Published : 05/10/2021 18:09 IST

మోడ్రన్ దంపతులారా.. కలతలకు ఇలా కళ్లెం వేయండి!

సంసారమన్నాక మనస్పర్థలు, గొడవలు సహజమే! అయితే దంపతుల్లో ఎవరో ఒకరు రాజీపడి వీటిని సద్దుమణిగేలా చేస్తేనే కాపురం సజావుగా ముందుకు సాగుతుంది. కానీ ఇలా అర్థం చేసుకునే తత్వమున్న దంపతులు ఈ కాలంలో చాలా అరుదుగానే కనిపిస్తున్నారంటున్నారు నిపుణులు. ఇందుకు ఆర్థిక స్వాతంత్ర్యం, అసూయాద్వేషాలు, పురుషాధిపత్యం.. వంటివెన్నో కారణాలు కావచ్చు! అయితే వీటి కారణంగా ఇద్దరి మధ్య పలు విషయాల్లో వచ్చే చిన్న చిన్న భేదాభిప్రాయాలు అనుబంధాన్ని తెగే దాకా లాగుతున్నాయని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మరి, ఇలా జరగకూడదంటే ఈ కాలపు దంపతులు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు.

ఓ మెట్టు దిగండి!

వివాహ బంధమంటే ఎన్నో బరువు బాధ్యతలతో కూడుకున్నది. పెళ్లి కాక ముందు వరకు ఎలా ఉన్నా.. పెళ్లయ్యాక మాత్రం దంపతులిద్దరూ ఒకరికొకరు కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం తప్పనిసరి! అయితే ఈ కాలపు దంపతుల్లో ఇది కొరవడుతోందని చెబుతున్నారు నిపుణులు. దీనికి కారణం.. వారికి చిన్న వయసులోనే పెళ్లి కావడం, లేదంటే ఇద్దరి మధ్య వయోభేదం ఎక్కువగా ఉండడం..! ఫలితంగా ఒకరి మాటలు-అభిప్రాయాలతో మరొకరు ఏకీభవించకపోవడం, పరిణతితో ఆలోచించలేకపోవడం.. వంటివే ఇద్దరి మధ్య గొడవలకు కారణమవుతున్నాయి. అయితే వీటిని ఇలాగే వదిలేస్తే అనుబంధానికే ముప్పు వాటిల్లచ్చు. కాబట్టి ఇలాంటి కలతల్ని దూరం చేసుకోవాలంటే.. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటేనే సాధ్యమవుతుంది. ఒకవేళ భార్యాభర్తలిద్దరిలో ఒకరు కాస్త మొండిగా ఉన్నా.. మరొకరు ఓ మెట్టు దిగితే తప్పు లేదు. ఫలితంగా గొడవలూ సద్దుమణుగుతాయి.. ఎదుటివారూ మీ ఓపికను అర్థం చేసుకొని వారి ప్రవర్తననూ క్రమంగా మార్చుకునే అవకాశాలుంటాయి.

పంచుకుంటేనే ఫలితం!

ఇంటి పనులు, ఆఫీస్‌ పనులు.. ఈతరం దంపతుల మధ్య దూరం పెరగడానికి ఇవీ ఓ రకంగా కారణమే! అందుకే ఆఫీస్‌ పనులు పక్కన పెట్టినా ఇంటి పనుల్ని కలిసి పంచుకుంటే కొంతవరకు ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఇవనే కాదు.. పిల్లల వల్ల కూడా ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించలేకపోతున్నామన్నది చాలామంది దంపతులు చెబుతోన్న మాట! అలాగని పిల్లల్నీ వద్దనుకోలేం.. ఎందుకంటే వాళ్లూ మన జీవితంలో అంతర్భాగమే! అయితే దీనికి ఒకే ఒక్క మార్గం ఉందంటున్నారు నిపుణులు. ఎలాగైతే పిల్లలకు జన్మనివ్వడంలో ఆలుమగల బాధ్యత సమానంగా ఉంటుందో.. పిల్లల్ని పెంచి పెద్ద చేసే బాధ్యతనూ కలిసి పంచుకున్నప్పుడే ఒక్కరిపైనే పూర్తి భారం పడకుండా ఉంటుంది.. తద్వారా అటు సమయమూ మిగులుతుంది.. ఇటు పిల్లలకు-మీకు మధ్య అనుబంధం రెట్టింపవుతుంది. ఇక ఈ దొరికిన సమయాన్ని దంపతులిద్దరూ వినియోగించుకోగలిగితే సంసారంలో కలతలకు చోటే ఉండదు.. ఏమంటారు?!

