Updated : 09/11/2022 04:10 IST

పులి కళ్లలోకి చూస్తూ..

అడవిలోని చెట్టు, పుట్ట గురించే కాదు.. జంతువుల ఆనుపానులు సైతం అడవి బిడ్డలకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియవేమో! అందుకే అడవికి పెద్దన్నలాంటి పులిని కాపాడే బాధ్యతని ఆదివాసి ఆడపడుచు గెడం సునీత తీసుకుంది. తొలి ‘టైగర్‌ ట్రాకర్‌’గా మారిన ఆమెతో వసుంధర మాట్లాడింది...

ఒకప్పుడు మృగాల నుంచి మనుషులకి రక్షణ కావాల్సి వచ్చేది. ఇప్పుడు వేటాడే మనుషుల నుంచే అరకొరగా మిగిలిన పులులని కాపాడాల్సి వస్తోంది. అలా కాపాడాలంటే వేటగాళ్ల ఉచ్చుల గురించే కాదు... పులుల జాడ గురించీ పూర్తిగా తెలిసుండాలి. అవన్నీ తెలిసిన అమ్మాయి కాబట్టే రెండేళ్ల క్రితం సునీతకి ఆ బాధ్యత అప్పగించారు కుమురం భీం జిల్లా అటవీ అధికారులు. ‘నా బాల్యమంతా దట్టమైన అడవి ఒడిలోనే సాగింది. పెంచికల్‌పేట్ మండలం గుండెపల్లి మాది. నా చిన్నప్పుడు రకరకాల జంతువులు స్వేచ్ఛగా మా గ్రామాల్లోకి వచ్చి పోయేవి. వాటికి హాని చేయకుండా.. వాటిబారిన పడకుండా సహజీవనం మాకేమీ కొత్త కాదు’ అంటోంది సునీత.

అడవికి పహారా..

కొన్నేళ్లుగా... స్మగ్లింగ్‌, వేటగాళ్ల దాడులు పెరగడంతో అడవిలో కలపకీ, పులులకూ రక్షణ కరవైంది. ఈ పరిస్థితుల్లో 2015లో సిర్పూర్‌ (టి) అడవుల్లో ప్రవేశించిన పులి ఫాల్గుణ ఎనిమిది పిల్లలను కనింది. ఈ ఏడేళ్లలో వాటి సంతతి పెరుగుతూ 12 వరకు చేరుకున్నాయి. ఇవి బెజ్జూర్‌, దహెగాం, పెంచికల్‌పేట్, కాగజ్‌ నగర్‌ మండలాల్లో సంచరిస్తుంటాయి. వీటి ఆనుపానులు, వాటికి ఎదురయ్యే ఆపదల గురించి అధికారులకు సమాచారం ఇస్తూ, వాటికి ఏ ముప్పూరాకుండా చూస్తుంటారు సునీత, ఆమె సహ ట్రాకర్ల బృందం. ‘చిన్నప్పట్నుంచీ పులులు, ఇతర మృగాలను చూస్తూ గడపడం వల్ల వాటితో ఎలా మెలగాలో నాకు తెలుసు. అందుకే అధికారుల నుంచి పిలుపు రాగానే కుటుంబ సభ్యులను ఒప్పించి టైగర్‌ ట్రాకర్‌గా బాధ్యతలు తీసుకున్నా. పాదముద్రలు, కెమెరాల్లో నిక్షిప్తమైన వాటి చిత్రాల ఆధారంగా పులి ఎటునుంచి వచ్చింది, ఎటు వెళ్లింది అనే విషయాలను పై అధికారులకు రిపోర్ట్‌ చేస్తా. కొత్తగా పోడు సాగు కోసం అడవులను నరికే వాళ్లను సముదాయించి, చెట్లు కొట్టకుండా చూడటమూ నా విధే. మా ప్రాంతంలోని ఐదారు గ్రామాల పరిధిలో పులులు పశువులపై దాడి చేస్తూనే ఉంటాయి. పశువుల యజమానులకు పరిహారం అందేలా చూడటం.. ప్రజలను అప్రమత్తం చేయడమూ నా విధులే. వేట గాళ్లు విద్యుత్‌ వైర్లకి హుక్కులు పెట్టి జంతువులకు షాక్‌ తగిలేలా చేస్తారు. ఉచ్చులు వేస్తారు. ఇవన్నీ గుర్తించి అధికారులకు చెప్పాలి’ అనే సునీత పులి ఎదురుపడ్డప్పటి అనుభవాలనీ వివరించింది. 

పులి ఎదురైతే...

‘నాకు తరచూ పులులు కనిపిస్తూనే ఉంటాయి. అవి ఉన్న చోట ఒకరకమైన వాసన ఉంటుంది. అది పసికట్టే నైపుణ్యం నాకుంది. బెబ్బులికి అలికిడి వినిపించకుండా, దాన్ని చికాకు పరచకుండా, నా ఉనికి దానికి తెలియకుండా జాగ్రత్త పడతా. ఒకవేళ పులి చూపు నా మీద పడితే కాలి కింద ఆకులు శబ్దం రాకుండా.. వెనక్కి వెళతాం. అలాంటప్పుడు వీపు చూపించ కూడదు. దాని కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ మెల్లిగా వెనక్కి నడవాలి. నాతో పాటు ఇద్దరు ట్రాకర్‌లు కూడా ఎప్పుడూ ఉంటారు. పులి మరీ దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తే గట్టిగా కర్రలతో చప్పుడు చేస్తూ, అరుస్తాం. ప్రస్తుతానికైతే ప్రశాంతంగా సాగుతున్నాం. అడవిలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నందుకు మా ప్రాంత ప్రజలు, బంధువులే నా మీద ఆనేక విమర్శలు చేశారు. వారికి ఓపిగ్గా అడవి విశిష్టత గురించి, పులితో పొంచి ఉన్న ముప్పు గురించి వివరిస్తా. అలా అయితేనే కదా అడవిని కాపాడుకోగలం’ అంటోంది సునీత. 

- చొక్కాల, రమేశ్‌, ఆసిఫాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి