Love-Dating: తప్పుదోవ పట్టకుండా పిల్లల్ని ఎలా గైడ్ చేయాలి?

రోజూ స్కూల్లో/కాలేజీలో జరిగిన విషయాల గురించి అడిగి తెలుసుకుంటాం.. పాఠ్యాంశాల్లో సందేహాలుంటే నివృత్తి చేస్తాం. ఇలా తల్లిదండ్రులుగా పిల్లల ప్రతి అడుగులోనూ కీలక పాత్ర పోషిస్తాం. అయితే ప్రేమ, డేటింగ్‌ దగ్గరికొచ్చేసరికి మాత్రం అవేవో తప్పుడు విషయాలన్నట్లు వాటి గురించి....

Updated : 28 Nov 2022 21:08 IST

రోజూ స్కూల్లో/కాలేజీలో జరిగిన విషయాల గురించి అడిగి తెలుసుకుంటాం.. పాఠ్యాంశాల్లో సందేహాలుంటే నివృత్తి చేస్తాం. ఇలా తల్లిదండ్రులుగా పిల్లల ప్రతి అడుగులోనూ కీలక పాత్ర పోషిస్తాం. అయితే ప్రేమ, డేటింగ్‌ దగ్గరికొచ్చేసరికి మాత్రం అవేవో తప్పుడు విషయాలన్నట్లు వాటి గురించి మాట్లాడడానికి నిరాకరించడం, చాటుమాటుగా గుసగుసలాడడం.. వంటివి చేస్తుంటారు చాలామంది పేరెంట్స్‌. నిజానికి ఇలాంటి దాగుడు మూతలే వారి మనసుపై ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. అందుకే ఇలాంటి అనుబంధాల విషయంలో ఏది మంచి, ఏది చెడు అనేది నిర్మొహమాటంగా టీనేజ్‌ పిల్లలకు వివరించాలంటున్నారు. అప్పుడే వాళ్లు తప్పు దోవ పట్టకుండా చూసుకోవచ్చంటున్నారు. మరి, ఇలాంటి సున్నితమైన విషయాల గురించి పేరెంట్స్‌ తమ టీనేజ్‌ పిల్లలకు ఎలా వివరించాలి? రండి.. తెలుసుకుందాం..!

యవ్వనంలో ఉన్నప్పుడు ప్రేమ, డేటింగ్‌.. వంటి వాటికి త్వరగా ఆకర్షితులవుతుంటారు పిల్లలు. ఇందుకు ఆ వయసులో హార్మోన్ల ప్రభావం కావచ్చు.. లేదంటే తోటి పిల్లలు/తెలిసిన వారిని చూసి తామూ అలా చేయాలనుకోవచ్చు. ఇలా కారణమేదైనా.. ఇలాంటి అనుబంధాల గురించి వారికి సరైన అవగాహన లేకపోవడం.. ఏది మంచో, ఏది చెడో తెలియకపోవడం వల్ల వాళ్లు తప్పుడు మార్గాన్ని ఎంచుకునే ప్రమాదం ఉంటుంది. అలా జరగకూడదంటే ఈ విషయాల గురించి పేరెంట్సే తమ పిల్లలకు సున్నితంగా వివరించాలంటున్నారు నిపుణులు.

మీ అనుభవాలే పాఠాలుగా..!

యుక్త వయసులో ఉన్నప్పుడు చాలామందికి ఫస్ట్‌ క్రష్‌, ప్రేమ.. వంటి అనుభవాలు ఉండే ఉంటాయి. అలాగని అన్ని ప్రేమకథలు సక్సెస్‌ అవుతాయని చెప్పలేం. మరి, మీకూ ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? అవే మీ పిల్లలకు పాఠాలుగా చెప్పచ్చు. ఈ క్రమంలో మొహమాటపడడం, అనవసరంగా వారిలో లేనిపోని ఆశలు రేకెత్తించినట్లవుతుందేమోనని సందేహించాల్సిన పనిలేదు. అయితే ఈ క్రమంలో మీరు మీ ప్రేమలో గెలిచారా? లేదంటే విఫలమయ్యారా? అందుకు కారణాలేంటి? వంటివన్నీ వారికి సునిశితంగా వివరించాలి.

అలాగే గెలిచిన ప్రేమకథల్ని పరిశీలిస్తే.. చాలావరకు ముందు కెరీర్‌కి ప్రాధాన్యమిచ్చి.. ఆ తర్వాత ప్రేమను పెళ్లి దాకా నడిపించిన వారే ఎక్కువగా కనిపిస్తుంటారు. మీరూ ఇందుకు మినహాయింపు కాకపోతే.. ఆ విషయాన్ని కూడా మీ పిల్లలకు చెప్పడానికి వెనకాడకూడదు. తద్వారా జీవితంలో దేనికెంత ప్రాధాన్యమివ్వాలో వారికి అర్థమవుతుంది. ఇలా మీ అనుభవాలే వారికి ప్రేమ, ఆకర్షణ, డేటింగ్‌.. వంటి విషయాలపై కనీస అవగాహన కల్పిస్తాయి. ఇలా మీరు చెప్పకపోయినా పిల్లలు తెలుసుకోలేరని కాదు.. కాకపోతే అంతర్జాలం, ఇతర మార్గాల ద్వారా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనే ఆరాటంలో వారు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దానికంటే ఈ విషయంలో మీరే గురువు అవడం మంచిదంటున్నారు నిపుణులు.

స్నేహితులవ్వండి!

