పంచతంత్రం... ఆఫీసు పాఠం!

పంచతంత్ర కథలు ఎప్పుడైనా చదివారా? ప్రతి కథా వినోదాన్ని పంచడమే కాదు... చివర్లో జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాన్నీ చెబుతుంది.

Published : 19 May 2024 01:41 IST

పంచతంత్ర కథలు ఎప్పుడైనా చదివారా? ప్రతి కథా వినోదాన్ని పంచడమే కాదు... చివర్లో జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాన్నీ చెబుతుంది. అందుకే పిల్లలని నిద్రపుచ్చేటప్పుడు చెప్పే కథల్లో వీటికీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాం. అయితే ఆఫీసు విషయంలోనూ వీటిని స్ఫూర్తిగా తీసుకోండి అంటున్నారు నిపుణులు. ఎలాగంటే...

ఇద్దరు స్నేహితులు, ఎలుగుబంటి కథ గుర్తుందా? రాజు, శ్యామ్‌ అనే ప్రాణస్నేహితులు అడవి మార్గంలో వెళ్తుంటారు. ఇంతలో ఎలుగుబంటి కనిపిస్తుంది. రాజు స్నేహితుణ్ణి పట్టించుకోకుండా చెట్టు ఎక్కి కూర్చుంటాడు. స్నేహితుడికి సాయం చేయాలన్న ఆలోచననీ మర్చిపోతాడు. శ్యామ్‌కేమో చెట్టెక్కడం రాదు. వేరే తప్పించుకునే మార్గమూ కనిపించలేదు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో అతనికి ‘ఎలుగుబంట్లు మృతదేహాలను పట్టించుకోవ’న్న సంగతి గుర్తొస్తుంది. ఊపిరి బిగబట్టి, నేలపై పడుకుండి పోతాడు. ఎలుగుబంటి దగ్గరకొచ్చి పరిశీలిస్తుంది. ఊపిరి తగలకపోయేసరికి చనిపోయాడనుకుని వెళ్లిపోతుంది. ఇక ప్రమాదం తప్పింది అనిపించాక రాజు చెట్టుదిగి స్నేహితుడి దగ్గరకు వస్తాడు. ‘ఎలుగుబంటి చాలాసేపు నీ ముఖం దగ్గరే ఉంది కదా... ఏం చేసింది’ అనడుగుతాడు. దానికి శ్యామ్‌ ‘రాజును ఇంకెప్పుడూ నమ్మకు. అతను మంచి స్నేహితుడు కాదని చెప్పింది’ అంటాడు. అప్పుడు రాజుకి తను చేసిన పొరపాటు అర్థమవుతుంది. తిరిగి దిద్దుకుందామనుకున్నా అప్పటికే ఆలస్యమవుతుంది.

ఈ కథకీ, ఆఫీసు పనికీ సంబంధం ఏమిటి అంటారా? రోజూ మన దగ్గరికొచ్చి పలకరించేవారు, చిన్న చిన్న పొగడ్తలు కురిపించేవారు చాలామంది ఉంటారు. వారంతా స్నేహితులే అనేసుకుంటాం కూడా. కానీ వారిలో మనవాళ్లు ఎవరో తెలిసేది ఇదిగో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే! ఆఫీసులో డెడ్‌లైన్‌ ముంచుకొస్తోంది. చేయాల్సిన పనేమో చాలా ఉంది. ‘నాది కాదుగా... చేస్తే నాకేమైనా పేరొస్తుందా’ లాంటివి ఆలోచించకుండా ‘అరెరె కాస్త అందుకుంటే పని పూర్తవుతుంది. ఆలస్యమైతే మన టీమ్‌కేగా చెడ్డపేరు’ అనుకొని పని అందుకునేవారే అసలైన స్నేహితులు, బృందసభ్యులు. అలాంటివారినే నమ్మమని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి అన్నమాట. ఈసారి ఏ కథ చదివినా ఆఫీసుపరంగానూ ఆలోచిస్తారుగా మరి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్