Ileana: అలాంటి వాడు నా జీవితంలోకి రావడం నా అదృష్టం!

వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా ఎన్ని సమస్యలున్నా.. ఇంటి నుంచి ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల మద్దతు ఉంటే వీటన్నింటినీ అధిగమించచ్చు. ఈ విషయంలో తానెంతో అదృష్టవంతురాలిని అంటోంది బెల్లీ బ్యూటీ ఇలియానా....

Updated : 20 Mar 2024 15:11 IST

వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా ఎన్ని సమస్యలున్నా.. ఇంటి నుంచి ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల మద్దతు ఉంటే వీటన్నింటినీ అధిగమించచ్చు. ఈ విషయంలో తానెంతో అదృష్టవంతురాలిని అంటోంది బెల్లీ బ్యూటీ ఇలియానా. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఫ్యాన్స్‌తో పంచుకునే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా పలు విషయాల గురించి స్పందించింది. తన భర్త మైఖేల్‌తో తనకున్న అనుబంధం, ప్రెగ్నెన్సీలో ఎదురైన సమస్యలు, ప్రసవానంతర ఒత్తిళ్లు.. వంటి అంశాలకు సంబంధించి తన అనుభవాల్ని ఓ సందర్భంలో పంచుకుంది. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

తనకు బాగా కలిసొచ్చిన సంవత్సరం ఏదైనా ఉందంటే అది గతేడాది 2023 అంటోంది ఇలియానా. తన పెళ్లి, ఆపై ఓ బాబుకు తల్లవడం, తన భర్త ప్రేమను ఆస్వాదించడం.. ఇలా ఆ ఏడాది ఎన్నో మధురానుభూతుల్ని సొంతం చేసుకున్నానంటోందామె. అయితే అదే సమయంలో ప్రసవానంతర ఒత్తిళ్లు, విమర్శలతో పలు ప్రతికూల పరిస్థితుల్నీ ఎదుర్కొన్న ఆమె.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, భర్త మద్దతు వల్లే వాటి నుంచి బయటపడగలిగానంటోంది.

అప్పుడు పని చేయలేకపోయా!
‘గతేడాది ఎంతో సంతోషంగా గడిచిపోయింది. మేలో మైఖేల్‌ డోలన్‌తో నా వివాహం, ఆగస్టులో ఓ బాబుకు తల్లినవడం నా జీవితంలోనే మర్చిపోలేని మధురానుభూతులు. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక అమెరికాలోనే గడిపాను. నిజానికి గర్భం ధరించాకా పనిచేయాలనుకున్నా.. కానీ ఈ సమయంలో తలెత్తిన కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో మా అమ్మ, నా భర్త మైఖేల్‌ నాకు అండగా నిలిచారు. ఈ సమస్యల నుంచి బయటపడే ధైర్యాన్ని నాలో నింపారు. దాంతో ఈ దశనూ ఆనందంగా దాటేశా.
ఇక ప్రసవానంతర ఒత్తిడి అనేది ప్రతి తల్లికీ సహజం. ఎంత అవగాహన ఉన్నా.. దీన్ని అధిగమించడానికి ముందు నుంచి సన్నద్ధం కాలేం. ఈక్రమంలో ఒక్కోసారి అపరాధ భావం/మామ్‌ గిల్ట్‌ నన్ను వేధించేది. ఒక్కో సమయంలో ఉన్నట్లుండి ఏడ్చేసేదాన్ని. పలు ఆరోగ్య సమస్యల వల్ల నేనో చోట, నా కొడుకు మరో చోట ఉండడంతో వాడిని ఎంతో మిస్సయ్యేదాన్ని. విభిన్న ఆలోచనలు, భావోద్వేగాలతో మనసు కకావికలమయ్యేది. ఆ సమయంలోనూ మైఖేల్‌ నన్ను, నా ఎమోషన్స్‌ని అర్థం చేసుకొని మసలుకున్నాడు. నన్ను, బాబును ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు.. ఇక నా బాబు ఆలనా పాలనలో నేను ఎంత బిజీగా ఉన్నా.. కాస్త సమయం నా కోసం కేటాయించుకునేదాన్ని. రోజూ అరగంట వ్యాయామం, ఆపై స్నానం చేసేదాన్ని. ఇవి నాకు కాస్త మానసిక ప్రశాంతతను అందించేవి..’ అంటోంది ఇలియానా.

వాళ్లను అంటే ఊరుకోను!
‘నన్నేమైనా భరిస్తా.. కానీ నా కుటుంబ సభ్యుల్ని ఏమైనా అంటే ఊరుకునేదే లేదు..’ అంటుంది ఇలియానా. ఒకానొక సమయంలో తన పెళ్లి, భర్త గురించి వచ్చిన విమర్శల్ని సున్నితంగానే తోసిపుచ్చిందామె.
‘గతంలో నా పెళ్లి గురించి ఎన్నో ఊహాగానాలొచ్చాయి. కానీ నేను వాటి గురించి పట్టించుకోలేదు. మొదట్లో నా పెళ్లి విషయం దాచిపెట్టినందుకు సంతోషంగానే ఉంది. ఎందుకంటే గత అనుభవాలు నా జీవితంలో ఈ దశ గురించి ఎంత పరిమితంగా మాట్లాడితే మంచిదో నాకు తెలియజేశాయి. కొంతమంది ఈ విషయం గురించి నా వెనక మాట్లాడుకోవడం, విమర్శించడం నాకు నచ్చలేదు. నన్నేమన్నా నేను పట్టించుకోను.. కానీ నా భర్త, కుటుంబ సభ్యుల గురించి ఇతరులు నోటికొచ్చినట్లు మాట్లాడితే మాత్రం ఊరుకోను. ఇక నా భర్త మైఖేల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అతడే నా ఛీర్‌ లీడర్‌. నన్ను కలిసిన తొలి రోజు ఎలా ఉన్నాడో.. ఇప్పటికీ అలాగే ఉన్నాడు.. అతడు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. తను నాలుగైదుసార్లు ఇండియాకొచ్చాడు. ముంబయి అంటే తనకు చాలా ఇష్టం. ఈ నగరాన్ని న్యూయార్క్‌తో పోల్చుతుంటాడు. నేను నటించిన సినిమాలన్నీ చూస్తుంటాడు. నా చిత్రాల్లోని పాటలన్నీ లిరిక్స్‌తో సహా గుర్తుపెట్టుకొని పాడగలడు. తనకు నాపై ఎంత ప్రేముందో చెప్పడానికి ఇది చాలదూ?!’ అంటోన్న ఇల్లూ బేబీ.. ఈ ఏడాది రెండు బాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. తన కొడుకు కోయా ఫోనిక్స్‌ డోలన్‌తో కలిసి సెట్‌లో సందడి చేయడానికి ఉవ్విళ్లూరుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్