అదే... నాలో కసి పెంచింది

యూపీఎస్సీ... ఎంతో మంది కల. అందుకోసం అహర్నిశలూ శ్రమించేవారు అనేకం. అలా కష్టపడి సివిల్‌ సర్వీసెస్‌ సాధించిన వారిలో ఐఏఎస్‌ అధికారిణి సోనాల్‌ గోయల్‌ ఒకరు. అయితే తాజాగా ఆమె ఎక్స్‌లో చేసిన ఓ ట్వీట్‌ వైరలైంది.

Updated : 25 Feb 2024 03:38 IST

యూపీఎస్సీ... ఎంతో మంది కల. అందుకోసం అహర్నిశలూ శ్రమించేవారు అనేకం. అలా కష్టపడి సివిల్‌ సర్వీసెస్‌ సాధించిన వారిలో ఐఏఎస్‌ అధికారిణి సోనాల్‌ గోయల్‌ ఒకరు. అయితే తాజాగా ఆమె ఎక్స్‌లో చేసిన ఓ ట్వీట్‌ వైరలైంది. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సమయం దగ్గర పడుతోన్న తరుణంలో తన మొదటి అటెంప్ట్‌లో మెయిన్స్‌లో వచ్చిన మార్క్‌షీట్‌ను ఎక్స్‌లో పోస్టు చేశారీమె. ‘‘2007లో జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లో నాకు తక్కువ మార్కులు రావడంతో ఇంటర్వ్యూకు అర్హత సాధించలేకపోయా. కానీ కుంగిపోలేదు. కఠిన దీక్ష, నిరంతర అభ్యాసంతో జనరల్‌ స్టడీస్‌పై పట్టు సాధించాలనుకున్నా. అందుకోసం నోట్స్‌ తయారు చేసుకున్నా. మెయిన్స్‌లో జవాబులు రాసే విధానాన్ని మరింత ప్రాక్టీస్‌ చేశా. దానివల్లే 2008 యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, కలెక్టర్‌ కావాలన్న నా కలను నిజం చేసుకోగలిగా. నా ఆప్షనల్‌ సబ్జెక్టులు కామర్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లతో పోలిస్తే జనరల్‌ స్టడీస్‌లోనే అత్యధిక మార్కులు సాధించగలిగా. ఇదంతా నేను ఓవైపు దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి లా, మరోవైపు ఒక కంపెనీలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తూ, సివిల్స్‌కీ సన్నద్ధమై సాధించిందే! అందుకోసం ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకున్నా. నాకు తగిలిన ఎదురుదెబ్బే లక్ష్యాన్ని సాధించేందుకు కావలసిన కసినీ, బలాన్నీ, దృఢత్వాన్నీ పెంచింది. అంకితభావం, నిరంతర కృషితో సాధించలేనిది ఏమీ లేదు. ప్రతి ఓటమి నుంచీ పాఠాలు నేర్చుకుని, విజయానికి బాటలు పరచుకోవాలి. కాబట్టి మీ సామర్థ్యాలను మీరు నమ్మండి. మీ కలలను మర్చిపోవద్దు’’ అంటూ అభ్యర్థుల్లో స్ఫూర్తి నింపుతున్నారు సోనాల్‌. 2008లో సివిల్స్‌లో 13వ ర్యాంకు సాధించి, త్రిపుర కేడర్‌లో చేరిన సోనాల్‌ అనేక పదవుల్లో రాణించారు. 2016లో హరియాణ కేడర్‌లో చేరి, ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గానూ పనిచేశారు. నీతి ఆయోగ్‌ విడుదలచేసిన ‘టాప్‌ 25 విమెన్‌ ట్రాన్స్‌ఫామింగ్‌ ఇండియా’ జాబితాలో చోటుదక్కించుకున్న ఈమె, టెడెక్స్‌ స్పీకర్‌ కూడా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్