అమ్మ స్ఫూర్తితో ఆడేస్తున్నా

ఆరడుగుల ఎత్తు... చూపు తిప్పుకోనివ్వని అందం...ఆమె సొంతం! అవే ఆమెకు మోడలింగ్‌ అవకాశాలెన్నో తెచ్చిపెట్టాయి.  కానీ, తను మాత్రం టేబుల్‌ టెన్నిస్‌ క్రీడతో ప్రేమలో పడింది. అందులోనే తన ప్రత్యేకతను నిరూపించుకోవాలనుకుంది. అనుకున్నట్లుగానే సాధనతో సాధించింది.

Updated : 23 May 2024 02:49 IST

ఆరడుగుల ఎత్తు... చూపు తిప్పుకోనివ్వని అందం...ఆమె సొంతం! అవే ఆమెకు మోడలింగ్‌ అవకాశాలెన్నో తెచ్చిపెట్టాయి.  కానీ, తను మాత్రం టేబుల్‌ టెన్నిస్‌ క్రీడతో ప్రేమలో పడింది. అందులోనే తన ప్రత్యేకతను నిరూపించుకోవాలనుకుంది. అనుకున్నట్లుగానే సాధనతో సాధించింది. బరిలోకి దిగి ప్రత్యర్థులను కట్టడి చేయడంలో తనకెవరూ సాటి రారని నిరూపించింది. తాజాగా మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచస్థాయిలో 24వ ర్యాంక్‌ని అందుకుంది. ఆమే మనికా బత్రా. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ టీటీ క్రీడాకారిణి.

ఒత్తిడిలోనూ వేగంగా స్పందించగల చురుకుదనం. బాల్‌ని ప్రతికూల స్థితిలోనూ నియంత్రించగల సామర్థ్యం మనికాను భారత టేబుల్‌ టెన్నిస్‌ క్వీన్‌గా మార్చేశాయి. అంతేనా, లాంగ్‌ పింపుల్డ్‌ రబ్బర్‌ రాకెట్‌ని ఉపయోగించి ఆడే తక్కువ మంది క్రీడాకారిణుల్లో ఒకరిగా ప్రత్యేక గుర్తింపునూ తీసుకొచ్చాయి.

మనికాది దిల్లీ. గిరీష్‌-సుష్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో చిన్నది మనికా. అక్క ఆంచల్, అన్నయ్య సాహిల్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఆడుతుంటే తానూ ఆటపై ఇష్టాన్ని పెంచుకుంది. అలా నాలుగేళ్ల వయసు నుంచే టీటీ ఆడటం ఆరంభించింది. మెల్లగా స్కూలు నుంచి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లలో రాణించే వరకూ చేరుకుంది. ఆమె ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు తనకి మరింత మెరుగైన శిక్షణ ఇప్పించడానికి కోచ్‌ సందీప్‌ గుప్తాకి చెందిన హన్స్‌రాజ్‌ మోడల్‌ స్కూల్‌లో చేర్చారు. అది మొదలు మనికా ఇక వెనుదిరిగి చూడలేదు. ‘నాకు తెలియకుండానే టీటీపై ఇష్టం మొదలైంది. అదెంతగా అంటే... బ్యాడ్మింటన్‌కు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ ఎంతటి పేరు తెచ్చారో టేబుల్‌ టెన్నిస్‌లో నా పేరూ అదే స్థాయిలో వినిపించాలనుకున్నా. ఇందుకోసమే పలు బడా సంస్థల్లో మోడలింగ్‌ చేసే అవకాశం వచ్చినా కాదనుకున్నా’ అంటుందీమె. ఆఖరికి ఆటకోసం గ్రాడ్యుయేషన్‌ మొదటి ఏడాదిలోనే చదువుకీ దూరమైంది.

కెరియర్‌ ఇలా...

