లవ్ మ్యారేజ్.. అయినా సంప్రదాయాల పేరిట టార్చర్ చేస్తున్నాడు..!

నేను ఓ ఐటీ సంస్థలో ఐదేళ్లుగా పనిచేస్తున్నాను. మా బృందంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. అలా నాకు ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. మా ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబితే మొదట అంగీకరించలేదు. కానీ, కొంత కాలం తర్వాత పెళ్లికి ఒప్పుకున్నారు.

Published : 24 Apr 2024 14:53 IST

నేను ఓ ఐటీ సంస్థలో ఐదేళ్లుగా పనిచేస్తున్నాను. మా బృందంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. అలా నాకు ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. మా ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబితే మొదట అంగీకరించలేదు. కానీ, కొంత కాలం తర్వాత పెళ్లికి ఒప్పుకున్నారు. అలా నాలుగేళ్ల మా ప్రేమ ప్రయాణం పెళ్లి పట్టాలెక్కింది. కానీ, పెళ్లి తర్వాతే అసలు సమస్య ప్రారంభమైంది. నా భర్త సంప్రదాయాల పేరిట నన్ను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. వాళ్ల సంప్రదాయం ప్రకారం ఇంట్లో వస్తువులతో పాటు కొన్ని ఖర్చులు అమ్మాయి తరపు వారే భరించాలట. కానీ, మా నాన్న రిటైర్డ్‌ ఉద్యోగి. ఇప్పటికే నా పెళ్లి గురించి చాలా డబ్బులు ఖర్చు చేశారు. కొన్ని ఖర్చులకు నేనే వారికి కొంత మొత్తం ఇస్తుంటాను. దానికి తోడు ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలట. అతను ఏ పనిలోనూ నాకు సహకరించడు. ఇవి కాకుండా నా ఆదాయం, ఖర్చుల గురించి ఆరా తీస్తుంటాడు. ఇవి నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అలాగని అతని ఆలోచనలను నేను మార్చే పరిస్థితిలో లేను. ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. ప్రస్తుతం ప్రపంచమంతా గ్లోబల్‌ విలేజ్‌గా మారిపోయింది. ఇందులో భాగంగా పెళ్లిళ్లు కూడా ప్రాంతీయ భేదం లేకుండా జరుగుతున్నాయి. మీ వివాహం కూడా ఇందుకు ఉదాహరణ. మీరు నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారని చెబుతున్నారు. అప్పుడు కనిపించని సమస్యలు మీకు పెళ్లి తర్వాత ఉత్పన్నమవుతున్నాయి. దీన్ని బట్టి మీరు సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లినట్టుగా అనిపించడం లేదు. అతను సంప్రదాయాల పేరిట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో అతని అసలు స్వరూపం బయటపడింది. ఇక ఇంటి పనులు పంచుకోకపోవడం, మీ ఖర్చుల గురించి ఆరా తీయడం వల్ల మీ సమస్య తీవ్రమైనట్టుగా అర్థమవుతోంది.

ఇక్కడ సమస్య ప్రధానంగా మీ భర్తతో ఉంది. కాబట్టి, అతనితోనే ఓసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. డబ్బుల విషయంలో మీ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని వివరించండి. అలాగే దంపతులుగా ఇద్దరూ ఇంటి పనులు పంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పండి. అతనిలో మార్పు వస్తుందేమో గమనించండి. లేదంటే ఇరువురికీ ఆమోదయోగ్యమైన పెద్దలతో సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోతే కపుల్‌ కౌన్సెలింగ్‌ తీసుకోండి. వారు తగిన సలహా/సూచనలు ఇస్తారు. దానిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్