సీత... ఎప్పటికీ వాళ్ల పెద్ద కూతురే!

సీతారాములు మనకు దేవుళ్లు. కానీ అక్కడి వాళ్లకి మాత్రం వాళ్లు కూతురూ అల్లుడూ. అదెక్కడో... వాళ్ల కథేంటో... చదివేద్దామా?

Published : 17 Apr 2024 00:15 IST

సీతారాములు మనకు దేవుళ్లు. కానీ అక్కడి వాళ్లకి మాత్రం వాళ్లు కూతురూ అల్లుడూ. అదెక్కడో... వాళ్ల కథేంటో... చదివేద్దామా?

స్వయంవరం ముగిసింది. తను మెచ్చినవాడినే సీత పెళ్లాడబోతోంది. కూతురి ఇష్టం కంటే తండ్రికి కావాల్సింది ఇంకేం ఉంటుంది? అందుకే చాలా ఆనందంలో ఉన్నాడట జనకుడు. అందుకని ఊళ్లోని గోడలన్నీ ‘వధూవరు’ల స్వయంవరం, వేడుకల అందమైన చిత్రాలతో నిండిపోవాలని ఆదేశించాడట. అలా పుట్టుకొచ్చిన ‘మిథిలా కళ’ కాస్తా ‘మధుబని’గా మారిందని చెబుతారు. అందుకే ఈ ఆర్ట్‌లో రామాయణంలోని వివిధ ఘట్టాలకు, ప్రకృతికే ఎక్కువ ప్రాధాన్యం. ఈ కళ ఇన్నేళ్లైనా కొనసాగడానికీ బిహారీ మహిళలే కారణమంటారు. సంప్రదాయంగా, ఇంటి అలంకరణలో భాగంగా వాళ్లు కొనసాగిస్తూ రావడం వల్లే ఈ తరాలకీ మధుబని పరిచయం అవుతోందంటారు నిపుణులు. సంప్రదాయాలకు వాళ్లిచ్చే విలువ అలాంటిది మరి!

అలాంటి భర్తే కావాలి...

అంతెందుకు, నేడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... దేశమంతా అంగరంగ వైభవంగా ‘జానకీరాముల’ కల్యాణం చేసి మురిసిపోతాం కదా! మిథిల భాగంగా ఉన్న బిహార్‌లో మాత్రం ప్రతి పెళ్లి కొడుకూ, పెళ్లికూతురూ సీతారాములే. పెళ్లయ్యాక సీతమ్మ అన్ని కష్టాలు పడింది కదా! అయినా ఆ దంపతుల మధ్య ప్రేమే వీళ్లకీ దక్కాలి అని పాటల ద్వారా దీవిస్తారు. ఇక పెళ్లి కాని అమ్మాయిలైతే ఏకంగా ‘దశరథుడంటి మామగారు, కౌసల్య వంటి అత్తగారు, రఘురాముడంటి భర్తే కావా’లంటూ కోరుకుంటారు కూడా! పెళ్లయ్యాక పుట్టింటిని వదిలి అత్తారింట్లో అడుగు పెడుతుంది అమ్మాయి. ఎంతైనా కొత్త ఇల్లు. ఆకలేసినా నోరు తెరిచి అడగలేని మొహమాటం. సంతృప్తిగా తినాలన్నా భయమే! ఇలాగైతే కూతురు బక్కచిక్కిపోదూ? అందుకని సీతాదేవి తల్లి ప్రత్యేకంగా కొన్ని మిఠాయిలు చేయించి మరీ కూతురికిచ్చి పంపిందట. ఇప్పటికీ బిహార్‌లో ఆ సంప్రదాయం పాటిస్తున్నారు. పెళ్లికూతురికి అవసరమైన వస్తువులతోపాటు కొన్ని నెలలు నిల్వ ఉండేలా రకరకాల స్వీట్లను తయారుచేసి వధువుతోపాటు పంపిస్తారు.

నీళ్లే తాగరు...

రాముడంటే మనకు దేవుడు. కానీ మిథిలా వాసులకు మాత్రం అల్లుడే! అంతెందుకు, కొన్నేళ్ల క్రితం వరకూ పనిమీద అయోధ్యకు వెళ్లినా అక్కడ పచ్చి మంచినీళ్లు ముట్టుకునేవారు కాదట. ‘అమ్మాయి అత్తారింట్లో గతికితే ఎలా’ అనేవారట. జానకి ఎప్పటికీ వాళ్ల పెద్ద కూతురే. పైగా... ‘సీతారాములను అడవులకు పంపడం అయోధ్య ప్రజలు చేసుకున్న దురదృష్టం. వాళ్ల విలువేంటో మాకు బాగా తెలుసు’ అంటారట. ప్రేమగా సీతతోపాటు రామయ్యనీ ఆదరిస్తారు. చిలిపి పేర్లతో పిలుచుకుంటారు. చూసే వాళ్లకే వింత... వాళ్లకి మాత్రం అది బంధుత్వం. ఆత్మీయతను పంచుకునే విధానం.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్