ప్రధానికి సలహాలిస్తున్నారు!

ఆడవాళ్లకేం తెలుసు...ఆర్థిక విషయాలు అనేస్తారందరూ! కానీ, ఆసక్తి ఉంటే చాలు... అమ్మాయిలు దేశ ఆర్థిక వ్యవస్థను కూడా చక్కబెట్టేయగలరనడానికి చక్కటి ఉదాహరణ శమికా రవి.

Published : 31 Oct 2023 01:38 IST

ఆడవాళ్లకేం తెలుసు...ఆర్థిక విషయాలు అనేస్తారందరూ! కానీ, ఆసక్తి ఉంటే చాలు... అమ్మాయిలు దేశ ఆర్థిక వ్యవస్థను కూడా చక్కబెట్టేయగలరనడానికి చక్కటి ఉదాహరణ శమికా రవి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో పూర్తికాల సభ్యురాలిగా స్థానం సంపాదించుకున్న ఆమె... కీలక రంగాలను అభివృద్ధి పథంలో నడిపించేయడంలో తీరిక లేకుండా ఉన్నారు. మరి ఆవిడ ప్రయాణాన్ని మనమూ తెలుసుకుందామా!

డాక్టర్‌ శమికా రవి ప్రముఖ ఆర్థిక వేత్త. ఎంత పెద్ద విషయాన్నైనా కచ్చితత్వంతో విశ్లేషణ చేయగలరన్న పేరే ప్రధాని ఆర్థిక సలహా మండలిలో పూర్తికాల సభ్యురాలిగా ఎదిగే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. 2017 నుంచి రెండేళ్ల పాటు ఈ కౌన్సిల్‌లో తాత్కాలిక సభ్యురాలిగానూ సేవలందించారు. ఆరోగ్యం, పట్టణీకరణ, లింగ వ్యత్యాసం వంటి పలు విభాగాల్లో కీలక అధ్యయనాలెన్నో చేశారు. శమిక స్వస్థలం బిహార్‌లోని పట్నా. తండ్రి ఉద్యోగరీత్యా ఆమె ప్రాథమిక, మాధ్యమిక విద్య బిహార్‌తో పాటు కేరళలోనూ సాగింది. తర్వాత దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ప్లస్‌వన్‌లో చేరారు. అక్కడ ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడి స్ఫూర్తితో ఈ రంగంలోనే కెరియర్‌ని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగానే లేడీ శ్రీరామ్‌ కాలేజీలో చేరి బీఏ ఆనర్స్‌ (ఎకనామిక్స్‌) చేశారు. ఆపై దిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్‌లో పీజీ చేసి పీహెచ్‌డీ కోసం న్యూయార్క్‌ యూనివర్సిటీలో చేరారు. అక్కడ ప్రముఖ అమెరికన్‌ ఆర్థికవేత్తలతో కలిగిన పరిచయం... ఆమె ఆలోచనా దృక్పథాన్నే మార్చేసింది.

ఆరోగ్యం- విద్యే కీలకమని...

ఈలోగా దేశంలో ఆర్థిక సంస్కరణల ప్రభావంతో మార్పులెన్నో వచ్చాయి. వాటిని గమనించిన శమిక 2005లో భారత్‌కి తిరిగి వచ్చారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీలో ప్రొఫెసర్‌గా చేరారు. గేమ్‌ థియరీ అండ్‌ మైక్రో ఫైనాన్స్‌ కోర్సులను బోధించేవారిక్కడ. పదమూడేళ్ల పాటు ఈ ప్రయాణం సాగింది. ఆపై పరిశోధనా రంగంపై ఉన్న ఆసక్తితో బ్రూకింగ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఇండియా సెంటర్‌లో చేరారు. దానికి రిసెర్చ్‌ డైరెక్టర్‌గా, వాషింగ్టన్‌ డీసీలోని గవర్నెన్స్‌ స్టడీస్‌లో సీనియర్‌ ఫెలోగానూ విధులు నిర్వర్తించారు. ఈ సమయంలో ఆరోగ్యం, విద్య రంగాలపై దేశం తగినంత పెట్టుబడి పెట్టడం లేదనీ, ఇది నేరుగా వృద్ధిని ప్రభావితం చేస్తుందని చెబుతూ 2014లో ‘హెల్త్‌ అండ్‌ మోర్బిడిటీ ఇన్‌ ఇండియా’ అనే పేరుతో బ్రూకింగ్స్‌ నివేదికను రూపొందించారు. డాక్టర్‌ శమిక అబ్జర్వర్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌లో ఎకనామిక్‌ పాలసీ వైస్‌ ప్రెసిడెంట్‌గానూ ఉన్నారు. ‘అర్థశాస్త్ర బోధనా రంగంలో మహిళలు ఎక్కువగానే కనిపిస్తున్నప్పటికీ,  కీలక ఆర్థిక వేత్తలుగా, సలహాదారులుగా ఎదిగిన వారి సంఖ్య మాత్రం తక్కువే. అలాగని ఇది అసాధ్యమేమీ కాదు. కానీ, మగవారికంటే రెట్టింపు కష్టపడాల్సి వస్తుంది. ఇష్టమున్నప్పుడు ఆ మాత్రం కష్టపడలేమా’ అంటారు శమిక. ఆమె భర్త ముదిత్‌ కపూర్‌ ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌. వారికి ఇద్దరబ్బాయిలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్