‘ఈ పెద్దాళ్లున్నారే.. పిల్లల ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోరు..’ అన్న భావన ఇప్పుడున్న చాలామంది పిల్లల మనసుల్లో ఉంది. అందుకే తెలిసీ తెలియని వయసులో వారు ప్రేమలో పడ్డా, వేరొకరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. ఇంట్లో వాళ్లకు తెలియకుండా రహస్యంగా ఉంచుతుంటారు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేద’న్నట్లుగా.. తీరా ఏదో ఒక తప్పు జరిగాక దాని గురించి తెలిసినా సరిదిద్దుకోలేం. అందుకే పిల్లలు ఇలాంటి పొరపాట్లు చేయకుండా.. వారి మనసులోని విషయాలన్నీ మీతో చెప్పాలంటే వాళ్లతో స్నేహం చేయడం ఒక్కటే మార్గం అంటున్నారు నిపుణులు. అలా కాకుండా ప్రతి విషయంలో వారితో కఠినంగా వ్యవహరించడం, వాళ్లు చెప్పేది పూర్తిగా వినకుండా మీ మాటే నెగ్గాలనుకోవడం, చీటికీ మాటికీ కసుర్లు-విసుర్లు.. ఇలాంటి ప్రవర్తన ఉన్న తల్లిదండ్రులతో ఏ విషయం పంచుకోవాలన్నా పిల్లలు భయపడుతుంటారు. కాబట్టి తెలియక తప్పు చేసినా అది మీతో చెప్పడానికి జంకుతుంటారు. అందుకే పిల్లలతో ఎంత ఫ్రెండ్లీగా మెలిగితే అంత మంచిదంటున్నారు నిపుణులు.

వలపు వలకు చిక్కకుండా..!

విదేశాల నుంచి దిగుమతి అయి మన దేశంలోనూ పాతుకుపోయింది డేటింగ్‌ సంస్కృతి. ఈ క్రమంలోనే ప్రస్తుతం వందలు, వేల సంఖ్యలో డేటింగ్‌ యాప్‌లు, వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. వీటిలో నకిలీ సైట్లు కూడా ఉంటున్నాయి. యువత ఒకరిని చూసి మరొకరు వీటికి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో- మోసపూరిత డేటింగ్ సైట్లతో వ్యక్తిగత సమాచారం పంచుకోవడం వల్ల లేని పోని అనర్ధాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరించాలి. ఫొటోలు మార్ఫింగ్‌ చేసి, వీడియోలు మార్చేసి సోషల్‌ మీడియాలో పెట్టడం, తద్వారా డబ్బు గుంజడం.. వంటి మోసాలకూ ఇలాంటి యాప్‌లు వేదికలవుతున్నాయని వారికి విడమరిచి చెప్పాలి. ఒకవేళ మీ పిల్లలు ఇదివరకే డేటింగ్‌ యాప్‌లను ఆశ్రయిస్తే.. సున్నితంగా వాటి గురించి అడిగి తెలుసుకోవాలి. మొబైల్‌, ల్యాప్‌టాప్‌లలో వాళ్లేం చూస్తున్నారో తెలుసుకునేందుకు నిరంతరం వారిపై నిఘా ఉంచడంలో తప్పు లేదు. తద్వారా వారు నష్టపోకుండా, మీ కుటుంబానికి ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చు.

అండగా నిలవండి!

టీనేజ్‌లో ప్రేమకు, ఆకర్షణకు సరైన అర్థం తెలియక చాలామంది మోసపోతుంటారు. మరికొందరి విషయంలో భేదాభిప్రాయాలు వచ్చి పరిస్థితులు బ్రేకప్‌కి దారితీయచ్చు. ఇక ఇలాంటి విషయాల్ని తట్టుకునే శక్తి, మానసిక పరిణతి చాలామంది టీనేజర్లకు ఉండదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే ఆత్మహత్యలకు పాల్పడడం, డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం.. వంటివి ఎక్కువమంది విషయంలో జరుగుతుంటాయి. అయితే అంత చిన్న విషయానికి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడమంటే జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నట్లే! మరి, పిల్లలు ఇలా చేయకుండా తల్లిదండ్రులే వారికి అండగా నిలవాలి. వారికి జరిగిన నష్టం గురించి పదే పదే అడుగుతూ వారిని మాటలతో హింసించకుండా.. వారి భావోద్వేగాల్ని అర్థం చేసుకోవాలి. బ్రేకప్‌ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమేనని, దాన్నుంచి త్వరగా బయటపడి కెరీర్‌పై దృష్టి పెట్టాలని వారికి నచ్చజెప్పాలి. అప్పుడు కోల్పోయిన దానికంటే అత్యుత్తమమైనది మన సొంతమయ్యే అవకాశాలుంటాయన్న విషయం వారికి అర్థం చేయించాలి. నిజానికి ఇలా అండగా నిలిచే తల్లిదండ్రులున్న పిల్లలు ఏ విషయంలోనూ తప్పుడు నిర్ణయం తీసుకోరని నిపుణులు చెబుతున్నారు.

ఇక ఎదిగే పిల్లలకు లైంగిక విషయాలపై అవగాహన కల్పించడం, ఈ క్రమంలో తప్పొప్పులు వివరించడం వల్ల వారు తప్పుదోవ పట్టకుండా జాగ్రత్తపడచ్చు. వీలైతే ఓసారి మానసిక నిపుణుల వద్ద కౌన్సెలింగ్‌ ఇప్పించినా ప్రేమ, డేటింగ్‌కి సంబంధించి వారు మరిన్ని మంచి విషయాలు తెలుసుకోగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్