నీది-నాది కాదు.. మనది!

ఈతరం దంపతుల్లో భేదాభిప్రాయాలు రావడానికి ముఖ్య కారణమేదైనా ఉంది అంటే అది డబ్బే అంటున్నారు నిపుణులు. ఇద్దరూ రెండు చేతులా సంపాదించడం, ఆర్థికంగా ఒకరిపై ఒకరు ఆధారపడకపోవడం, పొదుపు-మదుపు విషయాల్లో ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకోవడం వల్ల.. ఇద్దరి మధ్య దూరం అగాథంలా పెరిగిపోతోంది. ఒకానొక దశలో ఇది బయటపడి.. తెగతెంపుల దాకా వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే భార్యాభర్తలిద్దరూ ఎవరెంత సంపాదించినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత పొదుపు చేసినా.. దాపరికం లేకుండా అన్ని విషయాలు పంచుకోవడం అత్యుత్తమం అంటున్నారు నిపుణులు. అలాగే ఆస్తులు కొన్నా, రుణాలు చెల్లించినా.. కలిసే పెట్టుబడి పెట్టడం వల్ల ఇద్దరూ బాధ్యతాయుతంగా వ్యవహరించే అవకాశముంటుంది. ఈ కలుపుగోలుతనమే ఆలుమగలిద్దరినీ శాశ్వతంగా కలిపి ఉంచుతుంది.

నిత్యనూతనం చేసుకోవాలి!

వివాహ బంధం శాశ్వతమైంది. అయితే ఈ కాలంలో చాలామంది దంపతులు దీని విలువ తెలుసుకోలేక, లేదంటే డబ్బు మోజులో పడిపోవడం వల్ల, వివాహేతర సంబంధాలకు ఆకర్షితం కావడం వల్ల, పాశ్చాత్య పోకడల ప్రభావం మూలంగా.. ఇలా కారణమేదైనా నూరేళ్ల అనుబంధాన్ని మధ్యలోనే తెంచుకుంటున్నారు. ‘ఈ అనుబంధం మాకు బోర్‌ కొట్టేసింది’ అని సింపుల్‌గా చెప్పేస్తున్నారు. నిజానికి మన వివాహ వ్యవస్థకు, సంస్కృతీ సంప్రదాయాలకు పూర్తి విరుద్ధమిది! మరి, ఇలాంటి పవిత్ర బంధాన్ని మధ్యలోనే తెగతెంపులు చేసుకోకుండా, ఈ క్రమంలో వచ్చిన పొరపచ్ఛాల్ని దూరం చేసుకోవాలంటే.. దంపతులిద్దరూ ఒకరి లక్ష్యాలు, కోరికలు, ప్రాధమ్యాలు, పరిస్థితుల్ని మరొకరు అర్థం చేసుకుంటూ, అన్ని విషయాల్లో ఒకరికొకరు మద్దతు తెలుపుకుంటూ ముందుకు సాగడం మంచిదంటున్నారు నిపుణులు. వీటితో పాటు రొమాన్స్‌, శృంగారం కూడా అనుబంధాన్ని నిత్యనూతనం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

ఇక ఈ కాలపు దంపతుల్లో పొరపచ్ఛాలు రావడానికి స్వార్థం కూడా ఓ కారణమే! కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఎలాంటి ప్రతికూల పరిస్థితులొచ్చినా కలిసే ఎదుర్కోవడం, సమస్యల్నీ కలిసే పరిష్కరించుకోవడం వల్ల ఇద్దరి మధ్యా దగ్గరితనం పెరుగుతుంది. దాంపత్య బంధాన్ని పటిష్టం చేయడానికి ఇదీ కీలకమే!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని