చరిత్ర సృష్టించారు!

మిస్‌ యూనివర్స్‌ పోటీలంటే యువతులు, కొలతలకే ప్రాధాన్యమనే తీరుకు ఈ ఏడాది చెల్లు చీటీ పడింది. 70 ఏళ్లకు పైగా ఆ పోటీల చరిత్రలో తొలిసారిగా వివాహితులు, ప్లస్‌ సైజ్‌ వాళ్లూ పాల్గొన్నారు. చరిత్ర సృష్టించారు.

Published : 23 Nov 2023 01:38 IST

మిస్‌ యూనివర్స్‌ పోటీలంటే యువతులు, కొలతలకే ప్రాధాన్యమనే తీరుకు ఈ ఏడాది చెల్లు చీటీ పడింది. 70 ఏళ్లకు పైగా ఆ పోటీల చరిత్రలో తొలిసారిగా వివాహితులు, ప్లస్‌ సైజ్‌ వాళ్లూ పాల్గొన్నారు. చరిత్ర సృష్టించారు.

అమ్మలొచ్చారు..

‘మిస్‌’లకు మాత్రమే నిర్వహించే ఈ పోటీల్లో ఈ ఏడాది ఇద్దరు అమ్మలు చోటు దక్కించుకొన్నారు. 28 ఏళ్ల మిషెల్లె కోన్‌ది గ్వాటెమాల. మోడల్‌, ఆంత్రప్రెన్యూర్‌. దివ్యాంగులకీ ఉద్యోగాల విషయంలో సమాన అవకాశాలుండాలని పోరాడుతోందీమె. ఓ స్విమ్‌వేర్‌ బ్రాండ్‌ని ప్రారంభించి వినికిడి శక్తి కోల్పోయిన మహిళలకు ఉపాధినిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి. మహిళా సాధికారతకు ప్రాధాన్యమిచ్చే మిషెల్లె ఈ వేదికపై నిలిచిన తొలి తల్లి.

కొలంబియాలో కాసనేర్‌ అనే చిన్న ప్రాంతం కమిలా అవేది. అక్కడ నుంచి ఒక్కరూ మిస్‌ కొలంబియా పోటీలకు వెళ్లలేదు. ఆ కిరీటం దక్కించుకోని, ప్రపంచ వేదికపై మెరిసి తన స్వస్థలానికి గుర్తింపు తేవాలనుకుందీమె. కానీ 2018లో ఓటమి ఎదురవడంతో కమిలాకి ఆ కల నెరవేరలేదు. తను లక్ష్యం చేరుకోలేకపోయినా ఆమె కూతురు కోరుకున్నది సాధించేలా ప్రోత్సహించాలనుకుంది. అయితే ఈ ఏడాది వివాహితలకీ, అమ్మలకీ అవకాశముందని తెలియడంతో మళ్లీ ప్రయత్నించి, అర్హత సాధించింది. మిస్‌ యూనివర్స్‌ పోటీలకు అర్హత సాధించిన తొలి వివాహితగా నిలిచింది కమిలా. టాప్‌ 5 వరకూ వెళ్లింది. కిరీటం దక్కించుకోలేకపోయినా చరిత్రలో తన పేరు లిఖించుకుంది.

బొద్దుగా ఉన్నా..

సన్నగా, నాజూగ్గా ఉన్నవారే అర్హులనే మాటకు చెక్‌ పెడుతూ మిస్‌ యూనివర్స్‌ వేదిక మీద మెరిసింది జేన్‌ దీపిక గారెట్‌. నాజూగ్గా తయారవ్వాలని ఎంతోమంది ఆరోగ్యాన్నీ పణంగా పెట్టడం గమనించిందీమె. పుట్టింది అమెరికా, స్వస్థలం నేపాల్‌. వృత్తిరీత్యా నర్స్‌. ఆంత్రప్రెన్యూర్‌.. ఇంకా విమెన్‌ హెల్త్‌ అడ్వకేట్‌ కూడా. హార్మోనుల్లో అసమతుల్యత, ప్రసవం.. ఇలా ఎన్నో కారణాల రీత్యా ఆడవాళ్లు బరువు పెరుగుతారు. వాళ్లలో అందం కోల్పోయానన్న భావనను తొలగించాలనే ప్లస్‌ సైజ్‌ మోడలైంది. ఈ అంతర్జాతీయ పోటీలో స్థానం సంపాదించిన తొలి ప్లస్‌ సైజ్‌ పోటీదారుగా నిలిచింది. ఈ 23ఏళ్లమ్మాయి ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగానూ మారింది.

ఇక.. ఎరికా రాబిన్‌ మిస్‌ యూనివర్స్‌ అందాల పోటీల్లో పాల్గొన్న తొలి పాకిస్థానీగా నిలిస్తే.. పోర్చుగల్‌, నెదర్లాండ్స్‌కు చెందిన ఇద్దరు ట్రాన్స్‌ జెండర్లూ తొలిసారిగా స్థానం సంపాదించి.. చరిత్ర పుటలకెక్కారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్