త్రిష, రష్మికలకు మా డిజైన్లు..!

ఊహ తెలియని వయసులోనే రంగుల దుస్తులతో ప్రేమలో పడిందామె. తను రూపొందించిన దుస్తులు అందరూ వేసుకుంటే చూసి మురిసిపోవాలి అనుకుంది. తీరా ఆ కల నెరవేరే సమయానికి కంటి చూపే ఆమెకు సమస్యగా మారింది.

Updated : 08 Feb 2024 07:02 IST

ఊహ తెలియని వయసులోనే రంగుల దుస్తులతో ప్రేమలో పడిందామె. తను రూపొందించిన దుస్తులు అందరూ వేసుకుంటే చూసి మురిసిపోవాలి అనుకుంది. తీరా ఆ కల నెరవేరే సమయానికి కంటి చూపే ఆమెకు సమస్యగా మారింది. 19 ఏళ్లమ్మాయికి కలలు కూలిపోవడం ఎంత బాధాకరం? కానీ గీతికా కానుమిల్లి ఆగిపోలేదు. డిజైనర్‌గా విదేశాల్లోనూ గుర్తింపు తెచ్చుకుంది. అదెలాగో మనతో పంచుకుందిలా...

‘పెద్దయ్యాక నువ్వేమవుతా’వని అడిగితే టీచర్‌, ఎయిర్‌హోస్టెస్‌... ఇలా రకరకాలుగా చెప్పేదాన్ని. మాది పశ్చిమగోదావరి. కానీ పెరిగిందంతా చెన్నై. నాన్న ప్రసాద్‌ కన్‌స్ట్రక్షన్‌ వ్యాపారి. అమ్మ నీరజ. చిన్నప్పుడు భిన్న దుస్తులన్నీ నాకు వేసి మురిసిపోయేది. దీనికితోడు బాబాయి సాఫ్ట్‌వేర్‌. కాపీ, పేస్ట్‌ వంటి చిన్న పనులు నాకే చెప్పేవారు. పూర్తయ్యాక సిస్టమ్‌లో బార్బీ బొమ్మలకు డ్రెస్సులు, యాక్సెసరీలు డిజైన్‌ చేసేదాన్ని. నా ఆసక్తి చూసి బాబాయి డిజైనింగ్‌ కోర్సు చేయమని  చెప్పారు. అలా డిజైనింగ్‌ అంటే ఏంటో తెలియని వయసులోనే దాని ప్రేమలో పడిపోయా. అప్పట్నుంచీ హైదరాబాద్‌లోని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ సంస్థ ‘నిఫ్ట్‌’లో చేరడం నా లక్ష్యమైంది. తీరా ప్రవేశపరీక్ష రాద్దామనుకుంటే ఒక కన్ను పూర్తిగా మసకబారింది. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా సమస్య తీరలేదు. చివరికి ‘ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌’ అని తేలింది. మనకు దెబ్బతగిలితే రక్తం గడ్డకడుతుంది కదా! నాకు అవేమీ లేకుండానే రక్తం చిక్కగా ఉండి, కంటి నాళాల్లో గడ్డ కట్టింది. దాంతో ఒకటి పూర్తిగా కనిపించదు. రెండో కంటికీ రాకూడదంటే జీవితాంతం మందులు వాడాలి.

ఎన్ని అవస్థలు పడ్డానో...

