Bou Samnang: మనసులు గెలిచింది!

అయిదు కిలోమీటర్ల రేసు. పరుగు మొదలైంది. ట్రాక్‌ మీద అమ్మాయిలు పోటా పోటీగా పరిగెడుతున్నారు. ఫినిషింగ్‌ లైన్‌ దాటేసిందో అమ్మాయి. స్టేడియం చప్పట్లతో మార్మోగిపోయింది.

Published : 20 May 2023 00:09 IST

అయిదు కిలోమీటర్ల రేసు. పరుగు మొదలైంది. ట్రాక్‌ మీద అమ్మాయిలు పోటా పోటీగా పరిగెడుతున్నారు. ఫినిషింగ్‌ లైన్‌ దాటేసిందో అమ్మాయి. స్టేడియం చప్పట్లతో మార్మోగిపోయింది. ఒక్కొక్కరూ పరుగు పూర్తి చేస్తున్నారు. చివర్లో ఒక్కరు మాత్రం మిగిలి పోయారు. ఇక సీట్లలోంచి లేద్దామనుకుంటున్న వాళ్లందరూ ఆగిపోయారు. ఆ చిట్ట చివరి అమ్మాయి

బోవు సమ్నాంగ్‌. అప్పటికి విజేత నిర్ణయమై ఆరు నిమిషాలవుతోంది. మిగిలింది తనే. తనకంటే ముందు వాళ్లకీ ఆమెకీ మధ్య వ్యత్యాసమూ దాదాపు నిమిషం. దీనిలో చెప్పుకొనేదేముంది అనుకుంటున్నారా? అప్పడే కుండపోత వర్షం. తనది ఆఖరి స్థానమని తెలుసు. భారీవర్షం కాబట్టి, పరుగు ఆపినా ఆమెను నిందించే వారూ లేరు. అయినా క్రీడాస్ఫూర్తిని చాటుకుంది సమ్నాంగ్‌. జోరువానలోనే కళ్లలో వర్షధార పడుతోన్నా.. కాలు పట్టు జారుతోన్నా పరుగు పూర్తిచేసింది. ఆమె పట్టుదలే ప్రేక్షకులను నిలబెట్టేలా చేసింది. పూర్తయ్యాక విజేతను మించిన చప్పట్లు దక్కేలా చేసింది. అంత వర్షంలో పరుగెందుకు? ఇదే ప్రశ్న వేశారు అక్కడివాళ్లు. దానికి ‘నాకున్న రక్తహీనత కారణంగా గెలవలేనని తెలుసు. వర్షం భారీగా పడుతోందనీ అర్థమైంది. కానీ నా దేశం కంబోడియాకి ప్రాతినిధ్యం వహిస్తున్నా. గెలుపోటములు కాదు.. పూర్తిచేయడం ప్రధానం’ అని చెప్పింది. ఒక జత బూట్లు, ఒక స్పోర్ట్స్‌ డ్రెస్‌ మాత్రమే ఉన్న కటిక పేదరికం ఆమెది. వట్టి పాదాలతో సాధనచేసి ఆ దేశ నేషనల్‌ అథ్లెటిక్‌ ప్రోగ్రామ్‌లో స్థానం సంపాదించింది. చైనాలో శిక్షణ పూర్తి చేసుకొని తాజాగా ఈ పోటీల్లో పాల్గొంది. ఈమె ఆరోగ్య పరిస్థితి చూసి ట్రైనర్‌ వారించినా ఇన్నేళ్ల శిక్షణ వృథా కావొద్దని హాజరైంది. ‘చేరుకునే వేగంలోనే తేడా! ప్రయత్నిస్తే ఎవరైనా గమ్యాన్ని చేరుకోవచ్చు. కాబట్టి, ప్రయత్నించండి.. భయపడి ఆగిపోవద్దు అని నా పరుగు ద్వారా చెప్పాలనుకున్నా’ అనే సమ్నాంగ్‌ కంబోడియా ప్రధాని ప్రశంసలతో పాటు ఆ దేశ కరెన్సీ 10,000 బహుమతిగానూ అందుకుంది. కంబోడియాలో జరుగుతోన్న సౌత్‌ ఈస్ట్‌ ఏషియన్‌ గేమ్స్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది. ఆమె స్ఫూర్తికి నెటిజన్లు జేజేలూ పలుకుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్