చిలీ ఓపెన్‌లో తొలి విజయం అందుకున్నప్పటి నుంచి ఆసియా క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే వరకూ మనికా ప్రయాణంలో ఎన్నో మలుపులు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్స్, సమ్మర్‌ ఒలింపిక్స్‌...వంటివాటిల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలెన్నో అందుకుంది. ఈ మధ్యే సౌదీ స్మాష్‌ టోర్నమెంట్‌లో సంచలన విజయాలు నమోదు చేసుకుంది. తాజాగా సింగిల్స్‌ ర్యాంకింగ్‌లో ప్రపంచంలో 24వ స్థానానికి ఎగబాకిన మొదటి భారతీయ మహిళా టీటీ ప్లేయర్‌గా ఘనత సాధించింది. అలాగని తనకి అపజయాలే ఎదురుకాలేదనుకోవద్దు. ‘ఆటలో గెలుపోటములు సహజం. ఈ ఏడాది సౌదీ స్మాష్‌లో ప్రస్తుతం వరల్డ్‌ నంబర్‌ 2 అయిన వాంగ్‌మన్యుని ఓడించడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. కానీ, దాన్ని సంబరంగా జరుపుకోవాలనుకోలేదు. ఎందుకంటే తరవాత రౌండ్లలో నేను ఆడాల్సిన ఆట ఎంతో ఉంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ అయినా ఒలింపిక్స్‌ అయినా నాకు ఒకటే. ఆటను ఆస్వాదించాలి. గెలుపుని శాసించే ఒత్తిడిని అధిగమించాలి. ఇందుకోసం ధ్యానం, వర్కవుట్లు, క్రీడాసాధన చేస్తా. అవే నన్ను నేను మరింతగా మెరుగుపరుచుకునేందుకు సాయం చేస్తాయి’ అని చెబుతోంది మనికా.

అమ్మే అంతా...

టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణిగా తనకో గుర్తింపు రావడానికి తల్లి సుష్మ త్యాగమే కారణం అంటోందీమె. ‘నాన్న మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో అమ్మదే ఇంటి బాధ్యత. నేను ఆటకోసం ఎక్కడికి వెళ్లినా దూరాభారాలు లెక్క చేయకుండా నాతో పాటు వేల మైళ్లు ప్రయాణిస్తుంది. నాపై ఒత్తిడి తగ్గించేందుకు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నేను అన్నింటా మిన్నగా ఉండేలా చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు నడిపిస్తోంది. ముఖ్యంగా చదువు, ఆటల మధ్య సమతుల్యం సాధించడానికి ఆవిడ చేసిన కృషి ఎంతో. ఆఖరికి నేను కాలేజీ మానేయాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడూ తను నాకు తోడుగా ఉంది. ఇలా చెప్పుకొంటూ పోతే అమ్మ నా కోసం చేసిన త్యాగాలకు లెక్క లేదు. ఆమె కష్టానికి విలువా కట్టలేను కానీ, ఆవిడను సంతోషంగా ఉంచేందుకూ ఆటలో విజయాలు అందుకునేందుకూ నిరంతరం శ్రమిస్తా’ అంటోంది మనికా.

గోళ్లపై జాతీయ పతాకం!

2016 ఒలింపిక్స్‌ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని నెయిల్‌ ఆర్ట్‌లా వేసుకుని ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించిన మనికా ఆటతోనే కాదు... తన అందం, ఫ్యాషన్‌ స్టైలింగ్‌తోనూ ఆకట్టుకుంటోంది. టీటీ ఆడేటప్పుడు ఎంత సీరియస్‌గా ఉన్నా... బయట మాత్రం తానెంతో సరదాగా ఉంటానని చెబుతోంది. మోడలింగ్‌పై ఆసక్తి ఉన్నా ఆటే తనకు ముఖ్యం అంటోంది. అయినా ఆసక్తితో తరచూ ఫొటోషూట్‌ల్లో పాల్గొంటుందట. అలానే మనికా ప్రముఖ క్రీడా దుస్తుల తయారీ సంస్థ అడిడాస్‌తో కలిసి ‘ఇంపాజిబుల్‌ ఈజ్‌ నథింగ్‌’ క్యాంపెయిన్‌ చేస్తోంది. తమ కలలను సాకారం చేసుకోవాలనే మహిళలను ఉత్సాహపరిచి సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఇది సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్