మామయ్యకు రాసిచ్చారు... ఆస్తి మాకొస్తుందా?

అమ్మమ్మ, తాతయ్యలు బతికి ఉన్నప్పుడు అత్తయ్య వారి బాగోగులు చూడలేదు. ఆ కారణంతోనే.. ఇంటినీ, ఎకరం పొలాన్నీ ముగ్గురు కూతుళ్లకూ చెందేలా వీలునామా రాసి రిజిస్ట్రేషన్‌ చేయించారు.

Updated : 12 Mar 2024 13:14 IST

అమ్మమ్మ, తాతయ్యలు బతికి ఉన్నప్పుడు అత్తయ్య వారి బాగోగులు చూడలేదు. ఆ కారణంతోనే.. ఇంటినీ, ఎకరం పొలాన్నీ ముగ్గురు కూతుళ్లకూ చెందేలా వీలునామా రాసి రిజిస్ట్రేషన్‌ చేయించారు. అయితే, ఆ కారణంగా అత్తయ్య, మామయ్య తరచూ గొడవపడుతుండటం చూసి అమ్మావాళ్లంతా మామయ్యకే రాసిచ్చేశారు. వారికి సంతానం లేదు. అయినా ఆవిడలో ఏ మార్పు రాలేదు. వారి తదనంతరం ఆ ఆస్తులపై మాకు హక్కు వస్తుందా? ఎందుకంటే, ఆమె పుట్టింటివారంతా ఇప్పుడు ఆమె పంచన చేరారు? సలహా ఇవ్వగలరు.

 ఓ సోదరి.

మీ అమ్మగారు, వారి అక్కలు తమ తండ్రి నుంచి వచ్చిన ఆస్తిని... మీ మామయ్యకు ఎలా రాసిచ్చారు? అంటే...రిజిస్టర్‌ చేశారా? ఒకవేళ అలా చేసి ఉంటే... అప్పుడు వారు రాసిచ్చిన కాగితం కూడా రిజిస్ట్రేషన్‌ అయ్యి ఉండాలి. కేవలం పేపర్‌ మీదే రాసుకుంటే మాత్రం అది చెల్లదు. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌-8 ప్రకారం ఎటువంటి వీలునామా లేకుండా చనిపోయిన మగవారి ఆస్తి క్లాస్‌-1 హెయిర్స్‌ అంటే భార్యకి, పిల్లలకు చెందుతుంది. ఒకవేళ వారికి పిల్లలు లేకపోతే తల్లికి, భార్యకు సమానంగా చెందుతుంది. సంతానం లేని మీ అత్తయ్య... తన ఆస్తికి ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోతే  పై చట్టంలోని 15(1) ప్రకారం అది భర్త తరఫున వారసులకు చెందుతుంది. ఒకవేళ ఆవిడకు ఆ ఆస్తి తన తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తే సెక్షన్‌ 15(2ఎ)ననుసరించి ఆమె తండ్రి వారసులకు చెందుతుంది. అలాకాకుండా మామగారి ఆస్తి అయి ఉండి, భర్త పిల్లలు లేకపోతే అందులోని సెక్షన్‌15 (2బి) ప్రకారం భర్త వారసులకు చెందుతుంది. మీ మేనమామకి మీ అమ్మగారూ వాళ్లు... గిఫ్ట్‌ డీడ్‌ రాసి ఉంటే అందులో రెవోకేషన్‌ క్లాజ్‌ పెట్టి ఉంటే... వారికి వెనక్కి తీసుకునే హక్కు ఉంది. వారు బతికి ఉండగానే దాన్ని తిరిగి తీసుకుని ఆ ఆస్తిని కేవలం అనుభవించేలా రాసి రిజిస్ట్రేషన్‌ చేయిస్తే మంచిది. వాళ్లిద్దరిలో ఎవరు ముందు చనిపోయినా సరే, ఎవరి పేరు మీద రాయకుండా ఉంటే పైన చెప్పినవన్నీ వర్తిస్తాయి. ముందు ఓ మంచి లాయర్‌ని సంప్రదించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్