Samalla Swetha: వాళ్ల కన్నీళ్లు తుడవడమే నా పని

కష్టాల కొలిమిలోంచి వచ్చిన వాళ్లకే కన్నీటి విలువ తెలుస్తుంది. చిన్నవయసులో కుటుంబ బాధ్యతలు మోసిన సామళ్ల శ్వేత.. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల వ్యధని అర్థం చేసుకున్నారు.

Updated : 12 Apr 2023 00:49 IST

కష్టాల కొలిమిలోంచి వచ్చిన వాళ్లకే కన్నీటి విలువ తెలుస్తుంది. చిన్నవయసులో కుటుంబ బాధ్యతలు మోసిన సామళ్ల శ్వేత.. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల వ్యధని అర్థం చేసుకున్నారు. వాళ్లకు అండగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకున్న ఆమె తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారిలా..

మాది సిద్దిపేట. దిగువ మధ్యతరగతి కుటుంబం. అమ్మ భారతమ్మ కూలీ. నాన్న కృష్ణ హమాలీ పని చేసేవారు. నాకో చెల్లి. ఇద్దరు తమ్ముళ్లు. అమ్మానాన్నలు ఇద్దరూ పనులకు వెళ్తే చెల్లి, తమ్ముళ్లను నేనే చూసుకునేదాన్ని. ఇంటి పనుల్లో పడి.. పదో తరగతి ఫెయిల్‌ అయ్యా. దాంతో పెళ్లి చేద్దాం అన్నారు. అప్పుడు మా పెద్దమ్మ కొడుకు అడ్డుపడి, మళ్లీ పరీక్ష రాసేలా చేశాడు. ఉపకార వేతనాలతో ఇంటర్‌ నెట్టుకొచ్చా. అమ్మకు తోడుగా చిన్నచిన్న పనులకు వెళ్తూ ఉండేదాన్ని. డిగ్రీ అయిపోయిన వెంటనే మా బాబాయి సీసీసీ(కేరింగ్‌ సిటిజన్స్‌ కలెక్టివ్‌) అనే స్వచ్ఛంద సంస్థలో చేర్చారు. ఉద్యోగం దొరికిందని సంబర పడ్డా. నా మొదటి జీతం రూ.4 వేలు.

ఒక్కొక్కరిది ఒక్కో కథ...

18 ఏళ్లకే పెళ్లి.. పిల్లలు. వ్యవసాయంలో వచ్చిన నష్టాన్ని భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకే లేనప్పుడు కోడలెందుకు అన్నారు అత్తింటివాళ్లు. ఆమెకు చావు తప్ప వేరే దారి లేదనుకున్నప్పుడు ఆవిడ దగ్గరకు వెళ్లి ధైర్యం చెప్పా. ఆర్థికంగా మా సంస్థ ఆదుకుంటుంది అని భరోసా ఇచ్చాను. ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వ్యవసాయం చేసి అప్పుల పాలయ్యారు. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అటు పుట్టింటికి, ఇటు అత్తింటికి కాక మిగిలిపోయిందా మహిళ. ఈ పదేళ్లలో ఇలాంటి ఎన్నో కన్నీటి కథలు విన్నా. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కనుక్కోవడం, వారిని పరామర్శించడం, ధైర్యం చెప్పడం, ఎక్స్‌గ్రేషియాకు ఎలా దరఖాస్తు చేసుకునేలా చూడటం. ముఖ్యంగా పిల్లలు కూలి పనులకు వెళ్లకుండా బడులకు పంపేదాన్ని. చిన్నవయసులో భర్తను కోల్పోయిన వారితో పదో తరగతి పరీక్షలు రాయించేవాళ్లం. వాళ్లని కలిసి వారి బాగోగులు తెలుసుకునేటప్పుడు కళ్లల్లో నీళ్లు తిరిగేవి. కూలీనాలీ చేసుకుంటూ బతుకు బండిని లాగే ఆడవాళ్లే ఎక్కువ. చేసిన అప్పులు తీర్చడానికి పస్తులుండేవారు. వాటిని తీర్చలేక లైంగిక వేధింపులను ఎదుర్కొన్న వారూ ఉన్నారు. కొన్నాళ్లకు చేస్తున్న పనిమీద మమకారం పెరిగింది. ఏదో రకంగా సమాజానికి ఉపయోగపడుతున్నందుకు సంతోషం కలిగింది. మావారు అశోక్‌.. కారు డ్రైవర్‌. ఉద్యోగం వదిలేసి అత్తగారి ఊరు జనగామకు వెళ్లిపోయా. ఆయన జీతంతో ఇల్లుగడవడం కష్టంగా ఉండేది. ఏడు నెలల తరువాత సిద్దిపేటకు మకాం మార్చి, పాత ఉద్యోగంలోనే చేరాను.

సీసీసీ నుంచి నేలమ్మ...

ఒంటరి, చిన్న, సన్నకారు మహిళా రైతులు, ఆత్మహత్యలు చేసుకున్న బాధిత కుటుంబ సభ్యులను ఏకతాటిపైకి తేవాలనుకున్నా. వీళ్లందర్ని కలిపి నేలమ్మ అనే సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఇది సీసీసీ అధ్వర్యంలో నడిచే మరో సంస్థ. 17 గ్రామాల్లో 202 మందిని ఒక సమూహంగా చేశాం. వారి సమస్యలు వారే పరిష్కరించుకునేలా శిక్షణ ఇచ్చాం. బాధితులకు సాయం ఆలస్యం కాకూడదనేదే నేలమ్మ లక్ష్యం. నేలమ్మ ద్వారా స్థానికంగా మహిళలకు తరగతులు నిర్వహిస్తున్నాం. హక్కులను చెబుతున్నాం. ఆహార పదార్థాలు తయారు చేసేలా శిక్షణ ఇస్తున్నాం. పాడి సమకూరుస్తున్నాం. చుట్టుపక్కల దాదాపు 60 ఎకరాల్లో సేంద్రియ సాగు చేసేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం. వీటన్నింటికి చందాల ద్వారా వచ్చిన మొత్తాన్ని ఉపయోగిస్తున్నాం. ఒకప్పడు ఆడపిల్లనని బరువుగా భావించేవారు. కానీ ఇప్పుడు మా అమ్మకు నేనే పెద్దకొడుకుని. పెళ్లికి ముందు ఆడపిల్ల బయట తిరగడం ఏంటీ అనేవారు. పెళ్లి తరువాత ఆ పెత్తనాలేంటి అనేవారు. అనేవాళ్లు ఏం చేసినా అంటూనే ఉంటారు. మనం నిజాయితీగా ఉన్నప్పుడు అవేమీ పట్టించుకోకూడదు.

నా సేవలకు మెచ్చి తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశిష్ట మహిళా పురస్కారాన్ని అందించడం చాలా సంతోషంగా అనిపించింది. కమ్యూనిటీ మొబలైజర్‌ వృత్తిని ఎంచుకోవడం నా జీవితాన్నిలా మలుపు తిప్పుతుందని అనుకోలేదు.

 మెతుకు వెంకటేష్‌, సిద్దిపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్