30 ఏళ్ల తరవాత... కేన్స్‌లో ఆమె!

సెంటిమెంట్‌, ఎమోషన్‌ లేకపోతే... జీవితం చప్పగా ఉంటుంది. కష్టాలు, సవాళ్లు లేకుండా విజయం వరిస్తే... కిక్కేముంటుంది. లక్ష్యం లేకుండా ఉన్న జీవితం కూడా అంతే! అయితే ఇలాంటివన్నీ సినిమాలకే బాగుంటాయి అనుకోవద్దు. నిజజీవితంలోనూ కనిపిస్తుంటాయి.

Published : 14 Apr 2024 02:16 IST

సెంటిమెంట్‌, ఎమోషన్‌ లేకపోతే... జీవితం చప్పగా ఉంటుంది. కష్టాలు, సవాళ్లు లేకుండా విజయం వరిస్తే... కిక్కేముంటుంది. లక్ష్యం లేకుండా ఉన్న జీవితం కూడా అంతే! అయితే ఇలాంటివన్నీ సినిమాలకే బాగుంటాయి అనుకోవద్దు. నిజజీవితంలోనూ కనిపిస్తుంటాయి. ఇందుకు నిలువెత్తు నిదర్శనం... పాయల్‌ కపాడియా. స్కూల్లో క్రమశిక్షణకు మారుపేరైన ఆ అమ్మాయి... కాలేజీలో ఎందుకు సస్పెండ్‌ అయ్యింది... తాజాగా వార్తల్లోకి ఎలా వచ్చింది... తెలుసుకోవాలంటే..!

పాయల్‌ కపాడియా... భారతీయ సినిమా గొప్పతనాన్ని కేన్స్‌ కార్పెట్‌పై నడిపించబోతోన్న యువతి. మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తరవాత పాయల్‌ దర్శకత్వం వహించిన ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ అనే భారతీయ చిత్రం కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రతిష్ఠాత్మక ‘పామ్‌ డి ఓర్‌’ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. మనసుకి నచ్చింది చేయాలన్న పట్టుదల, అనుకున్నది ఎంత కష్టమైనా సాధించగలననే స్థైర్యం పాయల్‌ ప్రత్యేకాభరణాలు. అవే ఆమెను... కేన్స్‌ వరకూ నడిపించాయి. అయితే, ఈ ప్రయాణమేమీ అంత సులువుగా జరగలేదు. ఎన్నో మలుపులూ, మరెన్నో కథలూ ఆమె జీవితంలో ఉన్నాయి. ముంబయిలో పుట్టి పెరిగిన పాయల్‌ కపాడియా ప్లస్‌టూ వరకూ ఆంధ్రప్రదేశ్‌లోని రిషి వ్యాలీ స్కూల్లో చదివింది. చిన్నప్పటి నుంచీ సినిమాలపై ఉన్న ఆసక్తితో పాఠశాలలోని ఫిల్మ్‌ క్లబ్‌లో సభ్యురాలైంది. అక్కడే రిత్విక్‌ ఘటక్‌, ఆండ్రీ తార్కావ్‌స్కీ వంటి వారి రచనలు చదివి చిత్ర నిర్మాణంపై మనసు పారేసుకుంది. తనకు నచ్చిన దర్శకులెందరో చదువుకున్న పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ)లో చేరి ఈ రంగంలో మెలకువలు నేర్చుకోవాలనుకుంది. అయితే, ముందు కనీసం డిగ్రీ అయినా ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో... ముంబయిలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజీలో ఎకనామిక్స్‌ ప్రత్యేకాంశంగా డిగ్రీ చేసింది. ఆపై పీజీ కూడా చదివింది. తరవాత ఎఫ్‌టీఐఐలో సీటుకి దరఖాస్తు చేసింది. కానీ, రాలేదు. నిరాశపడినా... లక్ష్యాన్ని వదిలిపెట్టాలనుకోలేదు. సమయం వృథా చేయకుండా ఓ అడ్వర్టైజ్‌మెంట్‌ సంస్థలో వీడియో ఆర్టిస్ట్‌గా చేరింది. రెండో ప్రయత్నంలో సీటు దక్కించుకుంది.

