సాహసమే నా ఊపిరి...

వంద అడుగుల లోతున్న నుయ్యి అది... దాని లోపలి గోడలమీద జుయ్‌ జుయ్‌మంటూ కార్లు గుండ్రంగా గిరికీలు కొడుతున్నాయి. వాటి మధ్యలోనే ఓ బైక్‌ కూడా వేగంగా దూసుకుపోతోంది. పైనుంచి ఆ విన్యాసాలు చూసినవాళ్లకు మాత్రం ఒళ్లు జలదరిస్తోంది. అదుపు తప్పి ఆ బైక్‌ ఏ కారుకి ఢీకొంటుందో ... ఎక్కడ కిందపడుతుందో... అన్నట్లుగా ఊపిరి బిగపట్టి మరీ చూస్తున్నారు ప్రేక్షకులు.

Updated : 05 Feb 2024 07:07 IST

వంద అడుగుల లోతున్న నుయ్యి అది... దాని లోపలి గోడలమీద జుయ్‌ జుయ్‌మంటూ కార్లు గుండ్రంగా గిరికీలు కొడుతున్నాయి. వాటి మధ్యలోనే ఓ బైక్‌ కూడా వేగంగా దూసుకుపోతోంది. పైనుంచి ఆ విన్యాసాలు చూసినవాళ్లకు మాత్రం ఒళ్లు జలదరిస్తోంది. అదుపు తప్పి ఆ బైక్‌ ఏ కారుకి ఢీకొంటుందో ... ఎక్కడ కిందపడుతుందో... అన్నట్లుగా ఊపిరి బిగపట్టి మరీ చూస్తున్నారు ప్రేక్షకులు. కానీ దాన్ని నడుపుతున్న ముప్ఫై ఏళ్ల సోమా బసు మాత్రం హ్యాండిల్‌ వదిలి మరీ గాల్లోకి చేతులూపుతోంది... ‘వెల్‌ ఆఫ్‌ డెత్‌’ షో చేస్తోన్న ఆ ఫైర్‌బ్రాండ్‌ను వసుంధర పలకరించగా...

మాది కోల్‌కతా. నాన్న చిరువ్యాపారి. అమ్మ గృహిణి. నాకు నాలుగు నెలలు ఉన్నప్పుడే నాన్న చనిపోతే, అమ్మ ఆర్థికంగా నిలబడటానికి ఎంతో కష్టపడింది. చిన్నచిన్న వ్యాపారాలు చేసేది. హైస్కూల్‌ చదువుతున్నప్పుడే బైకు నేర్చుకున్నా. మాఊరిలో ఓసారి ‘వెల్‌ ఆఫ్‌ డెత్‌’ షో జరిగితే మొదటిసారి చూశా. ఇదంతా వాళ్లెలా చేయగలుగుతున్నారని ఆశ్చర్యపోయా. వాళ్ల సాహసాలను చూస్తున్నకొద్దీ నేర్చుకోవాలనిపించింది. ఆ బృందంలో అంతా మగవారే. నాకూ నేర్పమని అడిగితే అమ్మాయిలకిది కష్టం అన్నారు. 

పారిపోతానన్నా... 

కొన్నిరోజులకి ఆ షో చేసేవాళ్లు మా ఊరినుంచి వెళ్లిపోయారు. రోజులు గడుస్తున్నా... నాకు మాత్రం ఆ షోనే కళ్లముందు కదిలేది. బైకు సాహసం గురించి అమ్మతో చెప్పా. నేర్చుకుంటానని చెబితే ‘బుద్ధిగా చదువుకో’ అని కోప్పడింది. అప్పటికి నాకు 15 ఏళ్లు. నాన్న పోయాక అమ్మకి ఉన్న ఒకే ఒక బంధం నేను. దాంతో అలాంటి సాహసాలతో నాకేమవుతుందోనన్నదే అమ్మ భయం. కానీ బైకు విన్యాసం నాకు బాగా నచ్చింది. అమ్మను ఎలాగైనా ఒప్పించాలని, ఇంటి నుంచి పారిపోతానని బెదిరించా. నా పట్టుదల చూసి చివరకు సరేనంది. దిల్లీలో ట్రైనింగ్‌ గురించి నేను సేకరించిన వివరాలన్నీ చెప్పడంతో తనే నన్ను తీసుకెళ్లి చేర్చింది. ఆరునెలల శిక్షణలో ఛాలెంజ్‌లెన్నో. బైకు నడపడం ఒకెత్తు అయితే, డెత్‌వెల్‌లో విన్యాసాలు చేయడమొక్కటీ మరొకెత్తు. ఏకాగ్రతగా డ్రైవ్‌ చేయడమే కాదు, మనతోపాటు వేగంగా వెళ్లే వాహనాలను బ్యాలెన్స్‌ చేయాలి. రోజుకి ఏడెనిమిది గంటల సాధన ఉండేది.

