ముగ్గురు భార్యల్నీ... మెప్పిస్తాడట!

మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అయితే, నా కంటే ముందు ఒకరినీ, నా తరవాత మరొకరినీ నా భర్త పెళ్లి చేసుకున్నాడని ఈ మధ్యే తెలిసింది. ఇదేంటని పెద్దల ముందు పంచాయతీ పెడితే... ఎవరికీ అన్యాయం చేయననీ, అందరినీ బాగా చూసుకుంటానని చెబుతున్నాడు.

Published : 22 May 2024 13:51 IST

(Image For Representation)

మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అయితే, నా కంటే ముందు ఒకరినీ, నా తరవాత మరొకరినీ నా భర్త పెళ్లి చేసుకున్నాడని ఈ మధ్యే తెలిసింది. ఇదేంటని పెద్దల ముందు పంచాయతీ పెడితే... ఎవరికీ అన్యాయం చేయననీ, అందరినీ బాగా చూసుకుంటానని చెబుతున్నాడు. ఇన్నేళ్లలో నన్ను ఏ రోజూ ఇబ్బంది పెట్టలేదు. అలాగని వేరొకరితో కాపురం చేస్తుంటే చూస్తూ ఉండలేను. నాకు న్యాయం జరిగేదెలా?

ఓ సోదరి.

మీ పరిస్థితి బాధాకరం. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకోవడం అతడు చేసిన అన్యాయమే కదా! ఇంకా మీకెవరికీ అన్యాయం చేయనని చెప్పడం ఏంటి? హిందూ వివాహ చట్టం స్త్రీ/పురుషులెవరికైనా ఒకరే భర్త/భార్యగా ఉండాలని చెబుతోంది. ఇందులోని సెక్షన్‌ 5క్లాజ్‌(1) ప్రకారం పెళ్లి చేసుకునే వ్యక్తికి ఇంకో వివాహం అయి ఉండకూడదు. ఒకవేళ అయితే, చట్ట ప్రకారం విడాకులు తీసుకుని ఉండాలి. కానీ, అతడు చట్టాన్నీ సమాజాన్నీ లెక్క చేయకుండా మోసంతో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. తిండి, బట్ట, ఇల్లు సమకూర్చడమే భార్యకి చేసే న్యాయం అనుకునే వ్యక్తితో సంసారం చేయాలనుకోవడం మీకు మంచిది కాదు. అసలు ముందు భార్య నుంచి విడాకులు తీసుకోకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమే చట్టబద్ధం కాదు. మీరు కావాలంటే సెక్షన్‌-13 ప్రకారం విడాకులు కోరవచ్చు. అలానే హిందూ వివాహచట్టంలోని సెక్షన్‌ 25 ప్రకారం మీరూ, పిల్లలూ  భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా బతకడానికి కావలసిన మొత్తాన్ని శాశ్వత భత్యంగా పొందవచ్చు. మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని క్రిమినల్‌ కేసు పెట్టొచ్చు. ముందుగా పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు కోరండి. మీకూ, పిల్లలకూ శాశ్వత భత్యం ఇచ్చేలాగ ఒప్పించి ఒక అగ్రిమెంట్‌ రాయించండి. ఆపై దాన్ని సాక్ష్యంగా చూపించి కోర్టులో డివోర్స్‌ కేసు వేయండి. సెక్షన్‌ 13(బి) కింద పరస్పర ఒప్పందం ప్రకారం విడాకులు తీసుకోండి. ఇందుకోసం ఆలస్యం చేయకుండా ఓ మంచి లాయర్‌ని సంప్రదించి ముందడుగు వేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్