అబద్ధాలు చెబుతున్నారా?

ఏడో తరగతిలో ఉన్న కూతురిని పాకెట్‌మనీనెలా ఖర్చు పెట్టిందో అడిగినప్పుడు తన సమాధానంలో నిజాయితీ లేకపోవడం మాధురి గుర్తించింది. ఈ విషయమే కాదు, తరగతిలో తాను చేసిన పొరపాట్లను మరొకరిపై చెబుతున్న కూతురి తీరుని ఎలా సరిచేయాలో మాధురికి తెలియడం లేదు.

Published : 21 May 2024 01:09 IST

ఏడో తరగతిలో ఉన్న కూతురిని పాకెట్‌మనీనెలా ఖర్చు పెట్టిందో అడిగినప్పుడు తన సమాధానంలో నిజాయితీ లేకపోవడం మాధురి గుర్తించింది. ఈ విషయమే కాదు, తరగతిలో తాను చేసిన పొరపాట్లను మరొకరిపై చెబుతున్న కూతురి తీరుని ఎలా సరిచేయాలో మాధురికి తెలియడం లేదు. బాల్యం నుంచి నిజాయితీగా ఉండడమెలాగో నేర్పాలంటే పెద్దవాళ్లు కొన్ని నియమాలు పాటించాలంటున్నారు నిపుణులు.

పిల్లలు ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్పడం, తాము తప్పు చేయడంలేదని వాదించడం వంటివి చేస్తున్నారంటే అది తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటూ ఉండొచ్చు. అబద్ధాలు చెప్పే అలవాటు పెద్దవాళ్లకు ఉంటే గనుక పిల్లలు గ్రహిస్తారు. అదే విధానాన్ని అనుసరిస్తారు. తాము నిజం మాట్లాడకుండా పిల్లలను మాత్రం పాటించాలని చెప్పడం మంచిది కాదు. వారిలో మార్పు తేవాలని అనుకోవడం కన్నా ముందుగా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. ఆ తరవాతే.. పిల్లలకు నేర్పించాలి. ఉన్నదున్నట్లుగా నిజాన్ని మాత్రమే మాట్లాడగలగడం, నిజాయితీగా ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో కథల ద్వారానూ వినిపించాలి.

అడిగి తెలుసుకోండి...

రోజూ కొంత సమయాన్ని పిల్లలతో గడపాలి. వారితో చర్చిస్తూనే వారి ఆలోచనలను పంచుకోవాలి. ఆ రోజు విశేషాలను అడిగి తెలుసుకుంటూనే ఆయా సందర్భాల్లో పిల్లలెలా ప్రవర్తించి ఉంటారో గుర్తించాలి. చుట్టుపక్కలవారితో అనుబంధాన్నెలా కొనసాగిస్తున్నారో తెలుసుకోవాలి. స్నేహితుల ఆలోచనలను అర్థం చేసుకోవడంతోపాటు వారిపట్ల నిజాయితీగా ఉంటే, ఆ బంధాలను కలకాలం నిలుపుకోగలమన్న అవగాహన కలిగించాలి.

ప్రశంసిస్తేనే...

మార్కుల విషయంలో మాత్రమే కాకుండా పిల్లల ప్రవర్తన ప్రశంసాపూర్వకంగా కనిపిస్తే వెంటనే అభినందించాలి. దీంతో ఇతరులను ప్రశంసించగలిగే నిజాయితీ పిల్లలూ నేర్చుకుంటారు. అసూయ, ద్వేషం వంటివి ప్రదర్శించకుండా మనస్ఫూర్తిగా ఎదుటివారి గొప్పతనాన్ని గుర్తించి అభినందించడం తెలుసుకుంటారు. దీనిద్వారా ఎదుటివారి విశ్వాసాన్నీ, ప్రేమనూ పొందవచ్చని ప్రయోగాత్మకంగానూ పిల్లలకు అర్థమవుతుంది. అందరితో సత్సంబంధాలను ఏర్పరుచుకోగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్