అంకురమే... వృక్షంగా ఎదుగుతోంది

మహిళలకు ఆర్థిక స్వాలంబన ఉపయోగమెంతో తల్లిని చూసి తెలుసుకొందా అమ్మాయి. అలా తమ కాళ్లపై తాము నిలబడాలనుకున్న మరెంతో మంది అమ్మలకు నైపుణ్యాలను అందించాలనుకుంది.

Updated : 26 Dec 2022 14:17 IST

మహిళలకు ఆర్థిక స్వాలంబన ఉపయోగమెంతో తల్లిని చూసి తెలుసుకొందా అమ్మాయి. అలా తమ కాళ్లపై తాము నిలబడాలనుకున్న మరెంతో మంది అమ్మలకు నైపుణ్యాలను అందించాలనుకుంది. విద్యార్థి దశలోనే అంకురాన్ని ప్రారంభించి సాధారణ మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేలా చేస్తున్న మాన్యా స్ఫూర్తి కథనమిది.

ఇంట్లో ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం మాన్యా వాళ్ల అమ్మ కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలేశారు. పిల్లలను చూసుకుంటూనే తనకెంతో ఇష్టమైన మట్టి పాత్రల తయారీలో రాణించారు. తనకోసం ప్రత్యేకంగా స్టూడియోనూ ఏర్పాటు చేసుకొన్నారావిడ. కుటుంబానికీ ఆర్థికంగా అండగా ఉంటారు. ఆర్థిక స్వాతంత్య్రం మహిళలో ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపుతుందో తన తల్లిని చూసి పదేళ్ల వయసులోనే తెలుసుకుంది మాన్యా. బెంగళూరుకు చెందిన మాన్యా సింగ్‌ ఇండస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థి. తండ్రి ఉద్యోగి. వ్యాపారం, కుటుంబం, పిల్లల పెంపకం.. ఈ మూడింటినీ మహిళలెలా సమన్వయం చేయగలరో తల్లిని చూసి తెలుసుకొంది.

సమగ్ర అధ్యయనంతో...

చాలా మంది మహిళలు గృహహింసకు గురవుతూ కూడా బయటకు రాలేకపోవడానికి కారణం ఆర్థిక భద్రత, స్వాతంత్య్రం లేకపోవడమే అంటుంది తను. ‘నా స్నేహితుల తల్లులు, చుట్టుపక్కల కుటుంబాల్లోని మహిళల ఆర్థికస్థితిని గమనించినప్పుడు చాలా విషయాలు అర్థమయ్యేవి. అయితే ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితి మారుతోంది. మహిళలు చిరు వ్యాపారులుగా తమ సొంత ప్రయాణాన్ని ధైర్యంగా ప్రారంభిస్తున్నారు. ఇటువంటివారి కోసం ఏదైనా చేయాలనిపించింది. వారు చిరు వ్యాపారులుగా ఎదిగేలా, తమలాంటి మరి కొందరికి వారు ఉపాధి కల్పించేలా చేయూత ఇవ్వాలనుకున్నా. అందుకే వ్యాపారరంగంలో సవాళ్లను అధ్యయనం చేశా. దేశవ్యాప్తంగా అట్టడుగు స్థాయి నుంచి పేరు సంపాదించిన 40మందికిపైగా మహిళా వ్యాపారవేత్తలను కలిసి మాట్లాడా. వారి అనుభవాలు, సవాళ్లు, ఓటమి, విజయం వంటివన్నీ సమగ్రంగా తెలుసుకున్నా. వారివల్ల మరి కొందరు ఉపాధి పొందుతున్న వారితోనూ మాట్లాడా. ఇదే సామాజిక సాధికారత. అయితే వ్యాపారంలోకి అడుగుపెట్టే మహిళల్లో చాలా మందికి మొదట్లో సరైన మెంటార్‌షిప్‌, డిజిటల్‌, నెట్‌వర్కింగ్‌ సౌకర్యం దొరకడం లేదని తెలిసింది’ అంటుంది మాన్యా.

అంకురం..

మహిళలకు సాధికారత అందించడానికి 2020లో మాన్యా ‘ఇంక్యుబా- నారీ’ ప్రారంభించింది. ‘సోషల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ కోసం అశోకా ఫౌండేషన్‌తో కలిసి ఓ అంతర్జాతీయ సంస్థ ప్రకటించిన డాక్టర్‌ శివకుమారి ఎంవైపీ స్టూడెంట్‌ ఇన్నోవేటర్స్‌ గ్రాంట్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేశా. సామాజిక మార్పు తేవడానికి విద్యార్థులకు ఇదొక అవకాశం. దీనికి అంతర్జాతీయ స్థాయిలో 30 ప్రాజెక్టులు పోటీ పడితే నేను విజేతగా రూ.6.5 లక్షలు నగదు బహుమతి అందుకున్నా. ఆ సొమ్ము ఈ నా అంకురాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగ పడింది. మొదట స్మాల్‌ బిజినెస్‌ ప్రోగ్రాం పేరిట మహిళా వ్యాపారవేత్తలకు 3నెలల మెంటరింగ్‌ ప్రోగ్రాం నిర్వహించా. బెంగళూరులో రెండు రోజుల పాటు జరిపిన పరిచయ కార్యక్రమంలో ప్రదర్శించిన ఉత్పత్తులను, ఆలోచనలను ఆధారం చేసుకొని ఈ ప్రోగ్రామ్‌కు తొమ్మిది మందిని ఎంపిక చేశాం. వీరికి ప్రముఖ నిపుణులతో మెంటర్‌షిప్‌, శిక్షణ అందించాం. బ్రాండింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఆర్థికపాఠాలు, సోషల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌ వంటి వాటిపై అవగాహన కల్పించాం. తర్వాత వీరి ఉత్పత్తులను ప్రదర్శించడానికి బిజినెస్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేశాం. వీరిలో చాలామంది కరోనా విపత్కాలంలో తమకు తెలిసిన దాన్ని వ్యాపారంగా మలచుకొన్న వారే. అలా ఇప్పటికి దాదాపు 50 మంది శిక్షణ తీసుకుని ఆర్థిక స్వాలంబన పొందుతున్నారు. త్వరలో ఈ సంఖ్య రెట్టింపు అవడానికి ‘ఇంక్యుబా-నారీ’ కృషి చేస్తోంది’ అంటోంది మాన్యా. అంతే కాదు... తాను అధ్యయనం చేసిన వారి కథలు, అనుభవాలను ఈ సంస్థ ఇన్‌స్టాలో పొందుపరిచింది తను. ఇవన్నీ మరికొందరు మహిళల్లో స్ఫూర్తిని నింపుతాయంటుందీ అమ్మాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్