండా వాళ్లు చూడు...వీళ్లు చూడు అని మీరే పదే పదే పిల్లల్ని ఎత్తిచూపడం, తిట్టడం వంటివి చేస్తుంటే కూడా వారిపై ద్వేషం, అసూయ పెంచుకునే ప్రమాదం ఉంది. స్నేహంగా ఉంటే కలిగే ఆనందాన్ని వారికి అర్థమయ్యేట్టు చెప్పండి. కచ్చితంగా రాగద్వేషాలకు అతీతంగా ఎదగగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్