కార్టూన్‌తో... అంతర్జాతీయ అవార్డు

సమాజంలో అసమానతలను ప్రశ్నించాలి... చాలా అంశాల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని గుర్తించిందామె. దానికి పేజీల కొద్దీ వ్యాసాలు, గొంతు చించుకుని చెప్పే ఉపన్యాసాలు సరిపోవు... మెదళ్లలో ఆలోచన పుట్టించాలి అనుకుంది. అందుకు రుచిత తనేజా ఎంచుకున్న మార్గం... కార్టూన్‌! అది ఆమెకు గుర్తింపునే కాదు... తాజాగా అంతర్జాతీయ పురస్కారాన్నీ తెచ్చిపెట్టింది.

Published : 25 May 2024 04:05 IST

సమాజంలో అసమానతలను ప్రశ్నించాలి... చాలా అంశాల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని గుర్తించిందామె. దానికి పేజీల కొద్దీ వ్యాసాలు, గొంతు చించుకుని చెప్పే ఉపన్యాసాలు సరిపోవు... మెదళ్లలో ఆలోచన పుట్టించాలి అనుకుంది. అందుకు రుచిత తనేజా ఎంచుకున్న మార్గం... కార్టూన్‌! అది ఆమెకు గుర్తింపునే కాదు... తాజాగా అంతర్జాతీయ పురస్కారాన్నీ తెచ్చిపెట్టింది.

2014... దేశరాజకీయాలపై తమ అసహనాన్ని కొందరు సోషల్‌మీడియాలో వ్యక్తం చేశారు. విద్యార్థులని కూడా చూడకుండా వాళ్లందరినీ అరెస్ట్‌ చేయడం మొదలుపెట్టారు. దానిపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాలి అనుకుంది రుచిత. అప్పుడు తనకొచ్చిన ఆలోచన కార్టూన్‌. అలా ఫేస్‌బుక్‌లో ‘శానిటరీ పానెల్స్‌’ ప్రారంభమైంది. రుచితది బెంగళూరు. దిల్లీ యూనివర్సిటీ నుంచి మాస్‌ మీడియా అండ్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తిచేసింది. గ్రీన్‌ పీస్‌ ఇండియా, మొజిల్లా ఫౌండేషన్‌ల్లో సోషల్‌ మీడియా ఆఫీసర్‌గా పనిచేసింది. డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌ అవ్వడం తన లక్ష్యం. కానీ ఇలా అనుకోకుండా కార్టూనిస్ట్‌ అయ్యింది. తాజా అంశాలు, లింగవివక్ష, మానవహక్కులు, మహిళల సమస్యలపైనే తన బొమ్మలుంటాయి. చిన్న బొమ్మలు... సూటిగా తాకేలా ఉండే తక్కువ నిడివి కామెంట్‌ రుచిత ప్రత్యేకత. సరదాగా తన అభిప్రాయాలను పంచుకోవాలని ప్రారంభించినా కొద్దికాలంలోనే అభిమానులను సంపాదించుకుంది. చట్టాలు, పథకాలు, రాజకీయ నిర్ణయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలేవైనా ధైర్యంగా తను చెప్పాలనుకున్నది చెప్పేస్తుంది. ఈక్రమంలో రేప్, చంపేస్తామన్న బెదిరింపులనీ ఎదుర్కొంది రుచిత. అయినా భయపడకుండా కొనసాగుతూ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో అభిమానులను సంపాదించుకుంది. దేశంలోని ప్రముఖ రాజకీయ కార్టూనిస్టుల్లో ఒకరిగా నిలిచింది. ఆ ప్రతిభకు గుర్తింపుగానే తాజాగా ‘కోఫీ అన్నన్‌ కరేజ్‌ ఇన్‌ కార్టూనింగ్‌ అవార్డ్‌’ దక్కింది. హాంకాంగ్‌కి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్‌ జుంజీతో కలిసి రుచిత దీన్ని అందుకుంది. ‘సమస్యలైనా, అవగాహనైనా ప్రజల మనసుల్లోకి నేరుగా చేరాలి అనుకునేదాన్ని. అందుకు నేను ఎంచుకున్న మాధ్యమం కార్టూన్‌. ఎవరేమన్నా నా భావాలను ధైర్యంగా పంచుకుంటూ వచ్చా. కానీ అంతర్జాతీయ అవార్డు అందుకున్నా అంటే నమ్మలేకపోయా. కానీ దీనికి నువ్వు అర్హురాలివి అని అంతా అంటోంటే చాలా ఆనందంగా ఉంది’ అంటోంది రుచిత.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్