సర్జరీలెన్నో...

ట్రైనింగ్‌ పూర్తయింది. షో చేసే ఛాయిస్‌ మాత్రం రాలేదు. అవకాశమిస్తే నన్ను నేను నిరూపించుకుంటానని అడిగినా... ‘ఆడపిల్లవి, నువ్వెలా చేస్తావ’నేవారు. ఓసారి షోలో తెలిసిన వాళ్లుంటే చూడ్డానికని వెళ్లా. గ్యాప్‌లో ఎవరితో చెప్పకుండా వెల్‌ ఆఫ్‌ డెత్‌లో ఒంటరిగా బైకు నడిపేశా. అది చూసి ముందు ఆశ్చర్యపోయారు. తర్వాత నమ్మకంతో అవకాశమిచ్చారు. అలా 15 ఏళ్ల నుంచీ దేశవ్యాప్తంగా వేలకొద్దీ షోలు చేశా. శిక్షణలో పెద్దగా గాయపడకపోయినా, షోలు చేసేటప్పుడు మాత్రం ప్రమాదాలెన్నో. ఒకసారి పట్టు తప్పి కింద పడిపోయా. కింది దవడ ఎముక విరిగిపోయింది. ముందువరస పన్ను ఊడిపోయింది. మరోసారి కాలి ఎముక విరిగి ప్లేట్‌ వేయాల్సి వచ్చింది. ఇంకోసారి చేతి ఎల్‌బో విరిగింది. చెయ్యి పనిచేయదేమోనని చాలా భయపడ్డా. చికిత్స చేసి రాడ్‌ వేశారు. అలాంటి సమయంలో భరించలేని బాధను అనుభవించేదాన్ని. శరీరంలో విరగని ఎముక లేదేమో... ఎన్నో సర్జరీలు. అయినా ప్రమాదాలకు భయపడను. కొన్నిసార్లు వైద్యులు మూడు నెలల విశ్రాంతి సూచించినా రెండు వారాల్లోనే తిరిగొచ్చి షో చేశా.  చేతి ఎముక విరిగితే వారంలోనే విన్యాసాలకు సిద్ధపడ్డా. దవడ ఎముక విరిగినప్పుడు వారం రోజుల్లోనే మాస్క్‌తో షోలో పాల్గొన్నా. పాదానికి గాయమైతే షూలు ధరించి డ్యూటీ కొచ్చేశా. రోజులో ఆరేడుగంటలపాటు మధ్యమధ్యలో 10 నిమిషాల గ్యాప్‌ తీసుకొంటూ షో చేస్తుంటా. కోల్‌కతా షోలో మొదటిసారి అమ్మని ప్రేక్షకుల్లో కూర్చోబెడితే మధ్యలోనే బయటకెళ్లిపోయింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు తను నా షో చూడ్డానికి రాలేదు... నాకు ప్రమాదం జరిగితే చూసి తట్టుకోలేకనే.

బైకర్‌గా...

దేశమంతా బుల్లెట్‌పై ఒంటరిగా, బైకర్స్‌ బృందంతో కలిసి పర్యటిస్తుంటా. నేపాల్‌, భూటాన్‌, ఝార్ఖండ్‌, మేఘాలయ... వంటి చోట్ల అడ్వంచర్‌ రైడ్స్‌లో పాల్గొన్నా. పలు బైకు రేస్‌ల్లో పాల్గొని విజేతగానూ నిలిచా. ప్రాణంతో చెలగాటమెందుకని కొందరంటే, షో తర్వాత మరికొందరు ముఖ్యంగా అమ్మాయిలు నాతో సెల్ఫీ తీసుకొని డేర్‌ డెవిల్‌ అంటూ అభినందిస్తుంటారు. అప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో అనాధ పిల్లలను చేరదీసి చదివించడం, వృద్ధాశ్రమం ఏర్పాటు నా కల. రేసర్‌గా నిలవాలి... ఓవైపు షోలు చేస్తూనే జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తూ ఫిట్‌నెస్‌పై అవగాహన కలిగిస్తున్నా. బైకుపై ఫీట్స్‌ చేయడంకన్నా ప్రపంచంలో మరేదీ నాకెక్కువ అనిపించదు. ఆ సాహసమే ఊపిరిగా బతికేస్తున్నా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్