నాకు నలభయ్యేళ్లు.. పెళ్లంటే భయమేస్తోంది..!

నాకు నలభయ్యేళ్లు. కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు మా తమ్ముడు ‘సంబంధాలు చూస్తాను.. పెళ్లి చేసుకో’ అంటున్నాడు. నేను వద్దన్నా వాడు వినడం లేదు. మా ఇద్దరి తమ్ముళ్లు, చెల్లి పెళ్లయ్యాక ఒంటిరిదాన్ననే భావం నన్ను వెంటాడుతోంది. ఈ వయసులో పెళ్లి చేసుకుంటే....

Published : 28 Oct 2022 12:48 IST

(Image for Representation)

నాకు నలభయ్యేళ్లు. కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు మా తమ్ముడు ‘సంబంధాలు చూస్తాను.. పెళ్లి చేసుకో’ అంటున్నాడు. నేను వద్దన్నా వాడు వినడం లేదు. మా ఇద్దరి తమ్ముళ్లు, చెల్లి పెళ్లయ్యాక ఒంటిరిదాన్ననే భావం నన్ను వెంటాడుతోంది. ఈ వయసులో పెళ్లి చేసుకుంటే బంధువులు, ఆఫీసులో కొలీగ్స్ ఏమనుకుంటారోనని భయంగా ఉంది. అయితే ఇంకా ఆలస్యం చేస్తే ఎంత ప్రయత్నించినా సంబంధాలు రావని మా తమ్ముళ్లు అంటున్నారు. కానీ, నా మనసులో ఉన్న భయాలు పోవడం లేదు. కౌన్సెలింగ్‌తో నాలో ఉన్న భయాలు తొలగుతాయా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.

జ. లేటు వయసులో వివాహం చేసుకోవాలనుకునే వారికి సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు, అనుమానాలు, అభద్రత మీలో కూడా కనిపిస్తున్నాయి. వాస్తవానికి పెళ్లి చేసుకోవడానికి నిర్ణీత వయసంటూ ఏమీ ఉండదు. కానీ, తమపై తమకు పూర్తి విశ్వాసం ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం కూడా. ఎందుకంటే ‘సమాజం వింతగా చూస్తోంది.. తోబుట్టువులు పెళ్లి చేసుకోమని బలవంతపెడుతున్నారు’ అనే ఆలోచనలతో పెళ్లి చేసుకోవాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. దీనికి బదులుగా మీకు భాగస్వామి అవసరం ఎంతవరకు ఉందో మొదట ఆలోచించుకోవాలి. ఆ తర్వాత భాగస్వామి నుంచి ఏం కోరుకుంటున్నారు? మీ ప్రాధాన్యాలు ఏంటి? మీ భావజాలానికి అవతలి వ్యక్తి నప్పుతారా? అనే అంశాలను పరిశీలించాలి.

లేటు వయసులో పెళ్లి చేసుకోవాలనుకునే వారి ప్రాధామ్యాలన్నీ అవతలి వ్యక్తితో కలవడం కొంచెం కష్టం. కాబట్టి కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి వస్తుంది. అలాగని అన్ని విషయాల్లో రాజీ పడి పెళ్లి చేసుకోవాల్సిన అవసరమూ లేదు. అయితే పెళ్లికి, వయసుకు ఎటువంటి సంబంధం లేదు. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత అంశం. కాబట్టి, ఒకసారి పూర్తి స్థాయిలో కౌన్సెలింగ్‌ తీసుకోండి. దాని ద్వారా పెళ్లిపై మీ ఆలోచనలు ఏంటి? ఈ వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? వాటిని ఎలా అధిగమించవచ్చు? అనేవి తెలుసుకోవచ్చు. అలాగే ఒక వయసు దాటిన తర్వాత పిల్లల్ని కనే విషయంలో కూడా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉండచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, దీనికి సంబంధించి కూడా నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్