కష్టాలే.. నా కథా వస్తువులు!

వరకట్న వేధింపులు, బాల కార్మికుల వెతలు, బాల్య వివాహాలు... ఇవే సూరోజు మంజుల తీసే లఘు చిత్రాలకు కథా వస్తువులు.

Updated : 16 Nov 2023 12:24 IST

వరకట్న వేధింపులు, బాల కార్మికుల వెతలు, బాల్య వివాహాలు... ఇవే సూరోజు మంజుల తీసే లఘు చిత్రాలకు కథా వస్తువులు. సామాజిక సమస్యల పరిష్కారానికి ఆమె ఎంచుకున్న ఆయుధం.. షార్ట్‌ ఫిల్మ్స్‌ నిర్మాణమే!  ప్రజా చైతన్యం తీసుకురావడానికి తీసిన ఇవన్నీ జాతీయ అవార్డులెన్నో తెచ్చిపెట్టాయి. మంజుల ఆ విశేషాలని మనతో పంచుకున్నారిలా.. 

సమాజంలో ఎన్నో సమస్యలు, మరెన్నో రుగ్మతలు.... వాటన్నింటినీ చూస్తూనే బతికేస్తాం. మనవంతుగా వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించకపోతే మన జీవితానికి విలువెక్కడిది? ఈ ఆలోచనలే నన్ను షార్ట్‌ ఫిల్మ్స్‌ నిర్మాణంపై దృష్టిపెట్టేలా చేశాయి. మాది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు. సామాన్య కుటుంబం. తాతయ్య తిరుపతయ్య విద్యావేత్త. ఆయన ‘చేసే పని ఏదైనా సరే! మనకి ఉపయోగపడటమే కాదు.. నలుగురికీ మంచి చేయాలని’ చెప్పేవారు. ఆ మాటలు నాపై ఎంతో ప్రభావం చూపించాయి. డిగ్రీ పూర్తి చేసిన నేను 1999లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒప్పంద ఉపాధ్యాయురాలిగా చేరా. ఓ పక్కన పాఠాలు చెబుతూనే మరో పక్క సాంఘిక దురాచారాలు, ఇతర సమస్యలకు వ్యతిరేకంగా నా వంతు పోరాటం చేయాలనుకున్నా. నా రచనా సామర్థ్యాన్ని ఉపయోగించి సామాజిక ప్రయోజనమున్న లఘు చిత్రాలు తీసి ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలనుకున్నా. వరకట్న సమస్య, బాలికా విద్య, లింగ వివక్ష వంటివే నా చిత్రాలకు కథా వస్తువులు. అలా నేను రాసిన తొలి నాటకం ‘జాలువారిన హృదయాలు’కి రాష్ట్రస్థాయిలో పురస్కారం అందుకోవడం నాలో ఉత్సాహం కలిగించింది. ఆపై ‘అంకురం’ పేరుతో ఆడపిల్ల సమాజంలో ఎలా ధైర్యంగా జీవించాలన్న ఇతివృత్తంతో మూడున్నర నిమిషాల లఘుచిత్రాన్ని నిర్మించా. ఆ తర్వాత బాలకార్మిక వ్యవస్థపై నిర్మించిన ‘గూడు చెదిరిన గువ్వలు’  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. ‘వేర్‌ ఈజ్‌ మై మదర్‌’ పేరుతో ఆడపిల్ల ప్రాధాన్యం చెబుతూ తీసిన లఘుచిత్రం జయపుర ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో 2,775 షార్ట్స్‌ఫిల్మ్స్‌తో పోటీ పడి ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆ ఉత్సాహంతోనే ‘శంకర్‌’, ‘నా బంగారు తెలంగాణ’, ‘స్వచ్ఛలోకం’ వంటివెన్నో తీశా. మరో మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ విజయాలిచ్చిన సంతృప్తి, ఆత్మవిశ్వాసంతో తెలంగాణ ఇంటర్నేషనల్‌ లఘుచిత్రోత్సవ (టీఐఎఫ్‌ఎఫ్‌) వేడుకల్నీ గత రెండేళ్లుగా సమర్థంగా నిర్వహించగలిగా. 

- ఎస్‌.ఎన్‌.చారి, మోత్కూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్