అమ్మలాంటి రైతుల కోసం...
ప్రకృతి వైపరీత్యాలు ప్రకోపించినా, మార్కెట్ ఒడుదొడుకులు మేఘాలై కమ్మేసినా... నష్టపోయేది... ఆరుగాలం శ్రమించిన అన్నదాతే. ఈ ఇబ్బందులను దాటాలంటే వాటిని నిల్వ చేసే గిడ్డంగులు ఉండాలి.
ప్రకృతి వైపరీత్యాలు ప్రకోపించినా, మార్కెట్ ఒడుదొడుకులు మేఘాలై కమ్మేసినా... నష్టపోయేది... ఆరుగాలం శ్రమించిన అన్నదాతే. ఈ ఇబ్బందులను దాటాలంటే వాటిని నిల్వ చేసే గిడ్డంగులు ఉండాలి. ఓ కూతురు కూడా అదే ఆలోచించింది. తన తల్లి ఏడాదంతా కష్టపడి పండించిన పంట... నిల్వచేసే సౌకర్యం లేక వ్యర్థమవడం ఆ అమ్మాయిని బాధించింది. పరిష్కారంగా వ్యవసాయ ఉత్పత్తులను భద్రపరుచుకోవడానికి కోల్డ్‌రూమ్‌లను నిర్మించి అందరి ప్రశంసలూ అందుకుంటోంది. ప్రకృతి నుంచి నేర్చుకున్న పాఠాన్నే ప్రయోగంగా సాధించి చూపించిన 19 ఏళ్ల మహిక్ పర్వేజ్ స్ఫూర్తి కథనమిది.
రాత్రీపగలూ చెమటోడ్చి పండించిన పండ్లు, కూరగాయలు వ్యర్థాలుగా ఎందుకు మారుతున్నాయో మహిక్‌కు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. చెన్నై నగర శివార్లలో వీరి కుటుంబానికి రెండెకరాల పొలం ఉంది. అందులోనే మహిక్ తల్లి కూరగాయలు, పండ్లు పండించేవారు. అవి మార్కెట్‌కు పంపించే లోపు తాజాదనం తగ్గడం, విక్రయించే లోపు కొన్నిరకాల ఆకుకూరలు, పండ్లు పాడవటం చూసి బాధపడేవారు. క్వింటాళ్లకొద్దీ పంట వ్యర్థాలుగా మారడానికి కారణం వాటిని సరైన రీతిలో భద్రపరచకపోవడమే అని గ్రహించి.. మహిక్ ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకుంది. తన తల్లిలాగే నష్టపోతోన్న రైతులకు సాయపడాలనుకుంది.
బాల్యంలో చూసి...
‘స్ట్రాబెర్రీ, చెర్రీ వంటి పండ్లకు మార్కెట్‌లో ధర ఎక్కువ పలుకుతుంది. వీటిని పండించడం కూడా కష్టమే. మార్కెట్‌కు వెళ్లేలోపు వీటిని భద్రపరిచే సౌకర్యం తప్పనిసరి. లేదంటే మొత్తం శ్రమ వృథా అవుతుంది. ప్రభుత్వ స్టోరేజ్‌లు ఉన్నా అవి అందరికీ అందుబాటులో ఉండకపోవడంతో చాలా ఉత్పత్తులు రైతుల దగ్గరే కుళ్లిపోతాయి. చిన్నప్పటి నుంచి ఈ పరిస్థితిని చూస్తూ పెరిగా. కాలేజీకొచ్చేసరికి నా ఆలోచనకొక రూపాన్నివ్వగలిగా. అదే ‘సన్ హార్వెస్టెడ్ కూల్ రూమ్స్’. పర్యావరణానికి అనుకూలంగా, కూరగాయలు, పండ్లను తాజాగా ఉంచుతాయివి. చెన్నై వాతావరణానికి తగినట్లు కోల్డ్‌రూమ్స్‌ను డిజైన్ చేయాలనుకున్నా. ఉత్పత్తులు పాడవకుండా ఉండాలంటే తేమ పెరగకుండా స్థిరంగా ఉండాలి. లేదంటే కూరగాయలు బయటకు తీసిన తర్వాత కుళ్లిపోతాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దీన్ని డిజైన్‌చేశా. ఇందులో భద్రపరిస్తే సంప్రదాయ పద్ధతిలో ఉంచే డ్రమ్ స్టోరేజ్‌కన్నా మూడు రెట్లు సురక్షితంగా ఉంటాయి’ అంటోంది మహిక్.
మూడింటిని కలిపి...
ఉష్ణప్రసరణ ప్రవాహాల గురించి చదివినప్పుడు మహిక్‌కు ఈ సిద్ధాంతం ఆధారంగా స్టోరేజ్ డిజైన్ చేయొచ్చనే ఆలోచన వచ్చింది. మరింత అధ్యయనం తర్వాత బ్రిక్ రూం, చిమ్నీ, డ్రాఫ్ట్ ట్యూబ్ కలయికతో సిద్ధం చేసిన ఈ స్టోరేజ్ మొదట వేడిని ఆవిరిగా మార్చుతుంది. ఆ తర్వాత చల్లబడి తేమను స్థిరంగా ఉంచుతుంది. దీంతో ఉత్పత్తులు చెమ్మగా కాకుండా తాజాగా ఉంటాయి. ‘డ్రాఫ్ట్ ట్యూబ్ తయారీకి ఏడాదికిపైగా సమయం పట్టింది. ఇందులోని అల్యూమినియం షీట్లు సూర్యుడి నుంచి వేడిని గ్రహించడంతో ప్రక్రియ మొదలవుతుంది. ప్రయోగాత్మకంగా చేసిన దీని వాడకంపై అందరికీ అవగాహన కలిగించి వినియోగించేలా చేయడం సవాలే. మెంటర్ సలహాలు, సూచనలతో పైలట్ ప్రాజెక్ట్ పూర్తి చేశా. త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నా’ అంటోంది మహిక్. ఎకో-ఇన్నోవేషన్ పేరిట దేశవ్యాప్తంగా పోటీపడ్డ వెయ్యి ప్రాజెక్టుల్లో ఈ కోల్డ్‌రూమ్‌ను ‘ద లెక్సస్ డిజైన్ అవార్డు ఇండియా 2023’ వరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.