నా సమస్య అర్థమైనా డిజైనింగ్‌పై పాషన్‌ మాత్రం పోలేదు. మరుసటి ఏడాది నిఫ్ట్‌ ప్రవేశపరీక్షకు సిద్ధమై, సీటూ సాధించా. తొలి ఏడాది టాపర్‌ని. రెండో ఏడాది ప్రాక్టికల్స్‌ ఉంటాయి. ఒక కన్నుతో కుట్లు, కటింగ్‌ వగైరా ఇబ్బందైంది. పదే పదే తోటివాళ్ల సాయం కోరడం, వాళ్లని ఇబ్బంది పెట్టడం నచ్చక కాలేజీ మానేశా. అప్పటికే మా కుటుంబం హైదరాబాద్‌ వచ్చేసింది. దీంతో క్లాత్స్‌ రకాలు, కుట్లు, పనివాళ్ల కోసమంటూ ఏడాదిపాటు ఊరంతా తిరిగా. హిందీ రాక ఎన్ని అవస్థలు పడ్డానో! చివరకు 2015లో ఒక మాస్టర్‌తో కలిసి డిజైనింగ్‌ మొదలుపెట్టా. తెలిసిన వాళ్లతోపాటు ఫేస్‌బుక్‌ నుంచీ ఆర్డర్లు తీసుకునేదాన్ని. మొదట్లో ఒక్కో డిజైన్‌లో ఒక డ్రెస్‌నే చేసేదాన్ని. తర్వాత అలా వ్యాపారం చేయలేనని అర్థమయ్యాక ప్రయోగాలు మొదలుపెట్టా. వర్కర్లకు జీతాలు, షాపు అద్దె వస్తే చాలనుకునేదాన్ని. అలా నేర్చుకుంటూ మూడేళ్లలో స్టోర్‌ ప్రారంభించా. స్టైలిస్ట్‌ల పీఆర్‌లకు నా డిజైన్లు పంపేదాన్ని. ఇన్‌స్టాలోనూ పెట్టేదాన్ని. అలా కియారా ఆడ్వాణీ, త్రిష, రష్మిక మందన్న, సమంత, పూజాహెగ్డే... వంటి తారలతోనూ ఫ్యాషన్‌ మేగజీన్లతోనూ పనిచేసే అవకాశమొచ్చింది. దేశవ్యాప్తంగానే కాదు, యూకే, అమెరికాల్లోని మల్టీ డిజైనర్‌ స్టోర్లలో నా డిజైన్లున్నాయి. విదేశాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి. దుస్తుల డిజైనింగ్‌లో ఏర్పడే వృథాతో కాలుష్యం పెరుగుతోందని ‘జీరో వేస్ట్‌’ విధానాలకి ప్రాధాన్యమిస్తా.

ఆ రెండే ఆలోచించా

దాదాపు పదేళ్లలో ఎదుర్కొన్న సవాళ్లెన్నో. వాటిని పాఠాలుగా చేసుకుంటూ డిజైనింగ్‌ ప్రపంచంలో నాకంటూ పేరు సంపాదించుకున్నా. స్టోర్‌ పెట్టిన కొత్తలో మా కాలేజీ అమ్మాయే నా దగ్గర ప్రాజెక్టు కోసం వస్తే మా ప్రొఫెసర్లు ‘తనే చదువు పూర్తిచేయలేదు, ఆమెతో కలిసి నువ్వేం చేస్తా’వన్నారు. అయినా ఆమె కొనసాగించి, పేరు తెచ్చుకుంది. వీళ్లే కాదు, నేను చదువు మానేసినప్పుడు చాలామంది అవమానించారు. నిజానికి వాళ్లెవరికీ అందుకు కారణం తెలియదు. నేనెవరికీ చెప్పలేదు మరి. టెడెక్స్‌ వేదికపై మాట్లాడే అవకాశం వచ్చినపుడు ఈ అరుదైన సమస్యపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో తొలిసారి నోరువిప్పా. అది విని ఎంతోమంది నేను వాళ్లకి స్ఫూర్తి అంటోంటే గర్వంగా అనిపించింది. ఒకప్పుడు మానేసిన కాలేజీకే జడ్జిగా వెళ్లా, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగాలు ఇస్తున్నా. నా మీద నాకున్న నమ్మకం వల్లే ఇదంతా! నా సమస్య గురించి విన్నప్పుడు నేనూ బాధపడ్డా. కానీ ఆగిపోవడమా, ఎదుర్కోవడమా అని ఆలోచించి, రెండోది ఎంచుకున్నా. కాబట్టే 29 ఏళ్ల వయసులో ఇక్కడిలా ఉన్నా. మీరేమవ్వాలన్నదీ మీ చేతిలోనే ఉంది. నా బ్రాండ్‌లో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి, పర్యావరణహిత వస్త్రాలు అందివ్వాలన్నది ఇప్పుడు నా ముందున్న లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్