పోరాడి... సాధించింది!

బాగా చదువుకోవాలి, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నది ఆమె లక్ష్యం. కానీ చదువు మానేయాల్సి రావడమే కాదు... చిన్నవయసులోనే పెళ్లి పీటలెక్కాల్సిన పరిస్థితి వచ్చిందామెకు. కలలు కూలిపోతోంటే తట్టుకోలేక ధైర్యం చేసి ముందడుగేసింది.

Published : 14 Apr 2024 02:04 IST

బాగా చదువుకోవాలి, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నది ఆమె లక్ష్యం. కానీ చదువు మానేయాల్సి రావడమే కాదు... చిన్నవయసులోనే పెళ్లి పీటలెక్కాల్సిన పరిస్థితి వచ్చిందామెకు. కలలు కూలిపోతోంటే తట్టుకోలేక ధైర్యం చేసి ముందడుగేసింది. తన తలరాతను తానే రాసుకుంటోంది... జి. నిర్మల!

పదో తరగతిలో 537 మార్కులు. ఉన్నత చదువులు చదవాలన్న కలతో ఆనందంగా ఇంటికి చేరిందామె. కానీ ఆ వార్త విన్న సంబరం అక్కడ కనిపించలేదామెకు. పైగా ఆ కలను తీర్చే స్థోమత తమకు లేదన్నారు అమ్మానాన్నలు. దీంతో నిరాశ ఆవరించిందామెకు. ‘మాది కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పెద్ద హరివాణం గ్రామం. మా దగ్గర ఆడపిల్లలకు పదోతరగతి పూర్తికాగానే బాల్యవివాహాలు చేస్తుంటారు. దీంతో ఉన్నత చదువులు చదువుకోవాలన్న ఆడపిల్లల ఆశలు అడియాసలయ్యేవి. అమ్మానాన్నలు శీనప్ప, హనుమంతమ్మలకు నలుగురం ఆడపిల్లలం. నేనే చిన్న. ఇద్దరు అక్కలు చదువుకోలేదు. ఇంకో అక్క పది చదివింది. ముగ్గురికీ చిన్నప్పుడే పెళ్లిళ్లయ్యాయి. వీళ్లందరిలా నేను కాకూడదు. ఐపీఎస్‌ ఆఫీసరై ఈ పరిస్థితిని మార్చాలి అనుకునేదాన్ని. పదిలో మంచి మార్కులొచ్చాయి కాబట్టి, మంచి కాలేజీలో సీటొస్తుందని కలలు కన్నా. కానీ అమ్మావాళ్లు చదువు మానేయమన్నారు’ అని చెప్పుకొచ్చింది నిర్మల.

మూడెకరాల పొలమున్నా పంటలు సరిగా పండవు. పైగా ఊరికి దగ్గర్లో కళాశాల లేకపోవడంతో వాటిని కారణాలుగా చూపించారామెకు. పెళ్లి చేసుకోమన్నారు. ‘ఏడాదిపాటు ఇంట్లోనే ఉండిపోయా. నేను వ్యతిరేకించే బాల్యవివాహానికి ఎక్కడ బలవుతానోనని చాలా భయపడ్డా. ఆ సమయంలో మా ప్రాంతంలో ఓ అధికారిక కార్యక్రమం జరిగింది. అక్కడికి వెళ్లి స్థానిక నాయకులకు నా అసహాయతను చెప్పి, బాగా చదువుకోవాలని ఉందన్న కోరికను చెప్పా. కన్నీళ్లతో వినతి పత్రం అందిస్తున్న నన్ను చూసి, అక్కడి అధికారిణులు కరిగిపోయారు. ఖర్చుల కోసం రూ.10వేలు ఆర్థిక సాయం చేశారు. తరవాత జిల్లా కలెక్టర్‌ సృజన నన్ను, అమ్మని కలెక్టర్‌ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. బాలికావిద్య, చిన్న వయసులో పెళ్లిళ్ల వల్ల జరిగే అనర్థాలు వంటివన్నీ అర్థమయ్యేలా చెప్పారు. తరవాత కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లో చేర్పించారు. అలా నాలో ఉన్నత చదువులు చదవాలన్న ఆ ఆశలు మళ్లీ చిగురించాయి’ అనే నిర్మల వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడింది. తొలిఏడాది ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో బైపీసీలో 440కిగానూ 421 మార్కులు సాధించి అందరితో శభాష్‌ అనిపించుకుంది. ఐపీఎస్‌ అవ్వాలి, బాల్య వివాహాలపై పోరాడాలన్న సంకల్పంతో సాగుతోంది.

 హెచ్‌.పురుషోత్తం, ఆదోని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్