అక్కడే గెలిచింది...

నచ్చితే ఎంత కష్టానికైనా వెనకాడని పాయల్‌ నచ్చని దాన్ని వ్యతిరేకించడంలోనూ అంతే పట్టుదలతో ఉంటుంది. కళాశాల ఛైర్మన్‌గా రాజకీయాల్లో ఉన్న నటుడిని వ్యతిరేకించిందో విద్యార్థి వర్గం. వారిలో పాయల్‌ ఒకరు. ఇందుకోసం పోరాటాలు, నిరసన కార్యక్రమాలెన్నో చేపట్టింది. వాటి ఫలితంగా సస్పెండ్‌ అయ్యింది. ఫారెన్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనే అవకాశాన్నీ, స్కాలర్‌షిప్‌లనూ కోల్పోయింది. తనపై ఓ ఎఫ్‌ఐఆర్‌కూడా నమోదు అయ్యింది. అయినా, నమ్మిన సిద్ధాంతాల కోసం ధైర్యంగా నిలబడింది. అంతేనా, మరోపక్క చిత్ర నిర్మాణమూ ఆపలేదు. 2017లో ఆమె చిత్రం ‘ఆఫ్టర్‌నూన్‌ క్లౌడ్స్‌’ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపికవ్వడంతో ఒక్కసారిగా పాయల్‌ పేరు మారుమోగిపోయింది. దీంతో ఆ కాలేజీ ఆమెపై ఉన్న ఆంక్షల్ని ఎత్తేసింది. విమాన టికెట్లు సహా ఖర్చులన్నీ భరించి మరీ పాయల్‌ని కేన్స్‌కి పంపించింది. తరవాత 2021లో ‘ఏ నైట్‌ ఆఫ్‌ నోయింగ్‌ నథింగ్‌’ పేరుతో తీసిన డాక్యుమెంటరీకి ఆ ఏడాది కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘గోల్డెన్‌ ఐ’ అవార్డుని గెలుచుకుని అందరి దృష్టినీ మరోసారి తనవైపు తిప్పుకొంది. వీటన్నింటితో పేరొచ్చినా 2014లో తీసిన ‘వాటర్‌మెలన్‌, ఫిష్‌ అండ్‌ హాఫ్‌ ఘోస్ట్‌’ ఆమె మొదటి చిత్రం. తాజాగా 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రతిష్ఠాత్మక పామ్‌ డి ఓర్‌ స్క్రీనింగ్‌ కాంపిటీషన్‌కు భారతీయ చిత్రం ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ ఎంపికైంది. కేరళకు చెందిన ఇద్దరు నర్సులు... రిలేషన్‌షిప్‌లో పడుతోన్న ఇబ్బందులపై తీసిందీ సినిమా. 30 ఏళ్ల తరవాత అంటే 1994లో ‘స్వహం’ చిత్రం తరవాత పామ్‌ డి ఓర్‌  స్క్రీనింగ్‌కి ఎంపికైన భారతీయ చిత్రం ఇదొక్కటే! మరి ఇంత ఘనత సాధించిన పాయల్‌ని అభినందించకుండా ఉండగలమా...


ఆయుష్షు ఎక్కువ

సాధారణంగా మహిళలు కోమలంగా ఉంటారు. దాంతో చిన్నపాటి జ్వరాన్నైనా తట్టుకోలేరు. ఎక్కువగా బాధపడతారు అనుకుంటారు. కానీ జపాన్‌లో జరిగిన ఓ పరిశోధన ప్రకారం... పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే ఎక్కువ రోగనిరోధక శక్తి ఉంటుందట. అందుకే మగవారి కంటే ఆడవారే ఎక్కువ కాలం జీవించగలరని అధ్యయనం చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్